PAN-Aadhaar linking: డెడ్ లైన్ ఇదే: దాటితే డబుల్ ఫైన్: ఎన్నో కష్టనష్టాలు
న్యూఢిల్లీ: బ్యాంకింగ్, ఇతర ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించుకోవడంలో పాన్-ఆధార్ కార్డ్ లింకింగ్‌ను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల బ్యాంకింగ్ లావాదేవీలతో పాటు కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల లబ్ది పొందుతున్న వివరాల గురించి తెలుసుకోవడానికి వీలవుతుంది. సంక్షేమ పథకాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి పాన్-ఆధార్ కార్డ్ లింకింగ్ ఉపయోగపడుతుందని కేంద్రం అభిప్రాయపడుతోంది.

గడువు పొడిగించినా..
పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడానికి ఉద్దేశించిన గడువును కేంద్ర ప్రభుత్వం ఇదివరకే పొడిగించింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీన దీని గడువు ముగిసినప్పటికీ.. దీన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. డెడ్‌లైన్ పొడిగించడం ఊరట కలిగించే అంశమే అయినప్పటికీ- అది కాస్తా గుదిబండగా మారడం ఖాయమైంది. సకాలంలో లింక్ చేయించుకోకపోతే మాత్రం రెట్టింపు జరిమానాను చెల్లించుకోవాల్సి వస్తుంది.

30 తేదీ లోపు
పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేయించుకోకపోతే ప్రస్తుతం 500 రూపాయల జరిమానాను విధిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ఛార్జీలు అమలులోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఈ మొత్తాన్ని రెట్టింపు చేయనున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఈ నెల 30వ తేదీలోపు లింక్ చేసుకోకుంటే ఆ మరుసటి రోజు నుంచి 1,000 ఛార్జీని వసూలు చేస్తామని సీబీడీటీ తెలిపింది.

రూ.1,000 ఛార్జ్..
జూన్ 1వ తేదీ నుంచి ఆధార్-పాన్ లింకింగ్ ఛార్జీలు 1,000 రూపాయలకు పెరుగుతాయని స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను శాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకునే వీలు ఉంది. ఇతర బ్యాంకులు కూడా తమ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ఈ వెసలుబాటు కల్పించాయి. పాన్- ఆధార్ లింక్ ఆప్షన్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా కూడా పాన్-ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవచ్చు.

కష్టనష్టాలు..
నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్‌డీఎల్), యూటీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవచ్చని సీబీడీటీ తెలిపింది. 2023 మార్చి 31లోపు పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు. 2023 ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు గడువు తీరిపోయినట్టవుతుంది. అది చెల్లుబాటు కాదు. పాన్ కార్డ్ అందుబాటులో లేకపోతే- ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేం. బ్యాంక్ అకౌంట్ కూడా తెరవలేం.