ప్యాకేజీ, చైనాతో ట్రేడ్ వార్, జోబిడెన్ ముందు 'ఆర్థిక' సవాళ్లు
అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమోక్రటిక్ అభ్యర్థి జోబిడెన్ విజయం సాధించారు! ఇప్పటికే జోబిడెన్ 270 మేజిక్ ఫిగర్ కాగా 290 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. డొనాల్డ్ ట్రంప్‌కు కేవలం 214 మాత్రమే వచ్చాయి. జార్జియా, నార్త్ కరోలినా, అలస్కా ఫలితాలు రావాల్సి ఉంది. అమెరికా ప్రజలు తమ భవిష్యత్తు కోసం ఓటు వేశారని, వారి విశ్వాసాన్ని నిలబెడుతూ, దేశ ప్రతిష్టను మరింత ఇనుమింప చేసేందుకు కృషి చేస్తానని అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన అనంతరం అన్నారు. ఉపాధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ విజయం సాధించారు. వీరిద్దరు తమ గెలుపును అమెరికా గెలుపుగా అభివర్ణించారు.
ఆర్థిక వ్యవస్థ అద్భుతం.. అమెరికా ఎకానమీని డొనాల్డ్ ట్రంప్ నిలబెట్టారు

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కరోనా ప్యాకేజీ
అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన జోబిడెన్ ముందు ఆర్థిక సవాళ్ళు ఉన్నాయి. 2020ని కరోనా తీవ్రంగా దెబ్బకొట్టింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అమెరికా ఎకానమీ తీవ్రంగా దెబ్బతిన్నది. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారి కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని నెలలుగా ఆర్థికవేత్తలు కోరుతున్నారు. ఎన్నికలకు ముందు భారీ ఆర్థిక ప్యాకేజీకి డెమోక్రాట్లు ప్రతిపాదించినప్పటికీ ట్రంప్ ఒత్తిడి కారణంగా రిపబ్లికన్లు తిరస్కరించడంతో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. ప్రస్తుతం బిడెన్ అధ్యక్ష పీఠంపై కూర్చుంటున్నందున ప్యాకేజీని ఎంత మేరకు పెంచుతారు, ఆర్థిక వ్యవస్థకు కరోనా సమయంలో ఎలాంటి ఊతమిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. క్లీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పబ్లిక్ ట్రాన్సిట్ వంటి వివిధ రంగాలలో 2 ట్రిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయవచ్చు.

పన్నులు విధిస్తే..
అమెరికాలో ఆదాయ అసమానతలు 50 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. సంపన్నులపై ఎక్కువ ట్యాక్స్ ఉండాలని ఉదారవాదులు ఒత్తిడి చేస్తున్నారు. ప్రజల్లో కూడా దీనికి మద్దతు ఉందని వివిధ సర్వేల ద్వారా తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జోబిడెన్ మాట్లాడుతూ 2017లో డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన ట్యాక్స్ కట్‌ను వెనక్కి తీసుకుంటామని, కార్పోరేషన్లపై 21 శాతం నుండి 28 శాతానికి పన్నులు పెంచుతామన్నారు. పన్నులు విధిస్తే వ్యాపారుల నుండి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అధిక పన్నులు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉన్నందున జోబిడెన్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

చైనాతో ట్రేడ్ వార్
ట్రంప్ అధికారంలోకి వచ్చాక చైనాతో వాణిజ్య యుద్ధం తీవ్రంగా మారింది. ఒక దేశం ఉత్పత్తులపై మరో దేశం టారిఫ్ పెంచుతూ ట్రేడ్ వార్‌కు తెరలేపాయి. దీనిని జోబిడెన్ ముగిస్తారా, కొనసాగిస్తారా.. అంతం పలికితే ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తికరం. హెచ్1బీ వీసాలపై భారతీయులు సహా ఇతర దేశాల వారికి సానుకూలంగా నిర్ణయం ఉండవచ్చునని భావిస్తున్నారు.