Oil prices: జపాన్ రహస్య ఆయిల్ నిధి! ఆరు నెలలకు సరిపడా చమురుని జపాన్ ఎలా దాచిపెట్టింది?
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల (oil prices) పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముడి చమురు సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉండటంతో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తన వద్ద ఉన్న భారీ వ్యూహాత్మక చమురు నిల్వలను (Strategic Petroleum Reserves) మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అసలు జపాన్ ఈ నిల్వలను ఎలా దాచిపెట్టింది? దీనికై ఎలాంటి టెక్నాలజీని వాడింది? ఇప్పుడు చూద్దాం.

జపాన్ ఎందుకు అప్రమత్తమైంది?
జపాన్ తన ఇంధన అవసరాల కోసం దాదాపు 90-95% దిగుమతులపైనే ఆధారపడుతుంది. అందులోనూ మెజారిటీ చమురు సౌదీ అరేబియా, యూఏఈ వంటి మధ్యప్రాచ్య దేశాల నుంచే వస్తుంది. ఈ చమురు అంతా 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' అనే ఇరుకైన సముద్ర మార్గం గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇరాన్ యుద్ధం కారణంగా ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరగడంతో.. జపాన్ తన ఇంధన భద్రత కోసం అత్యవసర చర్యలు చేపట్టింది. జపాన్ లోని షిబుషి నిల్వ కేంద్రంతో పాటు ఇతర ప్రధాన కేంద్రాలను సిద్ధంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.
జపాన్ వద్ద ఉన్న భారీ నిల్వలు
చమురు నిల్వల విషయంలో చైనా, అమెరికా తర్వాత జపాన్ ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది. జపాన్ వద్ద ప్రస్తుతం సుమారు 440 మిలియన్ బారెల్స్ చమురు నిల్వలు ఉన్నాయి. ఇవి ఆ దేశానికి దాదాపు 204 రోజుల పాటు ఎటువంటి దిగుమతులు లేకపోయినా సరిపోతాయి. ఈ నిల్వలు కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా జాతీయ భద్రతగా జపాన్ భావిస్తుంది. ఎందుకంటే చమురు సరఫరా ఆగిపోతే జపాన్ లోని ఫ్యాక్టరీలు, రవాణా వ్యవస్థ , విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా స్తంభించిపోతాయి.
గతానుభవాల పాఠాలు
జపాన్ ఇంత జాగ్రత్తగా ఉండటానికి బలమైన కారణాలు ఉన్నాయి. 1973లో వచ్చిన 'ఆయిల్ షాక్' జపాన్ ఆర్థిక వ్యవస్థను అప్పట్లో అతలాకుతలం చేసింది. ఆ తర్వాత 2011లో సంభవించిన ఫుకుషిమా అణు ప్రమాదం కారణంగా చాలా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు మూతపడ్డాయి. దీనివల్ల జపాన్ మళ్ళీ పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. ఈ చేదు అనుభవాల నుంచే జపాన్ తన 'నేషనల్ ఇన్సూరెన్స్' లాగా ఈ భారీ చమురు నిల్వలను కాపాడుకుంటూ వస్తోంది.
ఫ్లోటింగ్ టెక్నాలజీ..
జపాన్ తన చమురు నిల్వలను కేవలం భూగర్భంలోనే కాకుండా, సముద్రం మీద తేలియాడే భారీ ట్యాంకర్లలో (Floating Storage) కూడా భద్రపరుస్తుంది. ముఖ్యంగా 'కమిగోటో' వంటి ప్రాంతాల్లో సముద్రం మధ్యలో భారీ ఉక్కు ట్యాంకులను నిర్మించి వాటిలో లక్షలాది బ్యారెళ్ల ముడి చమురును నిల్వ చేస్తారు. ఈ ఫ్లోటింగ్ టెక్నాలజీ వల్ల భూమి కొరత ఉన్న జపాన్ వంటి దేశాలకు భారీ నిల్వ సామర్థ్యం లభిస్తుంది. అంతేకాకుండా భూకంపాలు సంభవించినప్పుడు భూగర్భ ట్యాంకుల కంటే ఇవి సురక్షితంగా ఉంటాయి.
ఏదేమైనా జపాన్ వంటి పెద్ద దేశం తన నిల్వలను మార్కెట్లోకి విడుదల చేస్తే.. అది అంతర్జాతీయంగా చమురు ధరలు (oil prices) తగ్గడానికి కొంతవరకు సహాయపడుతుంది. ఇది కేవలం జపాన్ కే కాకుండా ఇతర ఆసియా దేశాలకు కూడా ఊరటనిచ్చే అంశం.


Click it and Unblock the Notifications