Iran war: త్వరలోనే యుద్ధం ముగింపు? ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరల్లో భారీ మార్పు!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా అమెరికా ఇరాన్ యుద్ధం (iran war) గురించే చర్చ జరుగుతోంది. ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (Crude Oil) ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కును దాటేసింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత చమురు ధరలు ఈ స్థాయికి చేరడం గమనార్హం. ఈ పరిణామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు.

ఆంక్షల ఎత్తివేతపై ట్రంప్ కీలక ప్రకటన
చమురు ధరల పెరుగుదల వల్ల సామాన్యులపై భారం పడకుండా చూసేందుకు అమెరికా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. చమురు ధరలను తగ్గించేందుకు కొన్ని దేశాలపై ఉన్న ఆంక్షలను (Sanctions) తొలగించబోతున్నట్లు ప్రకటించారు. "పరిస్థితి చక్కబడే వరకు కొన్ని ఆంక్షలను ఎత్తివేస్తున్నాం. దీనివల్ల మార్కెట్లోకి చమురు సరఫరా పెరిగి ధరలు తగ్గుతాయని ఆశిస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు. కేవలం ఆంక్షల ఎత్తివేతే కాకుండా ధరలను అదుపు చేసేందుకు ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇరాన్‌కు గట్టి హెచ్చరిక
ఒకవైపు ధరలు తగ్గించే ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు ఇరాన్ కు ట్రంప్ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (Strait of Hormuz) మార్గాన్ని అడ్డుకోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. "ప్రపంచాన్ని బందీగా మార్చుకోవాలని చూసే ఏ ఉగ్రవాద పాలననైనా నేను ఉపేక్షించను. చమురు సరఫరాను ఆపాలని చూస్తే.. ఇరాన్ గతంలో ఎన్నడూ చూడని రీతిలో భారీ దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని ట్రంప్ స్పష్టం చేశారు.
సామాన్యులపై ధరల ప్రభావం
ఇరాన్ ఇజ్రాయెల్-అమెరికా మధ్య జరుగుతున్న ఈ యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. అమెరికాలో త్వరలో జరగనున్న మిడ్-టర్మ్ ఎన్నికల నేపథ్యంలో పెరుగుతున్న గ్యాసోలిన్ ధరలు ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రంప్ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అయితే, ఈ ధరల పెరుగుదల అనేది కేవలం "స్వల్పకాలిక సమస్య" అని, యుద్ధం ముగియగానే ధరలు మళ్ళీ సాధారణ స్థితికి వస్తాయని ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ మార్కెట్లపై ఒత్తిడి
ఫిబ్రవరి 28 న యుద్ధం మొదలైనప్పటి నుండి, సముద్ర మార్గాల ద్వారా జరిగే రవాణా దాదాపు నిలిచిపోయింది. ప్రపంచ ముడి చమురు సరఫరాలో ఐదో వంతు వాటా ఉన్న హోర్ముజ్ జలసంధి మూతపడటంతో సరఫరా గొలుసు దెబ్బతింది. భారతదేశం వంటి దేశాలు కూడా చమురు దిగుమతుల కోసం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నాయి. ప్రస్తుతానికి అమెరికా తీసుకుంటున్న ఈ ఆంక్షల ఎత్తివేత నిర్ణయం మార్కెట్లలో కొంత సానుకూలతను తెస్తుందో లేదో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications