అమెరికా అయిపోయింది. ఇప్పుడు ఆసియా వంతు. ఎందులోనో తెలుసా?
కొన్ని దశాబ్దాలుగా అమెరికా మార్కెట్ మాత్రమే ఇన్వెస్టర్ల స్వర్గధామం. ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన కంపెనీ అయినా సరే పెద్ద మొత్తంలో నిధులు సమీకరించాలంటే అమెరికా వైపే చూసేవి. ముఖ్యంగా న్యూ యార్క్ సిటీ లో ఉన్న సంపన్నుల లిస్ట్ చాలా పెద్దది. అందుకే న్యూ యార్క్ స్టాక్ ఎక్స్చేంజి లో కంపెనీ లిస్ట్ ఐతే కాసుల వరదే అన్నది నిజం కూడా. అందుకే చైనా కుబేరుడు అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా కూడా అమెరికా మార్కెట్లో పెద్ద ఎత్తున నిధుల సమీకరణ చేశారు. అలాగే అదే దేశానికి చెందిన రెండో అతిపెద్ద ఈ కామర్స్ కంపెనీ జేడీ డాట్ కాం కూడా అదే పని చేసింది. ఒక్కో ఐపీవో (ఇనీటియాల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా బిలియన్ డాలర్లను సమీకరించాయి.
అంతెందుకు మనదేశానికి చెందిన కంపెనీలు కూడా అమెరికా మార్కెట్ నుంచి లబ్ది పొందినవే. అయితే అవి ఐపీవో కు వెళ్లకుండా కేవలం ఏడీఆర్ లను మాత్రమే లిస్ట్ చేశాయి. ఈ విషయంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ముందు వరుసలో ఉండగా... ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ కూడా ఇదే దారిలో పయనించింది. మరికొన్నిభారత సంస్థలు కూడా ఈ రూట్ లో నిధులను సమీకరించాయి. అయితే, ప్రస్తుతం పెద్ద కంపెనీలు, ముఖ్యంగా ఆసియా ఖండానికి చెందిన కంపెనీలు భారీ నిధుల సమీకరణ కోసం ఆసియా లోని హాంగ్ కాంగ్ ను ఎంచుకొంటున్నాయి. ఈ మేరకు ప్రముఖ వార్త ఏజెన్సీ బ్లూమ్బెర్గ్ ఒక కథనాన్ని ప్రచురించింది.

పెరుగుతున్న సంపన్నులు...
ఒకప్పుడు బిల్లియనీర్స్ అంటే అమెరికా నే గుర్తొచ్చేది. కానీ ప్రస్తుతం అందులో మార్పు వచ్చింది. ఇండియా, చైనా, జపాన్ లో సంపన్నుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. మన దేశ అపర కుబేరుడు ముకేశ్ అంబానీ అయితే... సంపదలో ప్రపంచంలోనే 9వ స్థానంలో ఉన్నారు. అలీ బాబా ఫౌండర్ జాక్ మా, సాఫ్ట్ బ్యాంకు ఫౌండర్ మసాయాషి సొన్ వంటి అపర కుబేరులకు ఆసియా ఖండం కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో స్టార్టుప్ కంపెనీలు నిధుల సమీకరణ కోసం హొంగ్ కాంగ్ స్టాక్ ఎక్స్చేంజి ని ఆశ్రయిస్తున్నారు. ఇటీవల ఈ స్టాక్ ఎక్స్చేంజి లో ఐపీవో లకు మంచి ఆదరణ లభించటంతో మరిన్ని కంపెనీలు ఇటు వైపు చూస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
రైల్వేలో రూ.100కు రూ.98.44 ఖర్చే, ఆ ఆదాయం లేకుంటే 102.66%
అలీబాబా హిట్....
ప్రపంచ అగ్రగామి ఈ కామర్స్ సంస్థ, చైనా లోని అతి పెద్ద ఆన్లైన్ రిటైలర్ ఐన అలీబాబా ... ఆసియ ఖండంలోనూ భారీగా నిధుల సమీకరణ ఎలా చేయవచ్చో నిరూపించింది. ఇటీవల ఈ కంపెనీ హొంగ్ కాంగ్ స్టాక్ ఎక్స్చేంజి లో ఐపీవో ద్వారా ఏకంగా 11 బిలియన్ డాలర్లు (సుమారు రూ 77,000 కోట్లు) సమీకరించింది. 2010 తర్వాత ఇంత భారీ నిధులను సమీకరించిన తోలి కంపెనీ అలీబాబానే కావటం విశేషం. ఈ ఐపీవో లో మూడో వంతు వాటాలను చైనా కు చెందిన ఫండ్ మేనేజర్లు కొనుగోలు చేయటం మరో విశేషం. తైవాన్ కు చెందిన లైఫ్ ఇన్సూరెన్సు కంపెనీ ఫుబోన్ ఫైనాన్సియల్ హోల్డింగ్స్ కూడా ఈ ఐపీవో లో పాల్గొని 500 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. దీన్ని బట్టి చూస్తే ఆసియా లో పెరుగుతున్న సంపన్న సంస్థలు కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయనేది స్పష్టమవుతోంది.
ఓయో కూడా...
మన దేశానికి చెందిన ఆన్లైన్ హోటల్ బుకింగ్ సేవల కంపెనీ ఓయో కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. చైనా సహా అమెరికా లో కూడా విస్తరించిన ఓయో ... ప్రస్తుతం భారీ నిధుల సమీకరణ కు వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ కంపెనీలో జపాన్ కుబేరుడు మసాయాషి సొన్ ఏకంగా 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ 10,500 కోట్లు) పెట్టుబడి పెట్టారు. దీంతో ఓయో విలువ ఏకంగా 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ 70,000 కోట్లు) కు పెరిగిపోయింది. కాబట్టి, దీన్నుంచి ఫలితాలను రాబట్టేందుకు లిస్టింగ్ కు వెళ్లాలని సొన్ యోచిస్తున్నారట. అదే సమయంలో ఇండోనేషియా కు చెందిన ఈ కామర్స్ కంపెనీ టోకోపిడియా కూడా హొంగ్ కాంగ్ స్టాక్ ఎక్స్చేంజి లో లిస్ట్ అవ్వాలని ప్రయత్నిస్తోందట. అయితే, అమెరికా ఇన్వెస్టర్లు అందరూ ఆసియ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకెళుతున్న ఈ సమయంలో కొత్త ఐపీవో లకు ఎంత వరకు ఆదరణ లభిస్తుందో చూడాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు.