చైనాతో వాణిజ్యం తప్పనిసరి, పక్కన పెట్టలేం: బజాజ్ కీలక వ్యాఖ్యలు
డ్రాగన్ దేశంతో వాణిజ్యం కొనసాగించాలని, వాణిజ్యపరంగా ఆ దేశాన్ని పక్కన పెట్టలేమని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ అభిప్రాయపడ్డారు. భారత్-చైనా వాణిజ్య సంబంధాలు కొనాగాల్సిన అవసరం ఉందన్నారు. ముడి సరుకు ఎక్కడ తక్కువకు దొరికితే అక్కడి నుండి తెప్పించుకోవాలన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పుణే ఇంటర్నేషనల్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన వర్చువల్ ఆసియా ఎకనమిక్ డైలాగ్-2021 భేటీలో ఆయన మాట్లాడారు.

అందుకే చైనాతో వాణిజ్య సంబంధాలు
చైనాతో మనకు వాణిజ్య సంబంధాలు కచ్చితంగా ఉండాల్సిందేనని రాజీవ్ బజాజ్ అభిప్రాయపడ్డారు. మనది అంతర్జాతీయ కంపెనీగా అనుకోవాలని, కార్యకలాపాలపరంగా ఆ కోణంలోనే ఆలోచించాలని, ప్రపంచవ్యాప్తంగా డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ముఖ్యమంగా సరఫరాదారులు అవసరమన్నారు. అందుకే ప్రపంచంతో, అందులో భాగంగా చైనాతో వాణిజ్య సంబంధాలు అవసరమని భావిస్తున్నట్లు చెప్పారు. చైనా వంటి ఓ పెద్ద దేశాన్ని, ఓ పెద్ద మార్కెట్‌ను పక్కకుపెట్టి మన వ్యాపారాలను నిర్వహిస్తే ఆ తర్వాత ఏదో కోల్పోయినట్లు తెలుసుకుంటామని, ఆ నష్టం మనపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదన్నారు.

అసంపూర్ణమే..
దేశీయ, అంతర్జాతీయ మర్కెట్‌కు సరఫరా చేసే ఉత్పత్తులకు అవసరం అయ్యే విడిభాగాలను దేశీయ మార్కెట్లో ఇప్పటికిప్పుడు తయారు చేయడం వీలుకాదని అభిప్రాయపడ్డారు. అందుకే ప్రస్తుతం సరఫరా వ్యవస్థను కొనసాగించడం ముఖ్యమన్నారు. పెద్ద దేశంతో వ్యాపారం జరపకుంటే అసంపూర్ణమవుతుందన్నారు.

అప్పుడు ఇబ్బందులు
కారణం ఏదయినా దిగుమతులు తగ్గిపోవడం ఇబ్బందులు కలిగించిందని, హఠాత్తుగా మారిన పరిణామాలతో దేశీయ మార్కెట్‌కు, విదేశీ మార్కెట్‌కు డెలివరీ చేయలేమన్నారు. చైనా, థాయ్‌లాండ్‌లలోచౌకగా లభించిన వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. పోటీతో లభించే చోటు నుండి వస్తువులను సేకరించాలన్నారు.