నమ్మ బెంగళూరు(Bengaluru).. ఈ పేరు వినగానే ఐటీ కంపెనీలు, ట్రాఫిక్ జామ్‌లు గుర్తొస్తాయి. కానీ ఈ నగరానికి మరో అందమైన ముఖం కూడా ఉంది. అదే సంప్రదాయం, ఆధునికత మేళవింపు. తాజాగా, ఏజి (Eiji) అనే కంటెంట్ క్రియేటర్ బెంగళూరులోని ఇందిరానగర్ వీధుల్లో నడుస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. దాదాపు 27 ఏళ్ల పాటు పారిస్ లో నివసించిన ఏజి, బెంగళూరు నగరాన్ని చూసి అచ్చం పారిస్, న్యూయార్క్ నగరాలను తలపిస్తోందని ప్రశంసించడం విశేషం.
ఒకే వీధి.. రెండు ప్రపంచాలు
ఇందిరానగర్ అనగానే చాలామందికి పబ్‌లు, కేఫ్‌లు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఏజి తన ప్రయాణాన్ని శ్రీ కోదండరామస్వామి ఆలయం సమీపంలోని ప్రశాంతమైన వీధుల నుండి మొదలుపెట్టారు. అక్కడ కనిపించే పురాతన కట్టడాలు, భక్తుల కోలాహలం, ఆధ్యాత్మిక వాతావరణం ఆయనకు ఒక ప్రాచీన భారతదేశాన్ని పరిచయం చేశాయి. అయితే, అక్కడి నుండి కేవలం కొన్ని అడుగుల దూరంలోనే ఉండే 100 ఫీట్ రోడ్డు (100 Feet Road) కు చేరుకోగానే వాతావరణం పూర్తిగా మారిపోయింది.

పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, అంతర్జాతీయ బ్రాండ్లు, రంగురంగుల లైట్లతో మెరిసిపోయే కేఫ్‌లు ఆయనకు పారిస్ , న్యూయార్క్ వీధులను గుర్తు చేశాయి. ఒకే ఏరియాలో అటు పురాతన సంప్రదాయం, ఇటు గ్లోబల్ లైఫ్ స్టైల్ పక్కపక్కనే ఉండటం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. "బెంగళూరు ప్రతి మలుపులోనూ ఒక కొత్త కథను చెబుతుంది" అని ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు.
భారతీయ సంస్కృతికి అద్దం పడుతున్న వైనం
ఏజి దృష్టిలో బెంగళూరు కేవలం ఒక నగరం మాత్రమే కాదు, అది భారతదేశ వైవిధ్యానికి నిదర్శనం. ఒకవైపు భక్తిశ్రద్ధలతో ఉండే గుడి పరిసరాలు, మరోవైపు విదేశీ స్టైల్ లో ఉండే నైట్ లైఫ్.. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా (Juxtaposition) ఆయనను విపరీతంగా ఆకట్టుకుంది. మన దేశం తన మూలాలను మర్చిపోకుండానే ప్రపంచంతో పోటీ పడుతూ ఆధునికతను ఎలా అక్కున చేర్చుకుంటుందో ఈ ఇందిరానగర్ యాత్రలో తనకు అర్థమైందని ఆయన చెప్పుకొచ్చారు.
నెటిజన్ల రియాక్షన్: ఇంకా చూడాల్సింది చాలా ఉంది!
ఏజి చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బెంగళూరు అందాలను గుర్తించినందుకు ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నారు. కొందరు నెటిజన్లు ఆయనకు మరికొన్ని సలహాలు కూడా ఇస్తున్నారు. "మీరు నిజమైన బెంగళూరు సంస్కృతిని చూడాలనుకుంటే ఎన్ఆర్ కాలనీ (NR Colony), గాంధీ బజార్ వంటి ప్రాంతాలను సందర్శించండి" అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే సౌత్ బెంగళూరులోని బనశంకరి 2వ స్టేజ్ లో ఉన్న దేవగిరి వేంకటేశ్వర, ధర్మగిరి మంజునాథ ఆలయాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. అక్కడ ఆధ్యాత్మికతతో పాటు నగర వైభవం మరింత స్పష్టంగా కనిపిస్తుందని నెటిజన్ల అభిప్రాయం.
ఏది ఏమైనా ప్రపంచం నలుమూలల నుండి వచ్చే సందర్శకులను బెంగళూరు (Bengaluru) తనదైన శైలిలో అలరిస్తూనే ఉంది. కేవలం ఐటీ హబ్‌గానే కాకుండా ఇలాంటి చారిత్రక , ఆధునిక సమ్మేళనంగా ఈ నగరం ఎప్పటికీ ప్రత్యేకమే!


Click it and Unblock the Notifications