UPI in France: ఇకపై ఫ్రాన్స్ లో భారతీయులు యూపీఐ, రూపే కార్డ్ చెల్లింపులు.. కేంద్రం కీలక ఒప్పందం..
UPI in France: సింగపూర్, యూఏఈ, నేపాల్, భూటాన్ తర్వాత భారత UPI, రూపే కార్డ్‌లను ఇకపై చెల్లింపుల కోసం ఫ్రాన్స్ లో సైతం వినియోగించవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అంతర్జాతీయ విభాగమైన NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ ఫ్రాన్స్‌లో UPI, రూపే కార్డ్‌ల అంగీకారం కోసం ఫ్రాన్స్‌కు చెందిన లైక్రా నెట్‌వర్క్‌తో గురువారం అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. దీనిపై మాట్లాడిన కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.. భారత్ లో కేవలం ఒక్క నెలలో 5.5 బిలియన్ల UPI లావాదేవీలు జరుగుతున్నాయని.. ఈ తరుణంలో ఫ్రాన్స్‌తో ఎంవోయూ చేసుకోవటం చాలా గొప్ప విజయంగా భావిస్తున్నానని అన్నారు.
డిజిటల్ చెల్లింపులకు చర్చలు:
ఫ్రాన్స్‌లో భారత UPI, రూపే కార్డుల చెల్లింపులు త్వరలోనే ఆమోదించబడతాయని ఫ్రాన్స్‌లోని భారత రాయబారి జావేద్ అష్రఫ్ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే అధికారికంగా ఒప్పందాలు జరిగాయని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం వేగంగా జరుగుతోందని వెల్లడించారు. భారత సెంట్రల్ బ్యాంక్, ఫ్రాన్స్‌లోని కంపెనీలతో చెల్లింపుల వ్యవస్థ గురించి చర్చించాల్సి ఉందని అష్రఫ్ చెప్పారు. ఫ్రాన్స్‌లో డిజిటల్ చెల్లింపుల వినియోగం చాలా తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.

సురక్షితంగా.. వేగంగా చెల్లింపులు:
స్వదేశీ NPCI అనేది రూపే గేట్‌వే ద్వారా భారత్ లో రిటైల్ చెల్లింపులు, సెటిల్‌మెంట్‌ను సులభతరం చేయడానికి తెచ్చిన గొడుగు సంస్థ. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) పటిష్టమైన చెల్లింపు, సెటిల్‌మెంట్ వ్యవస్థను రూపొందించడానికి తెచ్చిన ఒక చొరవ. దేశంలోని P2P, P2M లావాదేవీల్లో సరళత, భద్రత, రియల్ టైం చెల్లింపుల కోసం.. ప్రపంచ వ్యాప్తంగా తెచ్చిన విజయవంతమైన వ్యవస్థే యూపీఐ పేమెంట్స్. UPI అనేది మొబైల్ ఆధారిత ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు తెచ్చిన ఈ వ్యవస్థ తక్షణ చెల్లింపులను సులభతరం చేసింది. UPI ద్వారా దేశంలో.. పర్సన్-టు-పర్సన్ (P2P), పర్సన్-టు-మర్చంట్ (P2M) చెల్లింపులకు వెసులుబాటు కల్పించింది. దీని ద్వారా వినియోగదారులు డబ్బును పంపవచ్చు, స్వీకరించవచ్చు అది కూడా క్షణాల్లోనే.