English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డి ప్రారంభించేవారికి అవ‌స‌ర‌మైన స‌మ‌గ్ర స‌మాచారం

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఎలా పెట్టుబ‌డి పెట్టాలి? ఏ ఫండ్‌ను ఎంచుకోవాల‌నే సందేహం చాలా మంది పెట్టుబ‌డిదారుల్లో ఉంటుంది. చాలా క‌థ‌నాల్లో మ్యూచువ‌ల్ ఫండ్ క‌థ‌నాల గురించి వివ‌రించాం. అయితే ఇప్ప‌టికి ఇన్వెస్ట‌ర్లు మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు ఎలా ప్రారంభించాల‌ని అడుగుతుంటారు. అలాంటి వారి కోసం ఇక్క‌డ పూర్తి మ్యూచువ‌ల్ ఫండ్ల గురించి స‌మ‌గ్రంగా అవ‌గాహ‌న కోసం అన్ని విష‌యాల‌ను ఒకేచోట క్రోడీక‌రించి ఇస్తున్నాం. ఒక‌సారి చ‌దివి నిర్ణ‌యం తీసుకోండి.

 1.మ్యూచువ‌ల్ ఫండ్ వ్యూహం

1.మ్యూచువ‌ల్ ఫండ్ వ్యూహం

ఏ మ్యూచువ‌ల్ ఫండ్ అయినా వివిధ మ‌దుప‌ర్ల నుంచి నిధుల‌ను సేక‌రించి అవ‌స‌ర‌మైన పెట్టుబ‌డిదారుకు(సంస్థ‌కు) అందిస్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు ఎస్‌బీఐ మ్యూచువ‌ల్ ఫండ్ మొద‌టిసారి ఒక ఒపెన్ ఎండెడ్ ఈక్విటీ స్కీమ్‌ను ప్రారంభించింది అనుకుందాం. అప్పుడు అది పెట్టుబ‌డిదారుల నుంచి సేక‌రించిన డ‌బ్బును ఈక్విటీ షేర్ల‌లో ఇన్వెస్ట్ చేస్తుంది.

కాబ‌ట్టి ఇప్పుడు మీరు రూ. 10 ద‌గ్గ‌ర కొన్న యూనిట్లు, ఈక్విటీ షేర్ల విలువ పెరిగిన‌ప్పుడు విలువ‌ను పెంచుకుంటాయి. మొత్తం ఫండ్‌లో నెట్ అసెట్ వాల్యూ పెరిగిన‌ప్పుడే ఈ యూనిట్ విలువ పెరుగుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు యూనిట్ విలువ రూ.10 నుంచి రూ.11కు పెరిగింద‌నుకుందాం. ఇప్పుడు పాత ఇన్వెస్ట‌ర్ల‌కు కొంత లాభం వ‌స్తుంది. అదే కొత్త ఇన్వెస్ట‌ర్ మొద‌టిసారి ఈ ఫండ్ యూనిట్ కొనాలంటే రూ.11 వెచ్చించాల్సి వ‌స్తుంది.

2. ఫండ్‌ల‌లో పెట్టుబ‌డి పెట్టాలంటే కావాల్సిందేమిటి?

2. ఫండ్‌ల‌లో పెట్టుబ‌డి పెట్టాలంటే కావాల్సిందేమిటి?

మొద‌టిసారి మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోకి ప్ర‌వేశించాలంటే మీరు కేవైసీ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం చిరునామా గుర్తింపు, ఫోటోలు, జ‌న‌న ధ్రువీక‌ర‌ణను రుజువు చేసే ప‌త్రం, పాన్ కార్డుల లాంటివి స‌మ‌ర్పించాలి.

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల కోసం మీరు బ్రోక‌ర్లు లేదా నేరుగా ఫండ్ హౌస్ కార్యాల‌యాన్ని ఆశ్ర‌యించ‌వ‌చ్చు. సాధార‌ణంగా అవ‌కాశం ఉన్న చోట ఫండ్ హౌస్‌ని సంప్ర‌దించ‌డం మంచిది. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో వివిధ రకాలు ఉంటాయి. మీరు ఈక్విటీ లేదా డెట్ ఫండ్ల‌లో దేన్నైనా ఎంచుకోవ‌చ్చు.

మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డికి మార్గాలు

3. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ర‌కాలు

3. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ర‌కాలు

ఇదివ‌ర‌కే మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెడుతున్న వారికి దానిలో ర‌కాల గురించి తెలిసి ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని భావించే వారు వివిధ మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాల గురించి తెలుసుకోవాల్సిందే. మొద‌టిసారి మ్యూచువ‌ల్ ఫండ్ల‌లోకి ప్ర‌వేశించేవారు ఈక్విటీ ఫండ్ల‌తో ప్రారంభించ‌డం మంచిది. ఎందుకంటే ఈక్విటీ ఫండ్లు దాదాపు 60 నుంచి 80 శాతం డ‌బ్బును షేర్ల‌లో పెడ‌తాయి.

ఈక్విటీ ఫండ్లు రిస్క్‌తో కూడుకున్న‌వి. ఇవి ఎక్కువ రాబ‌డుల‌ను ఇవ్వ‌డ‌మే కాకుండా న‌ష్టాల‌ను సైతం ఇచ్చే ఆస్కారం ఉంద‌ని గుర్తుంచుకోవాలి. అయితే దీర్ఘ‌కాలం దృష్టిలో ఉంచుకుని చూస్తే ఈక్విటీ ఫండ్లు సాధార‌ణంగా బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ రాబ‌డుల‌ను ఇచ్చిన చ‌రిత్ర ఉంది. కాబ‌ట్టి రిస్క్ తీసుకోగ‌లిగిన వారు, 3 నుంచి 5 ఏళ్ల పైన ఆ డ‌బ్బు అవ‌స‌రం లేద‌ని భావించేవారు ఈక్విటీల‌వైపు మ‌ళ్లండి.

మ‌ధ్య వ‌య‌సువారు 40 శాతం వ‌ర‌కూ పెట్టుబ‌డుల‌ను ఈక్విటీ ఫండ్ల‌లో ఉంచి, 20 శాతాన్ని డెట్ ఫండ్ల‌లోనూ, మిగిలిన దాన్ని బ్యాలెన్స్‌డ్ ఫండ్లు లేదా నెలవారీ ఆదాయ ప‌థ‌కాలు లేదా క్ర‌మ వ‌డ్డీని చెల్లించే ఎఫ్‌డీల‌ను ఎంచుకోవ‌డం మంచిది. అదే 50-60 మ‌ధ్య వ‌య‌సు గ‌ల‌వారు నేరుగా డెట్ ఫండ్ల‌నే ఎంచుకోవాల్సిందిగా సూచించ‌డ‌మైన‌ది. ఈ వ‌య‌సులో రిస్క్ తీసుకోవ‌డం అంత అవ‌స‌రం ఉండ‌దు. అంత మంచిది కూడా కాదు. మ‌ధ్య‌స్థ రిస్క్ తీసుకునే పెట్టుబడిదార్లు ఫండ్ల‌లోనే పెట్టుబ‌డి పెట్టాలంటే మెజారిటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బ్యాలెన్స్‌డ్ లోనూ కొంచెం పెట్టుబ‌డిని డెట్ ఫండ్ల‌లోనూ పెట్ట‌వ‌చ్చు. రూ.500 నుంచి ప్రారంభ‌మ‌య్యే సిప్‌లు

4. మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి మీకు వ‌చ్చే రాబ‌డులు ఏమిటి?

4. మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి మీకు వ‌చ్చే రాబ‌డులు ఏమిటి?

మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి వ‌చ్చే రాబ‌డులు రెండు ర‌కాలుగా ఉంటాయి. మొద‌టిది మూల‌ధ‌నంపై వ‌చ్చే లాభం కాగా, రెండోది డివిడెండ్‌. కాబ‌ట్టి మీరు పెట్టుబ‌డి పెట్టేట‌ప్పుడు డివిడెండ్ లేదా గ్రోత్ ప్లాన్ నుంచి ఒక‌దాన్ని ఎంచుకోవాలి.

****** మ్యూచువ‌ల్ ఫండ్లో ఏ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి? *********

గ్రోత్ ప్లాన్‌లో డ‌బ్బు ఒకేచోట కేంద్రీకృత‌మ‌వుతుంది. ఇది పంపిణీ అవ‌దు. మీకు పెట్టుబ‌డిపై వ‌చ్చిన లాభాన్ని రీఇన్వెస్ట్ చేస్తారు. దాంతో ప‌థ‌కం రాబ‌డి పెరుగుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీరు కొన్న ఫండ్ యూనిట్ విలువ రూ.10 ఉంద‌నుకుందాం. ఒక‌వేళ మీరు డివిడెండ్ ఆప్ష‌న్ ఎంచుకుంటే ఈ రూ.10 విలువ అంత‌గా పెర‌గ‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే లాభం ఎప్ప‌టిక‌ప్పుడు ప‌క్క‌కు వెళ్లిపోతుంది కాబ‌ట్టి.

అదే గ్రోత్ ప్లాన్‌లోన‌యితే డివిడెండ్ రూపంలో వ‌చ్చిన దాన్ని మ‌ళ్లీ ఫండ్‌కు క‌లిపి ప్లాన్ వృద్ది చెందేలా చూస్తారు. కాబ‌ట్టి మీరు రూ.10 విలువ‌తో కొన్న ఫండ్ కొన్నేళ్ల‌లో రూ.16 ఎన్ఏవీ వ‌ర‌కూ వెళ్లే అవ‌కాశం ఉంటుంది. అంటే యూనిట్ విలువ రూ.16 అవ్వొచ్చు.

5. మ్యూచువ‌ల్ ఫండ్ రాబ‌డుల‌పై ప‌న్ను వర్తింపులు ఇలా...

5. మ్యూచువ‌ల్ ఫండ్ రాబ‌డుల‌పై ప‌న్ను వర్తింపులు ఇలా...

మ‌న దేశంలో ధ‌ర‌లు వేగంగా పెరుగుతుండ‌టం చాలా మంది ఎదుర్కొనే స‌మ‌స్య‌. చాలా పెట్టుబ‌డుల్లో ఆశించిన రాబడులు వ‌స్తాయ‌ని క‌చ్చితంగా చెప్ప‌లేం. అయితే ఫండ్ల‌లో మాత్రం దీర్ఘ‌కాలంలో మంచి లాభాలు వ‌స్తాయ‌ని ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు చెబుతుంటారు. అందుకే మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఇప్పుడిప్పుడే పెట్టుబ‌డుల‌ను మొద‌లుపెట్టేవారు ప‌న్ను మిన‌హాయింపులు ఎలా పొందాలో బాగా తెలుసుకోవాలి. డివిడెండ్ డిస్ట్రిబ్యూష‌న్ ప్లాన్‌లో ఇన్వెస్ట‌ర్ల‌కు పంచిపెట్టిన డివిడెండ్లు ప‌న్ను మిన‌హాయింపుకు అర్హ‌త పొంది ఉంటాయి. అదే గ్రోత్ ప్లాన్‌లోన‌యితే మూల‌ధ‌న రాబ‌డులు ఉంటాయి.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను లెక్కింపు ఎలా?

6. మ్యూచువ‌ల్ ఫండ్ల జాబితా

6. మ్యూచువ‌ల్ ఫండ్ల జాబితా

మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబడుల‌ను మొద‌టిసారి ఆశ్ర‌యించేవారు దేశంలో ఉన్న పెద్ద మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల గురించి తెలుసుకుని ఉండాలి. మార్కెట్లు బాగా ప‌నితీరు క‌న‌బ‌రుస్తున్న‌ప్పుడు ఈక్విటీ ఫండ్లు మంచి రాబ‌డుల‌ను ఇస్తాయ‌ని నిపుణులు చెబుతుంటారు. భార‌త‌దేశంలో చాలా మ్యూచువ‌ల్ ఫండ్లు ఉన్నాయి.

అన్నింటిలో టాప్ మ్యూచువ‌ల్ ఫండ్లలో ఎస్బీఐ మ్యూచువ‌ల్ ఫండ్, రిల‌య‌న్స్ మ్యూచువ‌ల్ ఫండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువ‌ల్ ఫండ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్సియ‌ల్ ఫండ్‌, బిర్లా స‌న్‌లైఫ్‌, క్వాంట‌మ్ మ్యూచువ‌ల్ ఫండ్‌, డీఎస్‌పీ బ్లాక్ రాక్ మ్యూచువ‌ల్ ఫండ్‌, ఫ్రాంక్లిన్ ఇండియా వంటివి కొన్ని. ప్ర‌తి మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ చాలా స్కీమ్‌ల‌ను ప్ర‌వేశ‌పెడుతుంటాయి. వాటి నుంచి ఇన్వెస్ట‌ర్లంతా త‌మ‌కు అనువైన వాటిని ఎంచుకోవాలి. ఏ ప‌థ‌కం ఎంచుకోవాల‌నేది మీ రిస్క్ సామ‌ర్థ్యం, ఆదాయం, పొదుపు ఎంత చేస్తార‌నేది, వ‌య‌సు మొద‌లైన‌వాటిని బ‌ట్టి ఉంటుంది.

7. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో తెలుసుకోవాల్సిన ప‌దాలు

7. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో తెలుసుకోవాల్సిన ప‌దాలు

నికర ఆస్తి విలువ ( ఎన్ ఎ వి):

ఆస్తుల మార్కెట్ విలువలో నుండి అప్పులను (లయబిలిటీలను) తీసివేస్తే వచ్చే విలువ నికర ఆస్తి విలువ. మొత్తం ఫండ్ నిక‌ర విలువ‌ను యూనిట్ల‌తో భాగిస్తే యూనిట్ నిక‌ర విలువ వ‌స్తుంది. సాధార‌ణంగా పెట్టుబ‌డిదారులంతా మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఈ యూనిట్ విలువ‌తోనే కొన‌డం, అమ్మ‌డం జ‌రుగుతుంది.

ఎక్స్‌పెన్స్ రేషియో:

మ్యూచువ‌ల్ ఫండ్‌ను ప్ర‌వేశపెట్టిన సంస్థ ప్ర‌క‌ట‌న‌లు, కొనుగోలు,అమ్మ‌కాల‌ను నిర్వ‌హించేందుకు కొంత డ‌బ్బును ఖ‌ర్చు పెడ‌తాయి. దీన్నంతా ఇన్వెస్ట‌ర్ల రాబ‌డుల్లోంచే మిన‌హాయిస్తారు. ఫండ్ నిర్వ‌హ‌ణ కోసం ఆయా సంస్థ‌లు చేసే ఇలాంటి ఖ‌ర్చును ఎక్స్‌పెన్స్ రేషియోగా పిలుస్తారు.

ఎగ్జిట్ లోడ్‌:

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల నుంచి ఇన్వెస్ట‌ర్లు త‌మ సొమ్మును ముందే ఉప‌సంహ‌రించుకోవ‌డాన్ని క‌ట్ట‌డి చేసేందుకు ఫండ్ కంపెనీలు ఈ ఎగ్జిట్ లోడ్‌ను విధిస్తాయి.

8. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టేముందు ఏం చూడాలి?

8. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టేముందు ఏం చూడాలి?

దేశంలో సుమారు 44కుపైగా అస్సెట్ మేనేజ్ మెంట్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇవి పది వేలకు పైగా స్కీమ్‌ల‌ను నిర్వహిస్తున్నాయి. 2017 మార్చి నాటికి ఏఎంసీల నిర్వహణలో ఉన్న ఇన్వెస్టర్ల నిధులు సుమారుగా 17.89 లక్షల కోట్లు. ఇంత భారీ సంఖ్యలో ఉన్న పథకాల్లో మంచి వాటిని ఎంచుకుని ఇన్వెస్ట్ చేస్తేనే అధిక ప్రతిఫలం అందుకోవడం సాధ్యమవుతుంది. అందుక‌నే మొద‌టిసారి ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు లేదా బ్రోకర్ల సాయం తీసుకోవ‌డం సూచనీయం. నెమ్మ‌దిగా మ్యూచువల్ ఫండ్ల‌కు సంబంధించిన ప‌ద‌జాలంపై ప‌ట్టు సాధించాలి. ఎక్స్పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడ్‌, సంస్థ ట్రాక్ రికార్డు, డివిడెండ్ల చెల్లింపు, ఫండ్ మేనేజ‌ర్ వంటివి తెలుసుకుంటూ ఉండాలి. స్టాక్ మార్కెట్ ఎలా ప‌నిచేస్తుంద‌నే దాన్ని బట్టే ఈక్విటీ ఫండ్ల రాబ‌డులు ఉంటాయనే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. ఫండ్ హౌస్ వెబ్ సైట్లో ప్రతి పథకం సమాచారం లభిస్తుంది. పనితీరు వివరాలు, పోర్ట్ ఫోలియో ... అంటే ఏ ఏ కంపెనీ షేర్లలో ఎంత మేర పెట్టుబడులు ఉన్నాయో తెలుస్తుంది. ఫండ్ మేనేజర్ వివరాలు ఉంటాయి. ఎక్స్ పెన్స్, టర్నోవర్ రేషియో వివరాలు తెలుస్తాయి. వీటి ఆధారంగా కూడా ఓ నిర్ణయానికి రావచ్చు.

9.పెట్టుబ‌డులు పెట్టేందుకు సిప్ మార్గం

9.పెట్టుబ‌డులు పెట్టేందుకు సిప్ మార్గం

చాలా మందికి మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా మంచి రాబ‌డులు సాధించాల‌నే కోరిక ఉంటుంది. నేరుగా షేర్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాలంటే మాత్రం భ‌యం. అలాంటి వారికి మ్యూచువ‌ల్ ఫండ్‌లు స‌రైన‌వి. అయితే ఇక్క‌డ సైతం ఎలా పెట్టుబ‌డి పెట్టాలి? ఎక్క‌డ ప్రారంభించాలి? ఎంత మొత్తం డ‌బ్బు పెట్టాలి? అనే సందేహాలు ఉండ‌టం స‌హ‌జం. అయితే మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో సిప్ ద్వారా పెట్టుబ‌డి పెట్ట‌డం చాలా సులువు. ఎంత మొత్తాన్ని మ‌దుపు చేయాల‌నుకుంటున్నారు, ఎంత కాలం పాటు పెట్టుబ‌డి పెడతారు, పెట్టుబ‌డి ల‌క్ష్యం, సిప్‌లో ఎలా మ‌దుపు చేస్తారు(కాలావ‌ధి-నెల‌వారీ లేదా త్రైమాసికం) వంటివి అన్నీ నిర్ణ‌యించుకోవ‌డం ఇందులో ముఖ్యం. సిప్ రాబ‌డికి క‌చ్చిత‌మైన హామీ ఇవ్వ‌క‌పోయినా దీర్ఘ‌కాలంలో న‌ష్ట‌భ‌యాన్ని త‌గ్గిస్తుంది. యూనిట్ల ధ‌ర‌ను స‌గ‌టు చేసేందుకు సిప్ మార్గం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇంకెందుకు ఆల‌స్యం-మీరూ సిప్ మార్గాన్ని ఎంచుకోండి మ‌రి!

మ్యూచువ‌ల్ ఫండ్ సిప్‌ల ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి?

10. డ‌బ్బును ఎప్పుడు విత్‌డ్రా చేయాలి?

10. డ‌బ్బును ఎప్పుడు విత్‌డ్రా చేయాలి?

చాలా మంది సిప్ మార్గంలో ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెడితే ఇక ఎలాంటి న‌ష్టం ఉండ‌దు అన్న భావ‌న‌లో ఉంటారు. అయితే వాస్త‌వానికి సిప్‌లో క‌చ్చితంగా మంచి రాబ‌డులు వ‌స్తాయ‌ని హామీ ఉండ‌దు. ఈ విధానంలో మ‌దుపు చేసినా... కొన్ని సార్లు న‌ష్టాలు వ‌స్తుంటాయి. దీర్ఘ‌కాలంలో ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ఉంటే ఎలాగైనా కంపెనీల షేర్లు లాభ‌ప‌డ‌తాయి కాబ‌ట్టి అందులో మ‌దుపు చేసిన సొమ్ము లాభాల‌ను రాబ‌డుతూ ఉంటుంది. సాధారాణంగా దీని ఆధారంగానే ఎవ‌రైనా సిప్ మార్గంలో పెట్టుబ‌డి పెడితే లాభాలు వ‌స్తాయ‌ని చెబుతారు. మీ యూనిట్ల కొనుగోలు ధ‌ర త‌క్కువ ఉండి, అమ్మే స‌మయానికి యూనిట్ ఎన్ఏవీ బాగా పెరిగి అప్పుడు మంచి ధ‌ర‌కు విక్ర‌యిస్తే మీకు లాభాలు బాగానే వ‌స్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు మీరు కొన్ని యూనిట్ స‌గ‌టు ధ‌ర రూ. 58 ఉండి, మీరు యూనిట్ల‌ను అమ్మేట‌ప్పుడు దాని విలువ ఏ 65 లేదా 74కు పెరిగి ఉంటే మీకు లాభాలొస్తాయి. అదే త‌క్కువ ధ‌ర‌కు యూనిట్ల‌ను అమ్మితే న‌ష్టాలు కొని తెచ్చుకున్న‌ట్లే. అందుకే మార్కెట్ ప‌నితీరు బాగా ఉన్న‌ప్పుడు అమ్మేందుకు ప్ర‌య‌త్నిస్తే మంచిది. మార్కెట్ న‌ష్టాల‌కు గుర‌యిన‌ప్పుడు భ‌య‌ప‌డి వెంట‌నే యూనిట్ల‌ను అమ్మ‌కూడ‌దు. యూనిట్ విలువ‌ను నిత్యం గ‌మ‌నిస్తూ స‌రైన స‌మ‌యంలో యూనిట్ల‌ను విక్ర‌యించ‌డం సూచ‌నీయం. మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు-ప్ర‌యోజ‌నాలు

Read more about: mf, mutual funds, market
English summary

A Beginners Guide On How To Invest In Mutual Funds In India

To begin investing, the first thing you need to do is to be "KYC compliant". This is nothing but a submission of your address proof, photographs, date of birth proof and definitely your PAN card. You can directly approach brokers for investing in mutual funds or can directly approach the mutual fund house. We have given you a list of mutual funds below to choose from. As mentioned earlier, you can either consider an equity mutual fund or a debt mutual fund. We will tell you the type of mutual funds that you can invest in
Story first published: Wednesday, April 12, 2017, 12:32 [IST]
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC