గూగుల్, ఫేస్‌బుక్ ఎఫెక్ట్: భారత్‌కు అమెరికా డిజిటల్ ట్యాక్స్ షాక్!
భారత్‌కు డిజిటల్ ట్యాక్స్ షాక్ తగలనుంది! డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక చైనా, భారత్‌తో పాటు వివిధ దేశాలతో టారిఫ్ యుద్ధం నడుస్తోంది. డ్రాగన్ దేశంతో అయితే ట్రేడ్ వార్ పతాకస్థాయికి చేరుకుంది. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా... భారత్ సహా వివిధ దేశాలపై డిజిటల్ ట్యాక్స్‌కు ప్రతీకార సుంకం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇటలీ దేశాలు టెక్ దిగ్గజాలు ఫేస్‌బుక్, గూగుల్ వంటి సంస్థలపై స్థానికంగా విధించే డిజిటల్ ట్యాక్స్‌కు ఈ దేశాలపై ప్రతీకార సుంకం విధించనుంది.

ప్రతీకార సుంకం
అమెరికా ట్రేడ్ యాక్ట్ 1974 సెక్షన్ 301 ప్రకారం అమెరికా ట్రేడ్ ప్రతినిధులు జూన్ నెలలో పది దేశాలపై విచారణ ప్రారంభించింది. పలు దేశాలు వాణిజ్య నిబంధనలను ఉల్లంఘించాయని, అధిక టారిఫ్ విధిస్తున్నాయని గుర్తించారు. అంతేకాదు, తమ మేథో సంపత్తిని దొంగిలిస్తోందని, తమ ఉత్పత్తులపై అధిక టారిఫ్ విధిస్తోందని చైనాపై ట్రంప్ పరిపాలనా వర్గం భారీ టారిఫ్ విధించాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇటలీపై త్వరలో అమెరికా సుంకం విధించే అవకాశాలు ఉన్నాయని, ఆ తర్వాత వరుసలో బ్రెజిల్, చెక్ రిపబ్లిక్, ఇండోనేషియా, స్పెయిన్, టర్కీ, యూకే, యూరోపియన్ యూనియన్ కూటమి దేశాలు ఉన్నాయి.

అమెరికా-ఫ్రెంచ్ ఒప్పందం
స్పెయిన్, చెక్ రిపబ్లిక్ జనవరి నుండి డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయనున్నాయి. దీనికి సంబంధించి అమెరికా ట్రేడ్ ప్రతినిధులు(USTR) స్పందించాల్సి ఉంది. గత ఏడాది USTR ఫ్రెంచ్ వైన్స్, చీసెస్, ఇతర ఉత్పత్తులపై 2.4 బిలియన్ డాలర్ల మేర ట్యాక్స్ విధించింది. అయితే 2020 ఏడాది పూర్తయ్యే వరకు సుంకాలు, పన్ను వసూలు రెండింటిని తాత్కాలికంగా నిలిపివేయాలని ఇరుదేశాలు అంగీకారానికి వచ్చాయి. అయితే ఈ రెండు వచ్చే ఏడాదికి అమల్లోకి రావొచ్చు. ఈ ఒప్పందం పొడిగించే అవకాశం లేకపోవచ్చు.

గ్లోబల్ ట్యాక్స్... ఇండివిడ్యువల్
ఇదిలా ఉండగా, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD) మధ్యవర్తిత్వంతో అంతర్జాతీయ డిజిటల్ ట్యాక్స్ అగ్రిమెంట్ ప్రణాళికలు 2021 వేసవి వరకు పొడిగించబడ్డాయి. ఇండివిడ్యువల్ దేశీయ డిజిటల్ ట్యాక్స్‌కు బదులు గ్లోబల్ డిజిటల్ ట్యాక్స్ ప్రణాళికతో వస్తోంది. అయితే ఈ డీల్‌కు ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి. అయితే OECD డీల్ కంటే తమ తమ సొంత ట్యాక్సుల వైపు వివిధ దేశాలు మొగ్గు చూపుతున్నాయి. బెల్జియం, నార్వే, లాట్వియా వంటి దేశాలు వచ్చే ఏడాది డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్‌ను ప్రవేశ పెట్టనుంది.