ఇరాన్ తర్వాత ఈక్వెడార్ మీద గురిపెట్టిన అమెరికా... నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులను ఏరిపారేస్తున్న ట్రంప్ సైన్యం..
పశ్చిమాసియా దేశాలపై అమెరికా దాడులు ఆగడం లేదు. ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై యుద్ధాన్ని ప్రారంభించిన మూడు రోజులకే మరో దేశాన్ని టార్గెట్ చేశాడు ట్రంప్. మధ్యప్రాచ్యంలో ఇరాన్‌పై యుద్ధాన్ని స్టార్ట్ చేసిన మూడు రోజుల తర్వాత మరో దేశపైకి సైన్యాన్ని మోహరించాడు. లాటిన్ అమెరికాలోని ఈక్వెడార్ ని లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించాడు. అక్కడ నిర్దేశిత ఉగ్రవాద సంస్థలుగా పేర్కొన్న నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులపై అమెరికా-ఈక్వెడార్ ఉమ్మడి సైనిక ఆపరేషన్లు ప్రారంభమయ్యాయి.
ప్రపంచం మొత్తం ఇరాన్ యుద్ధంపైనే దృష్టి పెట్టిన వేళ.. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా, వ్యూహాత్మకంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఇప్పటికే ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలోనే కాకుండా తన స్వంత MAGA వర్గాల నుంచీ విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్, మరోసారి అమెరికా సైనిక శక్తిని విదేశాల్లో వినియోగించడం గమనార్హం.

మార్చి 3వ తేదీన.. Ecuador సైనిక దళాలతో కలిసి అమెరికా దళాలు అక్కడి నార్కో-టెర్రరిజానికి వ్యతిరేకంగా ఆపరేషన్లు ప్రారంభించినట్లు US Southern Command అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు X (ట్విట్టర్)లో అర్థరాత్రి పోస్ట్ విడుదల చేసింది. లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల్లో నార్కో-టెర్రరిజం అనే మహా విపత్తును ఎదుర్కోవడంలో మా భాగస్వాముల నిబద్ధతకు ఇది ఉదాహరణ అని ఆ ప్రకటనలో పేర్కొంది.
ఆ పోస్ట్‌కు జత చేసిన వీడియోలో.. ఒక హెలికాప్టర్ సైనికులను తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వీడియోలో ప్రదేశం వెల్లడించకపోయినా, ఈక్వెడార్‌లో వరుస దాడుల్లో ఇది తొలి దశ అని అధికారులు సూచించారు. సదరన్ కమాండ్ జనరల్ ఫ్రాన్సిస్ ఎల్. డోనోవన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నార్కో-ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటంలో ఈక్వెడార్ సాయుధ దళాలు చూపుతున్న ధైర్యం, సంకల్పాన్ని ప్రశంసించారు.
ఈ ఆపరేషన్లపై New York Times కీలక కథనం ప్రచురించింది. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. అమెరికా స్పెషల్ ఫోర్సెస్ సైనికులు నేరుగా దాడుల్లో పాల్గొనడం లేదని, అయితే ఈక్వెడార్ కమాండోలకు ప్రణాళికలు, నిఘా సమాచారం, లాజిస్టిక్స్ పరంగా సహకారం అందిస్తున్నారని ఒక అమెరికా అధికారి వెల్లడించారు.
ఇదంతా జరుగుతున్న సమయంలోనే.. ఇరాన్ యుద్ధం అమెరికా సైనిక వనరులపై తీవ్ర ఒత్తిడి తెస్తోందన్న ఆందోళనలు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఆ యుద్ధంలో కనీసం ఆరుగురు అమెరికా సైనికులు మరణించినట్లు నిర్ధారణ కాగా.. మరిన్ని ప్రాణనష్టాలు సంభవించే అవకాశాన్ని ట్రంప్ స్వయంగా అంగీకరించారు. వైమానిక రక్షణ క్షిపణుల నిల్వలు వేగంగా తగ్గుతున్నాయన్న సమాచారం సైనిక వర్గాల్లో కలవరం రేపుతోంది.
ఈక్వెడార్ ఆపరేషన్‌ను ట్రంప్ పరిపాలన మద్దతు చర్యగా అభివర్ణించినప్పటికీ, న్యాయ నిపుణులు, మానవ హక్కుల సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. గత నెలల్లో కరేబియన్, తూర్పు పసిఫిక్ ప్రాంతాల్లో జరిగిన అనేక దాడుల్లో వందల మంది మరణించగా, వాటికి తగిన ఆధారాలు లేవని వారు వాదిస్తున్నారు.కొత్త యుద్ధాలు వద్దని గతంలో ప్రకటించిన ట్రంప్, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరాన్, వెనిజులా, సిరియా, యెమెన్, ఇరాక్, సోమాలియా వంటి అనేక దేశాల్లో సైనిక చర్యలకు ఆమోదం తెలపడం విశేషం. ఈక్వెడార్ ఆపరేషన్, ట్రంప్ విదేశాంగ విధానం మరింత దూకుడుగా మారుతోందన్న సంకేతంగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications