Iran war: ఇరాన్‌లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ఏం జరుగుతోంది?
పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ఇరాన్ తన అత్యున్నత నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. గత శనివారం అమెరికా , ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన భారీ దాడుల్లో (Operation Epic Fury) ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. బుధవారం సాయంత్రం జరగాల్సిన వీడ్కోలు వేడుకలను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ప్రకటించింది.

అంత్యక్రియల వాయిదాకు కారణం ఏమిటి?
ఇరాన్ అధికారుల సమాచారం ప్రకారం.. ఖమేనీకి చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. ఇంత భారీ స్థాయిలో ప్రజలు తరలివస్తే వారిని నియంత్రించడం, భద్రతా ఏర్పాట్లు చేయడం ప్రస్తుతం ఒక పెద్ద సవాలుగా మారింది. "అనూహ్యమైన జనసందోహం వచ్చే అవకాశం ఉన్నందున, సరైన మౌలిక సదుపాయాలు , ఏర్పాట్ల కోసం ఈ వేడుకను వాయిదా వేస్తున్నాం. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తాం" అని ఇరాన్ ఇస్లామిక్ డెవలప్‌మెంట్ కోఆర్డినేషన్ కౌన్సిల్ తెలిపింది.
ఇరాన్ యుద్ధం (iran war).. తాజా పరిణామాలు
ఖమేనీ మరణంతో ఇరాన్ చేస్తున్న యుద్ధం (iran war) మరింత తీవ్రతరమైంది. ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే 40 రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. తొలుత టెహ్రాన్‌లో నివాళులర్పించిన తర్వాత.. ఖమేనీ భౌతిక కాయాన్ని ఆయన జన్మస్థలమైన పవిత్ర నగరం మషద్‌కు తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే గత ఆరు రోజులుగా టెహ్రాన్ , ఇతర కీలక ప్రాంతాలపై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణి దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. దీనివల్ల భద్రతా కారణాల రీత్యా కూడా ఈ వాయిదా పడి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రపంచ దేశాల్లో ఆందోళన
ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ నాయకత్వంలో పెద్ద శూన్యం ఏర్పడింది. దీనిని భర్తీ చేసే క్రమంలో ఇరాన్ ప్రతికార దాడులకు దిగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడం , స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు లోనవ్వడం జరుగుతోంది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వదిలిపెట్టడానికి సిద్ధమని ఒకవైపు దౌత్యపరమైన సంకేతాలు ఇస్తున్నప్పటికీ, మరోవైపు యుద్ధ వాతావరణం మాత్రం తగ్గడం లేదు. ఇరాన్ అంతటా భారీ నిరసనలు, ప్రార్థనలు జరుగుతున్నాయి. 1989లో ఖొమేనీ అంత్యక్రియలకు వచ్చినంత భారీ స్థాయిలో జనం ఇప్పుడు ఖమేనీకి వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications