స్మార్ట్ ఫోన్ల రికార్డ్ అమ్మకాలు, 76% వాటా చైనాదే: వివోను వెనక్కి నెట్టిన శాంసంగ్
కరోనా వైరస్ ప్రభావం నుండి క్రమంగా అన్ని రంగాలు కోలుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ తయారీ, అమ్మకాలు రికార్డ్ స్థాయిలో పెరిగి 5 కోట్లు మార్కెట్లోకి వచ్చాయి. 2019 ఇదే సమయంలో అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ ఫోన్లు 4.62 కోట్లు కాగా, ఈసారి 8శాతం పెరిగినట్లు కనాలిస్ పరిశోధక సంస్థ తెలిపింది. గత ఏడాది కంటే రికార్డ్ స్థాయిలో దిగుమతి కావడం గమనార్హం. స్మార్ట్ ఫోన్ మార్కెట్ పుంజుకున్నదనేందుకు ఇది నిదర్శనం. దేశంలోని స్మార్ట్ ఫోన్ వాటాలో చైనా వాటా ఎక్కువగా ఉండటంతో పాటు టాప్ 5 కంపెనీల్లో నాలుగు డ్రాగన్ దేశానివే.
హోంలోన్, డిస్కౌంట్... యస్ బ్యాంకు అదిరిపోయే పండుగ ఆఫర్లు

గత ఏడాది పెరిగినా.. జూన్‌తో డౌన్
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఏడాది క్రితం 74 శాతంగా ఉన్న చైనా కంపెనీల వాటా ఈసారి 76 శాతానికి చేరుకుంది. ఇది ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నమోదైన 80 శాతం వాటా కంటే మాత్రం తక్కువ. టాప్ 5 కంపెనీలు షియోమీ, శాంసంగ్, వివో, రియల్‌మీ, ఒప్పో షిప్‌మెంట్స్ ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ క్వార్టర్‌లో పెరిగినట్లు కనాలిస్ తెలిపింది. సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో చాలామంది చైనా వస్తువులకు దూరంగా ఉంటున్నారు. అయితే మొబైల్ ఫోన్ విషయానికి వచ్చేసరికి చైనాకు సరైన ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ఆట బొమ్మల నుండి మిగతా రంగాల్లో ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి.

మార్కెట్ లీడర్‌గా షియోమీ, రెండో స్థానంలోకి శాంసంగ్
సెప్టెంబర్ త్రైమాసికంలో 1.31 కోట్ల యూనిట్ల దిగుమతి కలిగి ఉండి షియోమీ 26.1 శాతం వాటాతో మార్కెట్ లీడర్‌గా నిలిచింది. గత త్రైమాసికం వరకు దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్ మూడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు వివోను వెనక్కి నెట్టి 20.4 శాతం వాటా (1.02 కోట్ల యూనిట్లు)తో రెండో స్థానంలోకి వచ్చింది. 17.6 శాతం వాటా (88 లక్షల యూనిట్లు)తో వివో మూడో స్థానంలో, 17.4 శాతం వాటా(87 లక్షల యూనిట్లు)తో రియల్‌మి నాలుగో స్థానంలో, 12.1 శాతం వాటా(61 లక్షల యూనిట్లు)తో ఒప్పో అయిదో స్థానంలో ఉంది.

ఆపిల్‌కు కలిసి వచ్చింది
ఆపిల్‌కు కూడా మూడో క్వార్టర్ కలిసి వచ్చింది. గత ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే ఈసారి రెండంకెల వృద్ధితో 8 లక్షల యూనిట్లు దిగుమతి అయ్యాయి. ఆర్థిక మందగమనం, కరోనా నేపథ్యంలోను స్మార్ట్ ఫోన్ల విక్రయాలకు డిమాండ్ పెరగడం గమనార్హం.