ఇరాన్–అమెరికా యుద్ధంపై షాకింగ్ న్యూస్.. ఎవరి ఆయుధాలు ముందుగా అయిపోతాయో తెలుసా..
పశ్చిమాసియాలో యుద్దం కొనసాగుతోంది. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య మొదలైన వార్ కేవలం మూడు రోజుల్లోనే తీవ్రమైన యుద్ధ రూపం దాల్చింది. ఇరాన్ ప్రయోగిస్తున్న డ్రోన్ దాడులు బహ్రెయిన్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వరకు ఉన్న అమెరికా, దాని మిత్రదేశాల రక్షణ వ్యవస్థలపై భారీ ఒత్తిడి తెస్తున్నాయి. ఈ యుద్ధంలో ఎవరి ఆయుధ నిల్వలు ముందుగా ఖాళీ అవుతాయనే అంశమే తుది ఫలితాన్ని నిర్ణయించే కీలక అంశంగా మారింది.
ఇరాన్ వినియోగిస్తున్న షాహెద్-136 వన్‌వే అటాక్ డ్రోన్లు, చిన్న క్రూయిజ్ క్షిపణులు మధ్యప్రాచ్యం అంతటా లక్ష్యాలను ఛేదిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ శనివారం నుంచి ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించిన తర్వాత.. డ్రోన్లు అమెరికా సైనిక స్థావరాలు, చమురు మౌలిక సదుపాయాలు, పౌర భవనాలపై దాడులు చేశాయి. ఈ దాడులు డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, ప్రెసిషన్ గైడెడ్ బాంబుల సమ్మిళిత రూపంలో సాగుతున్నాయి.

అమెరికా తయారు చేసిన పేట్రియాట్ వైమానిక రక్షణ క్షిపణులు ఇరానియన్ షాహెద్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడంలో గణనీయంగా విజయవంతమయ్యాయి. యూఏఈ అధికారుల ప్రకారం.. ఈ రక్షణ వ్యవస్థలు 90 శాతం కంటే ఎక్కువ ఇంటర్‌సెప్షన్ రేటును నమోదు చేశాయి. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఒక్కో ఇరాన్ డ్రోన్ ఖర్చు సుమారు 20 వేల డాలర్లు కాగా, వాటిని కూల్చేందుకు ఉపయోగిస్తున్న పేట్రియాట్ క్షిపణి ఖర్చు దాదాపు 4 మిలియన్ డాలర్లు. చౌక ఆయుధాలతో ఖరీదైన రక్షణ వ్యవస్థలను ఖాళీ చేయించే ఈ వ్యూహం పాశ్చాత్య సైనిక ప్రణాళికదారులకు పెద్ద సవాలుగా మారింది.
ఈ పరిస్థితుల్లో ఇరాన్, అమెరికా రెండింటికీ వచ్చే కొన్ని రోజులు లేదా వారాల్లో ఆయుధాల కొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎవరు ఎక్కువ కాలం ఆయుధాలు నిల్వ ఉంచుకోగలరో వారు ఈ యుద్ధంలో పైచేయి సాధించే అవకాశముంది. గాజాలో యుద్ధం గతంలో జరిగిన ఇజ్రాయెల్-అమెరికా దాడుల కారణంగా ఇరాన్‌కు చెందిన ప్రాంతీయ ప్రాక్సీలు బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రత్యక్షంగా డ్రోన్ యుద్ధాన్ని నడిపిస్తూ దీర్ఘకాలిక అట్రిషన్ వ్యూహాన్ని అమలు చేస్తోంది.
స్టిమ్సన్ సెంటర్‌కు చెందిన సీనియర్ విశ్లేషకురాలు కెల్లీ గ్రికో ప్రకారం ఇరాన్ లక్ష్యం అమెరికా, గల్ఫ్ దేశాల రాజకీయ సంకల్పాన్ని దెబ్బతీయడమేనని చెప్పవచ్చు. బ్లూమ్‌బెర్గ్ న్యూస్ విశ్లేషణ ప్రకారం, ఖతార్ వద్ద ఉన్న పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు ప్రస్తుత వినియోగం కొనసాగితే నాలుగు రోజులు మాత్రమే సరిపోతాయి. అయితే ఖతార్ ప్రభుత్వం తమ వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని అధికారికంగా ప్రకటించింది.
ఇరాన్ వద్ద దాదాపు 2,000 బాలిస్టిక్ క్షిపణులు ఉన్నట్లు అంచనా కాగా, షాహెద్ డ్రోన్ల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇరాన్ ఇప్పటికే 1,200కు పైగా డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ యుద్ధం ఆధునిక కాలంలోని ఖర్చుల యుద్ధంగా మారింది. చౌక డ్రోన్లతో ఖరీదైన రక్షణ వ్యవస్థలను ఖాళీ చేయడం ఇరాన్ వ్యూహం కాగా, అమెరికా, దాని మిత్రదేశాలకు ఇది దీర్ఘకాలిక సవాలుగా మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications