Iran war: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు బాంబు తయారీ ఆపేస్తాం! కానీ ఆ ఒక్క కండిషన్!
పశ్చిమ ఆసియాలో గత ఆరు రోజులుగా జరుగుతున్న భీకర పోరు(Iran war)లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఇరాన్ తన వివాదాస్పద అణు కార్యక్రమాన్ని (Nuclear Programme) పూర్తిగా వదిలిపెట్టడానికి సిద్ధమని ప్రకటించింది. అయితే దీనికి ఒకే ఒక్క కఠినమైన షరతును విధించింది. అమెరికా తమకు 'సంతృప్తికరమైన ప్రత్యామ్నాయ ఆఫర్' ఇస్తేనే అణు మార్గం నుంచి తప్పుకుంటామని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి మాజిద్ తఖ్త్-రావాంచీ స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో హాట్ టాపిక్‌గా మారింది.

యుద్ధం మధ్యలో శాంతి మాటలు?
ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా చేపట్టిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో భాగంగా ఫిబ్రవరి 28 న ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడితో తీవ్రంగా దెబ్బతిన్న ఇరాన్.. ఇప్పుడు దౌత్యపరమైన మార్గాల వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. నిజానికి అణు ఒప్పందంపై ఒమన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరగాల్సి ఉన్నప్పటికీ.. అవి విఫలం కావడంతోనే అమెరికా సైనిక చర్యకు దిగింది. తమ గడువు ముగియకముందే అమెరికా దాడులు ప్రారంభించిందని ఇరాన్ ఆరోపిస్తోంది.
అమెరికా పెట్టిన ఆ 'షరతు' ఏమిటి?
స్కై న్యూస్ అరేబియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తఖ్త్-రావాంచీ మాట్లాడుతూ.. "అమెరికా గనుక మాకు 'శాటిస్‌ఫాక్టరీ ఆఫర్' ఇస్తే.. మేము అణు కార్యక్రమాన్ని పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం" అని తెలిపారు. అంటే ఆర్థిక ఆంక్షల తొలగింపు లేదా భద్రతా పరమైన హామీలను ఇరాన్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా మాత్రం ఇందుకు భిన్నమైన వాదనను వినిపిస్తోంది. ఇరాన్ గనుక అణు ఆయుధాలను తయారు చేస్తే అది ప్రపంచానికే ముప్పు అని ట్రంప్ ప్రభుత్వం గట్టిగా హెచ్చరిస్తోంది.
అసలేంటి శాటిస్‌ఫాక్టరీ ఆఫర్?
ఇరాన్ పేర్కొన్న 'సంతృప్తికరమైన ప్రత్యామ్నాయం' (Satisfactory Alternative) అంటే కేవలం నగదు సాయం మాత్రమే కాదు, అది ప్రధానంగా ఆ దేశ భద్రత, ఆర్థిక మనుగడకు సంబంధించిన హామీ. తమపై విధించిన కఠినమైన అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలను (Economic Sanctions) పూర్తిగా ఎత్తివేసి, చమురు ఎగుమతులు, ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థలోకి స్వేచ్ఛగా ప్రవేశం కల్పించాలని ఇరాన్ కోరుతోంది. దీనితో పాటు, తమ అణు కార్యక్రమాన్ని ఆపివేస్తే భవిష్యత్తులో అమెరికా లేదా ఇజ్రాయెల్ తమపై మళ్ళీ దాడులు చేయబోవని బలమైన రక్షణ ఒప్పందాలు (Defense Agreements), అంతర్జాతీయ భద్రతా హామీలను వారు ఆశిస్తున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే.. తమ దేశ సార్వభౌమాధికారానికి ముప్పు ఉండదని అలాగే ఆర్థికంగా ఎదిగేందుకు అమెరికా పూర్తి సహకారం అందిస్తుందని నమ్మకం కలిగించే ప్యాకేజీనే ఇరాన్ డిమాండ్ చేస్తోంది.
ఏదేమైనా ప్రస్తుతానికి యుద్ధం కొనసాగుతున్నప్పటికీ.. ఇరాన్ చేసిన ఈ ప్రతిపాదన ఒక చిన్న శాంతి ఆశను చిగురింపజేస్తోంది. అమెరికా స్పందనను బట్టి వెస్ట్ ఆసియా భవిష్యత్తు, గ్లోబల్ మార్కెట్ల గమనం ఆధారపడి ఉంటుంది.


Click it and Unblock the Notifications