అమెరికాలో భారీగా లేఆప్స్, కొత్త దారిని వెతుక్కుంటున్న భారతీయులు..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతీయులకు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా H-1B వీసా మీద అగ్రరాజ్యానికి వెళ్లే ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది శ్వేతసౌధం. ఇక ఈ పరిస్థితుల మధ్య అమెరికాలో టెక్ తొలగింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. వేలాది మంది ఉద్యోగులను అమెరికాలో కంపెనీలు తీసేస్తున్నాయి. ట్రంప్ పెట్టిన కఠిన నిబంధనలు ఉద్యోగుల పాలిట శాపంలా మారాయి. ఇతర దేశాలపై ట్రంప్ తీసుకున్న సుంకాల ప్రభావంతో అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది.
ఈనేపథ్యంలోనే H-1B వర్క్ వీసా దరఖాస్తులను పరిశీలించడం చాలా ఆలస్యంగా మారింది. కఠినతరం కూడా కావడంతో అమెరికాకు వెళ్లే భారతీయ ఉద్యోగులు ఆందోళన పడుతున్నారు. అయితే ఇప్పుడు అమెరికాలోని కంపెనీ యజమానులు అలాగే భారత్ నుంచి అక్కడికి వెళ్లే ఉద్యోగులు ఇతర మార్గాల వైపు తమ చూపును సారించారు. ఇందులో భాగంగానే వీరంతా H-1B వర్క్ వీసాలను వదిలేసి L-1, O-1 వంటి ఇతర వలసేతర వీసాలకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీసాల కోసం ధరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందని మ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటుగా EB-5 వలస పెట్టుబడిదారుల వీసాలకు కూడా అగ్రరాజ్యంలో డిమాండ్ పెరుగుతోంది.

అయితే ఇవి గతంలో కూడా ఉన్నప్పటికీ ఈ సారి వీటిని అప్లయి చేసేవారి సంఖ్య భారీ స్థాయిలో ఉందని అమెరికా ఇమ్మిగ్రేషన్ న్యాయవాది జ్ఞానమూకన్ సెంతుర్జోతి జాతీయ మీడియాకు తెలిపారు. ఇదిలా ఉంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) లెక్కల ప్రకారం ఈ ఏడాది షార్ట్‌లిస్ట్ చేయబడిన H-1B వీసా దరఖాస్తుల సంఖ్య దాదాపు 27 శాతానికి తగ్గింది. కరోనా తర్వాత ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి.
ప్రతీ ఏడాది విదేశాల నుంచి అమెరికాకు వచ్చే ఉద్యోగుల కోసం అగ్రరాజ్యం 85 వేల వీసాలను అందిస్తోంది. ఈ వీసాలను తీసుకుంటున్న వారిలో 70% మంది భారతీయులే ఉన్నారు. టాప్ టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్ వంటి కంపెనీలు ఈ మధ్య లేఆప్స్ చేపట్టడంతో అమెరికాలో పనిచేస్తున్న భారతీయ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. ఈనేపథ్యంలో అమెరికా ప్రయాణం సురక్షితమేనా అని విచారణ చేసే వారి సంఖ్య రోజు రొజుకు పెరుగుతుందని ఇమ్మిగ్రేషన్ సంస్థ మూర్తి లా ఫర్మ్ న్యాయవాది జోయెల్ యానోవిచ్ చెబుతున్నారు.
ఈ పరిస్థితులన్నీ H-1B లాగా వార్షిక పరిమితులు లేని L-1, O-1 వీసా దారుల డిమాండ్ పెరగడానికి కారణం అయ్యాయని చెబుతున్నారు.L-1 వీసా ఇంట్రా-కంపెనీ అంటే విదేశాలలో ఉద్యోగం చేసి మళ్లీ అమెరికాకు బదిలీ కోసం పొందుతారు. అలాగే O-1 వీసా సైన్స్, కళలు లేదా వ్యాపారం వంటి రంగాలలో నైపుణ్యం ఉన్న వారికి మంజూరు చేస్తారు. ఇక మరో వీసా EB-5 కు కూడా డిమాండ్ బాగా పెరిగింది. ఇది పెట్టుబడిదారుల కోసం ఇచ్చే వీసా. జనవరి 2025 నుండిపెట్టుబడిదారుల ఇచ్చే EB-5 వీసాలకు డిమాండ్ 50% పెరిగిందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు.
భారత్ నుంచి వెళ్లే పౌరులకు ఈ వీసాలు ఇప్పుడు ఆపధ్బాంధవుడిగా కనిపిస్తున్నాయి. పైగా త్వరగా కూడా వీసా ప్రక్రియ పూర్తివుతోంది. అందువల్ల అందరూ దీని వైపు మొగ్గు చూపుతున్నారు. EB-5 వీసాలకు ముఖ్యంగా H-1Bలో H-1B వీసాతో అమెరికాలో ఉంటున్న వారి పిల్లలు వృద్ధాప్యంలో ఉన్న భారతీయ కుటుంబాల నుండి డిమాండ్ ఎక్కువగా ఉందని డేవిస్ & అసోసియేట్స్ LLCలో ఇండియా & GCC ప్రాక్టీస్ టీం కంట్రీ హెడ్ సుకన్య రామన్ చెబుతున్నారు.ఈ వీసా తల్లిదండ్రులు గ్రీన్ కార్డ్ పొందే ముందు 21 సంవత్సరాలు నిండిన పిల్లలకు ఇస్తుంటారు.