రెండేళ్లుగా స్పెండింగ్ లక్ష్యాలు చేరుకోని ప్రభుత్వం! ఈ బడ్జెట్‌పై ఆశలు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇదివరకటికి భిన్నంగా బడ్జెట్‌ను ప్రవేశ పెడతామని ఇటీవల తెలిపారు. తద్వారా బడ్జెట్ పైన అంచనాలు పెరిగాయి. అలాగే, కరోనా వంటి క్లిష్టమైన సమయంలో బడ్జెట్‌ను ప్రవేశ పెడుతుండటం వల్ల కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అయితే వాస్తవానికి గత రెండేళ్లుగా బడ్జెట్‌ను పరిశీలిస్తే నిరాశాజనకం కనిపిస్తోందని అంటున్నారు. గత రెండేళ్లలో ప్రభుత్వం తన మొత్తం ఖర్చు లక్ష్యాన్ని కోల్పోయింది లేదా వాటిని తగ్గించింది. కొన్ని ప్రధాన అభివృద్ధి కార్యక్రమ లక్ష్యాలను కూడా చేరుకోలేదు.
ప్రస్తుతం కరోనా నుండి ఆర్థిక వ్యవస్థను వేగంగా పునరుద్ధరించాలంటే ప్రజా వ్యయం పెంపు తప్పనిసరి. అయితే ఇప్పటికే ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోవడంతో స్పెండింగ్స్ పైన కేంద్రం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాలు 13.1 ట్రిలియన్ రూపాయల రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి.

పేదరికం తగ్గింపు వ్యూహంలో భాగంగా 2000 సంవత్సరంలో ప్రారంభమైన రహదారుల వృద్ధి పైన కేంద్రం దృష్టి సారించింది. వివిధ కుగ్రామాలకు అనుసంధానించడం, చిన్న వ్యాపారాల వేగవంతమైన కార్యకలాపాల కోసం రోడ్ల నిర్మాణం ఎంతో ఉపయోగపడుతోంది. గత కొన్నేళ్లుగా భారత బడ్జెట్ పెరుగుతున్నప్పటికీ దీని కోసం ఖర్చులు తగ్గిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడం కోసం గ్రామీణ మౌలిక సదుపాయాలపై ఖర్చు ఓ వరంగా చెబుతున్నారు.
రూరల్ ఇండియాలో బ్రాడ్ బాండ్ కోసం భారత్ నెట్ ఇప్పటికి బాలారిష్టాలు ఎదుర్కొంటోంది. ప్రపంచంలోనే ఇంటర్నెట్ వినియోగదారుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అయినప్పటికీ దేశ జనాభాలో సగం మందికి ఇంటర్నెట్ సదుపాయం లేదు. స్వచ్చ భారత్‌లో భాగంగా 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం అనతికాలంలోనే పదిలక్షల మరుగుదొడ్లు నిర్మించడం కోసం భారీగా ఖర్చు చేసింది. ప్రారంభ సంవత్సరాల్లో లక్ష్యాలను అధిగమించింది. ఇటీవల కాస్త తగ్గింది. అయితే ప్రస్తుత కరోనా నేపథ్యంలో అన్ని లక్ష్యాలు చేరుకోవచ్చునని భావిస్తున్నారు.