English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

ప‌న్ను ప్ర‌ణాళిక గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీ కోస‌మే

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

ప‌న్ను ప్ర‌ణాళిక అంటే మీ ఆదాయం, పొదుపు, మ‌దుపుల ఆధారంగా ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను అన్నీ గ‌రిష్టంగా ఉప‌యోగించి త‌క్కువ ప‌న్నులు క‌ట్టేలా చూసుకోవ‌డ‌మే. ఆర్థిక సంవత్సరం ముగిసే స‌మ‌యానికి గానీ చాలామంది పన్ను మినహాయింపు కోసం పెట్టుబడులు పెట్టాలనే విషయాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోరు. అప్పుడు హ‌డావిడిలో అవ‌స‌రం లేని బీమా పాల‌సీల‌ను కొనుగోలు చేయ‌డం, ఏదో పెట్టుబ‌డి ప‌థకంలో డ‌బ్బు మ‌దుపు చేయ‌డం వంటివి చేస్తుంటారు. ఇలాంటి చేదు అనుభవాలన్నీ తప్పాలంటే.. ముందు నుంచే పన్ను ఆదాకు సిద్ధం కావాలి. అందుకోసం ఈ సూత్రాల‌ను పాటించి సాఫీగా ప‌న్ను క‌ట్టేందుకు త‌యార‌వ్వండి.

ఎన్నో ప‌న్ను ఆదా ఆప్ష‌న్లు

ఎన్నో ప‌న్ను ఆదా ఆప్ష‌న్లు

మ‌న దేశంలో ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు పొందేందుకు చాలా ఆప్ష‌న్లు ఉన్నాయి. సెక్ష‌న్ 80సీ మొద‌లుకొని 80యూ వ‌ర‌కూ వివిధ మార్గాల్లో పన్నుచెల్లింపుదార్లు మిన‌హాయింపుల‌ను క్లెయిం చేయ‌వ‌చ్చు. ఆర్థిక ప్రణాళికలో పన్ను ఆదా ఒక భాగం మాత్రమే. కానీ పన్ను ఆదా చేసుకోవడమే ఆర్థిక ప్రణాళిక అనుకోవడం పొరపాటు. అందులో భాగంగా ఇప్ప‌టి నుంచే మీ పొదుపు, పెట్టుబ‌డులు, ప‌న్ను మిన‌హాయింపుల‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌ల‌ను సిద్దం చేసుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు 30 శాతం ప‌న్ను శ్లాబులో ఉన్న వాళ్లు సంప్ర‌దాయ ప‌న్ను ఆదా మార్గాల‌ను వ‌దిలి కొత్త వాటి వైపు చూడాలి. ఇలాంటి వారు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాల‌నే కాకుండా మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ప‌రిశీలించాలి. దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక ఉన్న‌వారు రిస్క్ తీసుకోగ‌లిగితే డెట్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం సూచ‌నీయం.

ఆదాయ‌పు పన్ను మిన‌హాయింపుల కోసం

ఆదాయ‌పు పన్ను మిన‌హాయింపుల కోసం

పన్ను కోత తప్పించుకోవడానికి మదుపు చేసే ముందు పాత పెట్టుబడుల గురించి ఒకసారి చూసుకోండి. సెక్షన్‌ 80సీ కింద గరిష్ఠంగా రూ.1,50,000 వరకూ మినహాయింపు వర్తిస్తుంది. ఇందులో ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌, పీపీఎఫ్‌, జీవిత బీమా పాలసీలకు చెల్లించిన ప్రీమియం, ఎన్‌ఎస్‌సీ, ఐదేళ్ల బ్యాంకు డిపాజిట్లు, ఈఎల్‌ఎస్‌ఎస్‌, పిల్లల ట్యూషన్‌ ఫీజులు, పోస్టాఫీసు పెద్దల పొదుపు పథకం, గృహరుణానికి చెల్లించిన అసలు, జాతీయ పింఛను పథకం, సుకన్య సమృద్ధి యోజనలాంటి పథకాల్లో మదుపు చేసిన మొత్తానికి మినహాయింపు లభిస్తుంది. వీటిలో ఏయే పథకాల్లో ఎంతెంత పెట్టుబడి ఉందో చూసుకోండి. కొత్తగా మదుపు చేయాలనుకున్నప్పుడు.. తక్కువ వ్యవధి ఉండే పథకాలను ఎంచుకోవడం మేలు.

ఫిక్స్‌డ్ ఇన్‌క‌మ్‌ల్లో ఎక్కువ వ‌ద్దు

ఫిక్స్‌డ్ ఇన్‌క‌మ్‌ల్లో ఎక్కువ వ‌ద్దు

డెట్ ప‌థ‌కాల్లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా మీ పోర్ట్‌ఫోలియోను బ్యాలెన్స్ చేసుకోవ‌చ్చు. ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌, ఈపీఎఫ్‌, ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటివి పోర్ట్‌ఫోలియో మొత్తంగా విశ్లేషించి చూస్తే మంచి రాబ‌డినే ఇస్తాయ‌ని ఆశించ‌లేం.

కాబ‌ట్టి డెట్‌-ఈక్విటీ స‌మ‌తౌల్యంగా ఉండేలా చూసుకోవ‌డం మంచిది. ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్ సంబంధిత సాధ‌నాల‌ని అర్థం చేసుకోవాలి. ఎక్కువ మంది స్టాక్ మార్కెట్‌పై అవ‌గాహ‌న లేని కార‌ణంగా వాటి జోలికెళ్ల‌రు. అలాంటి వారు మ్యూచువ‌ల్ ఫండ్ల వైపు ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఈక్విటీ,డెట్‌,బ్యాలెన్స్‌డ్ అని మూడు ర‌కాల ఫండ్ల‌లో మీకు అనుగుణ‌మైన వాటిని ఎంచుకోవ‌చ్చు. డెట్ అంటే కొద్దిగా రిస్క్ త‌క్కువ ఉండి ప్ర‌భుత్వ ప‌థకాల్లో పెట్టుబ‌డి పెట్టే మ్యూచువ‌ల్ ఫండ్లు. బ్యాలెన్స్‌డ్ అంటే కొద్దిగా షేర్ల‌లోనూ, కొద్దిగా ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో పెట్టుబ‌డి పెట్టే ఫండ్లు. మీరు ఇదివ‌ర‌కే ఎక్కువ‌గా డెట్ సాధ‌నాల్లో పెట్టుబ‌డులు పెట్టి ఉంటే ప్ర‌స్తుతం ఈక్విటీని ఎంచుకోవ‌డం సూచ‌నీయం.

సెక్ష‌న్ 80(సీ)యే కాదు

సెక్ష‌న్ 80(సీ)యే కాదు

సెక్ష‌న్ 80సీ కింద గ‌రిష్టంగా రూ.1ల‌క్షా యాభై వేల వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపుల‌కు క్లెయిం చేసుకోవ‌చ్చ‌ని అంద‌రికీ తెలుసు.

విద్యా రుణానికి చెల్లించే వడ్డీకి సెక్షన్‌ 80ఈ ప్రకారం పూర్తి మినహాయింపు వర్తిస్తుంది. కాబట్టి, దీనికి చెల్లించే వడ్డీని ఎప్పటికప్పుడు కట్టేయడం మేలు. దీనివల్ల ఒకేసారి చెల్లించాల్సిన భారం తప్పుతుంది. రాజీవ్ గాంధీ ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కం(ఆర్‌జీఈఎస్ఎస్‌)లో పెట్టే పెట్టుబ‌డుల‌కు రూ. 50 వేల వ‌ర‌కూ ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ఇంకా హౌస్ రెంట్ అల‌వెన్సు(80జీజీ), గృహ రుణం(సెక్ష‌న్ 24), ఆరోగ్య బీమా ప్రీమియం(80డీ)ల‌కు ట్యాక్స్ సేవింగ్ స‌దుపాయం క‌ల‌దు. అంతే కాకుండా సెక్ష‌న్ 80జీ కింద ఎన్‌జీవోల‌కు చేసే డొనేష‌న్ల‌కు ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ఇంకా గ్రామీణాభివృద్ది, ప్ర‌ధాన‌మంత్రి రిలీఫ్ ఫండ్‌, రాజ‌కీయ పార్టీలు, శాస్త్రీయ ప‌రిశోధ‌న‌ల‌కు ఇచ్చే విరాళాల‌కు సైతం ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.

ఈక్విటీల్లో పెద్ద మొత్తంలో

ఈక్విటీల్లో పెద్ద మొత్తంలో

కొంత మంది పెట్టుబ‌డిదారులు ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాల్లో ఎక్కువ పెట్టుబ‌డి పెడ‌తారు. ఏదైనా ఎక్కువ చేస్తే అది కొద్దిగా ప్ర‌మాద‌క‌ర‌మే. మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లు ప్ర‌వేశ‌పెట్టే ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాల ద్వారా ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చ‌నే ఆలోచ‌న‌తో పెద్ద మొత్తంలో ఇందులో మ‌దుపు చేస్తారు. మార్కెట్‌ను గ‌మనించ‌కుండా పెద్ద మొత్తంలో ఒకేసారి ఈక్విటీ పెట్టుబ‌డుల్లో గుమ్మ‌రించ‌డం త‌ప్పు. పెట్టుబ‌డుల‌ను ఏడాదిలో నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిలో(నెల‌వారీ లేదా త్రైమాసికానికి ఒక‌సారి) విభ‌జించుకుని చేయ‌డం మంచిది.

ఇది కూడా చ‌ద‌వండి బంగారంపై వివిధ రకాల పెట్టుబ‌డులు

 బీమా పాల‌సీలు

బీమా పాల‌సీలు

ట్యాక్స్ సేవింగ్ సీజ‌న్ల‌లో బ్యాంకుల్లో అడుగు పెట్టారంటే బ్యాంకు ప్ర‌తినిధులు పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌ల‌కు సంబందించిన ఎన్నో స‌ల‌హాలు ఇస్తారు. ఇందులో ఎక్కువ క‌మీష‌న్ కోస‌మే చాలా మంది ప్ర‌య‌త్నిస్తారు. అవి మీకు ప్ర‌ణాళిక‌లో ఉప‌యోగ‌ప‌డ‌క‌పోయినా వారి క‌మీష‌న్ కోసం పెట్టుబ‌డిదారుల‌పై బ‌ల‌వంతంగా రుద్దడానికి చూస్తారు. ఇలాంటి వాటిలో ఎండోమెంట్ ప్లాన్లు మొద‌ట ఉంటాయి. ఎండోమెంట్ ప్లాన్ అనేది దీర్ఘ‌కాలిక పాల‌సీ అనే విష‌యం చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. వీటికి కాల‌ప‌రిమితి 10 నుంచి 20 ఏళ్ల వ‌ర‌కూ ఉండొచ్చు.మీరు ఐదేళ్ల పాటు పాల‌సీ ప్రీమియం క‌ట్టి, త‌ర్వాత మీ పెట్టుబ‌డిని వెన‌క్కు తీసుకోవాల‌నుకుంటే ఒక్కోసారి మీ అస‌లు క‌న్నా త‌క్కువ మొత్తం రాబడి కూడా రావొచ్చు. ఎందుకంటే ఎండోమెంట్ ప్లాన్ల‌లో మీరు క‌ట్టే ప్రీమియంలో కొంత భాగం మోర్టాలిటీ రుసుముల‌, డిస్ట్రిబ్యూట‌ర్ క‌మీష‌న్ రూపంలో పోతుంది. ఇప్ప‌టివ‌ర‌కూ మీకు ట‌ర్మ్ పాల‌సీ లేక‌పోతే ఒక‌టి తీసుకుని త‌ర్వాత మిగిలిన బీమా పాల‌సీల గురించి ఆలోచించ‌డం మంచిది.

Read more about: tax, income tax, tax savings, tax planning
English summary

what are the Best tax saving options for the year 2017 in India

Tax planning is the analysis of one’s financial situation from a tax efficiency point of view so as to plan one’s finances in the most optimized manner. Tax planning allows a taxpayer to make the best use of the various tax exemptions, deductions and benefits to minimize their tax liability over a financial year. Tax planning is a legal way of reducing income tax liabilities, however caution has to be maintained to ensure that the taxpayer isn’t knowingly indulging in tax evasion or tax avoidance.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC