Layoffs: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్.. 30 వేల మందిపై వేటు? అసలు కారణం ఇదేనా?
ప్రపంచ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) ఇప్పుడు ఒక భారీ సంక్షోభంలో చిక్కుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు పోటీగా నిలవాలనే ఉద్దేశంతో చేస్తున్న భారీ ఖర్చులు, ఇప్పుడు ఆ సంస్థ ఉద్యోగుల పాలిట శాపంగా మారాయి. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఒరాకిల్ తన ఖర్చులను తగ్గించుకోవడానికి సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించే (layoffs) యోచనలో ఉంది. ఇది ఒరాకిల్ చరిత్రలోనే అతిపెద్ద పునర్వ్యవస్థీకరణగా నిలవనుంది.

ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు
ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్.. ఏఐ రంగంలో దూసుకుపోవాలని దాదాపు 300 బిలియన్ డాలర్ల భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా ఓపెన్ ఏఐ (OpenAI) తో భాగస్వామ్యం కుదుర్చుకుని.. టెక్సాస్, విస్కాన్సిన్ వంటి ప్రాంతాలలో భారీ డేటా సెంటర్లను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల కోసం కేవలం రెండు నెలల్లోనే ఒరాకిల్ 58 బిలియన్ డాలర్ల అప్పు చేసింది. ప్రస్తుతం ఆ సంస్థ మొత్తం అప్పు 100 బిలియన్ డాలర్లు దాటిపోయింది. ఈ భారీ పెట్టుబడుల వల్ల కంపెనీ వద్ద నగదు కొరత (Cash Crunch) ఏర్పడటంతో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేస్తోంది.
ఉద్యోగుల స్థానంలో ఏఐ టెక్నాలజీ?
తాజా సమాచారం ప్రకారం.. ఒరాకిల్‌లోని పలు విభాగాల్లో ఉద్యోగుల స్థానాన్ని ఏఐ (AI) తో భర్తీ చేయాలని యాజమాన్యం భావిస్తోంది. దీనివల్ల కంపెనీకి ఏడాదికి దాదాపు 8 బిలియన్ నుండి 10 బిలియన్ డాలర్ల వరకు ఆదా అవుతుందని అంచనా. ఇప్పటికే క్లౌడ్ విభాగంలో కొత్త నియామకాలను నిలిపివేసిన సంస్థ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లేఆఫ్స్ ప్యాకేజీల కోసమే 1.6 బిలియన్ డాలర్లు కేటాయించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కేవలం ఒరాకిల్ మాత్రమే కాదు, ఈ ఏడాది జనవరిలో అమెజాన్ 16,000 మందిని, గత ఏడాది మైక్రోసాఫ్ట్ 15,000 మందిని తొలగించాయి.
కుప్పకూలుతున్న షేర్ వాల్యూ
ఒరాకిల్ తీసుకుంటున్న ఈ దూకుడు నిర్ణయాలు ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. 2025 సెప్టెంబర్ నాటి గరిష్ట స్థాయి నుండి ఒరాకిల్ షేర్లు ఏకంగా 54 శాతం పడిపోయాయి. దీనివల్ల కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 463 బిలియన్ డాలర్లు ఆవిరైపోయాయి. వాల్ స్ట్రీట్ విశ్లేషకుల ప్రకారం.. ఈ భారీ పెట్టుబడుల నుండి లాభాలు రావడానికి 2030 వరకు సమయం పట్టవచ్చు. ఈలోగా ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి 2022లో రూ. 28.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన హెల్త్‌కేర్ సంస్థ 'సెర్నర్' (Cerner) ను కూడా విక్రయించే ఆలోచనలో ఒరాకిల్ ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా చూస్తే.. మార్చి 10 న ఒరాకిల్ తన మూడవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. అప్పుడే ఈ లేఆఫ్స్ (layoffs).. భవిష్యత్తు ప్రణాళికలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా టెక్ రంగంలో ఉద్యోగం సంపాదించడం ఒక ఎత్తయితే ఇప్పుడు ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడం ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.


Click it and Unblock the Notifications