Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అందుకోసం రాత్రింబవళ్లు కష్టపడి, లోన్లు తీసుకుని ఈఎంఐ (EMI)లు కడతాం. అయితే మనకు ఉద్యోగం ఉన్నంత వరకే ఆ ఇల్లు మనది. లేదంటే అది బ్యాంకు ఆస్తి మాత్రమేనని నిరూపించే ఒక విషాద ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. కేవలం మూడు ఈఎంఐలు చెల్లించలేకపోయినందుకు ఒక వ్యక్తి తన కోటి రూపాయల విలువైన ఫ్లాట్ ను కోల్పోయిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

3 ఈఎంఐలు మిస్ అయితే.. ఇంటికి నోటీసు!
బెంగళూరు (Bengaluru) కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ (CA) మీనల్ గోయెల్ తన పొరుగున ఉండే రాజేష్ అనే వ్యక్తికి జరిగిన అన్యాయాన్ని లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నారు. రాజేష్ అనే వ్యక్తి 2025 అక్టోబర్‌లో తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. దురదృష్టవశాత్తూ.. 2026 జనవరి నాటికి అతను వరుసగా మూడు ఈఎంఐలు చెల్లించలేకపోయాడు. వెంటనే స్పందించిన బ్యాంకు.. SARFAESI చట్టం కింద అతనికి నోటీసులు పంపింది. 60 రోజుల వ్యవధిలోనే అతని ఫ్లాట్‌ను బ్యాంకు వేలం వేసింది.
రూ.1.20 కోట్ల ఫ్లాట్.. కేవలం రూ.95 లక్షలకే వేలం!
రాజేష్ ఆ ఫ్లాట్ ను రూ.1.20 కోట్లకు కొనుగోలు చేశాడు. గత 8 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లిస్తూ వస్తున్నాడు. కానీ, బ్యాంకు తన బకాయి ఉన్న రూ.80 లక్షలను రికవరీ చేసుకోవడం కోసం.. ఆ విలువైన ఇంటిని కేవలం రూ.95 లక్షలకే వేలంలో విక్రయించింది. అన్ని ఖర్చులు పోగా రాజేష్‌కు మిగిలింది కేవలం రూ.15 లక్షలు మాత్రమే. 8 ఏళ్ల పాటు అతను పడ్డ కష్టం, కట్టిన లక్షలాది రూపాయల వడ్డీ అంతా ఒక్క లేఆఫ్ తో గాలిలో కలిసిపోయింది.
అప్రమత్తంగా ఉండాలి: నిపుణుల హెచ్చరిక
ఈ ఘటన ద్వారా మీనల్ గోయెల్ కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు. హోమ్ లోన్ పూర్తిగా తీరే వరకు ఆ ఇల్లు మనది కాదు, అది బ్యాంకు నుంచి మనం అద్దెకు తీసుకున్న ప్రదేశం మాత్రమే అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు వంటి నగరాల్లో ఐటీ ఉద్యోగాల్లో అభద్రత పెరిగిన తరుణంలో కనీసం 6 నుంచి 12 నెలల ఈఎంఐలకు సరిపడా 'ఎమర్జెన్సీ ఫండ్' (Emergency Fund) ఉండాలని ఆమె సూచించారు. ఒకవేళ ఉద్యోగం పోయి EMI కట్టలేని పరిస్థితి వస్తే వెంటనే బ్యాంకును సంప్రదించి లోన్ రీస్ట్రక్చర్ చేయమని అడగాలని సలహా ఇచ్చారు.
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
ఈ పోస్ట్ వైరల్ కావడంతో కొందరు దీని ప్రామాణికతను ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా బెంగళూరులో 8 ఏళ్ల క్రితం కొన్న ఆస్తి ధర పెరుగుతుంది తప్ప తగ్గదు కదా అని కొందరు నెటిజన్లు అడుగుతున్నారు. అలాగే కేవలం 60 రోజుల్లోనే వేలం వేయడం సాధ్యం కాదని, బ్యాంకు కనీసం 90 రోజుల సమయం ఇస్తుందని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ హోమ్ లోన్ భారం మధ్యతరగతి ప్రజలపై ఎంతటి ఒత్తిడిని కలిగిస్తుందో చెప్పడానికి ఈ కథనం ఒక ఉదాహరణగా నిలిచింది.


Click it and Unblock the Notifications