కరోనా వైరస్: హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు కొత్త చిక్కు!
చైనా లో పుట్టిన మాయదారి కరోనా వైరస్... ప్రస్తుతం ప్రపంచమంతా వ్యాపించి బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే 17,000 మందికి పైగా ప్రజల ప్రాణాలను బలిగొన్న ఈ మహమ్మారి మరో 3.5 లక్షల మందికి సోకింది. దీంతో ప్రపంచమంతా రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా ఇండియా లో పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. మన దేశంలోనూ కరోనా బాధితుల సంఖ్య 500 దాటింది. ఇప్పటికే 10 మంది మృతి చెందినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే, ఈ భయంకరమైన వైరస్ ను ఆదిలోనే అడ్డుకుని, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రజలను ఇండ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నాయి. అత్యవసర సేవలు మినహా ఇతర రంగాలకు చెందిన వారంతా ఇంటికే పరిమితం కావాలని హుకుం జారీ చేశాయి. ఈ నిర్ణయాలు పాటించేందుకు కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ... మన హితం కోసం, జన హితం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిందే. అయితే ప్రస్తుతం తెలంగాణ లో లాక్ డౌన్, కర్ఫ్యూ విధించినప్పటికీ... ఇందులో నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. ఇదే ప్రస్తుతం ఈ రంగంలో పనిచేస్తున్న వారికి తలనొప్పిగా మారింది.
.covid-19: 8,000 మంది ట్రైనీలను ఇంటికి పంపిన ఇన్ఫోసిస్!

ఇప్పటికీ పని చేస్తున్న ఐటీ కంపెనీలు...
దేశంలో ఐటీ రంగానికి బెంగళూరు రాజధాని అయితే... హైదరాబాద్ రెండో స్థానంలో ఉంటోంది. ఇక్కడ సుమారు 2,000 ఐటీ, అనుబంధ రంగంలోని కంపెనీలు పనిచేస్తున్నాయి. ఈ కంపెనీల్లో సుమారు 5 లక్షల మంది నిపుణులు పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 70% మందికి ఇప్పటికే వర్క్ ఫ్రొం హోమ్ ఇవ్వగా ... మరో 30% మంది ఉద్యోగులు మాత్రం తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సి అంటోంది. ఇందులో ప్రపంచ స్థాయిలో క్లయింట్ సేవలు అందించే వారు, బీపీఓ సేవలు అందించే కంపెనీలు తమ ఉద్యోగులను విధిగా ఆఫీస్ కు హాజరు కావాలని కోరుతున్నాయి. దీంతో సుమారు 1 లక్ష మందికి పైగా ఐటీ నిపుణులు ఉసూరుమంటూ ఆఫీస్ లకు వెళుతున్నారు. కానీ, తమ తోటి ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తుండగా... తాము మాత్రం ఇలా ఆఫీస్ కు వెళ్లాల్సి రావటం ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు.

పోలీస్ చెకింగ్ ...
సాధారణ పౌరులను రోడ్ల మీదకు రాకుండా కట్టడి చేయటంలో భాగంగా పోలీసులు కొంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. అడుగడుగునా చెక్ పోస్ట్ లు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఆఫీస్ కు వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. తమ ఐడీ కార్డులు చూపుతున్నా ... పోలీసులు వినిపించుకోవటం లేదని, వర్క్ ఫ్రొం హోమ్ ఆపరేషన్ ఉండగా కార్యాలయాలకు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. కర్ఫ్యూ, లాక్ డౌన్ నుంచి ఐటీ, అనుబంధ రంగాలను మినహాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చినా పోలీసులు వినిపించుకోవడం లేదని, తమను ఇంటికి తిప్పి పంపుతున్నారని కొందరు ఐటీ నిపుణులు వాపోతున్నారు. అయితే, ఇప్పటికే ఆఫీస్ కు వెళ్లి సేవలు అందించే ఉద్యోగుల కోసం సదరు కంపెనీలు ఒక డిక్లరేషన్ ఇస్తున్నాయి. దీనిని చూపితే పోలీసులు ఎవరినీ అడ్డుకోరని ఒక కంపెనీ ఉన్నతాధికారి వెల్లడించారు.

అందుకే ఐటీ కి మినహాయింపు...
ఐటీ రంగంలో హైదరాబాద్ కు ఒక విశిష్ట గుర్తింపు ఉంది. ఈ రంగంలో బెంగళూరు మన కన్నా ముందున్నప్పటికీ... ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఫార్చ్యూన్ 500 కంపెనీలు అన్నీ కూడా ఇండియా లో తమ హెడ్క్వార్టర్స్ హైదరాబాద్ లోనే నెలకొల్పుతాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, ఆపిల్, అమెజాన్ వంటి కంపెనీలకు అమెరికా వెలుపల ఉన్న అతిపెద్ద కార్యాలయాలు హైదరాబాద్ లోనే ఉండటం విశేషం. ఇలా సుమారు 100 కి పైగా గ్లోబల్ కంపెనీలు అధిక సంఖ్యలో తమ ఉద్యోగులను కలిగి ఉన్న ప్రాంతం ఇదే. అందుకే, 24/7 సేవలు అందించాల్సిన అవసరం ఉన్న ఈ రంగాన్ని అత్యవర సేవల కింద గుర్తించి ప్రస్తుత లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. మరో వైపు హైదరాబాద్ నుంచి జరిగే ఐటీ ఎగుమతులు రూ 1 లక్ష కోట్లు దాటాయి. తెలంగాణ ఉద్యమం తారాస్థాయిలో జరుగుతున్నప్పుడు కూడా ఐటీ రంగం సాఫీగా సాగిపోయిన విషయం తెలిసిందే.