తగ్గిన ఎగుమతులు, దిగుమతులు: అక్టోబర్‌లో 8.71 బిలియన్ డాలర్లకు వాణిజ్య లోటు
న్యూఢిల్లీ: అక్టోబర్ నెలలో భారత ఎగుమతులు 5.12 శాతం క్షీణించి 24.89 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇది దాదాపు రూ.1.85 లక్షల కోట్లు. సెప్టెంబర్ మాసంలో సానుకూల వృద్ధి నమోదు చేసినప్పటికీ, గత నెల మాత్రం ఆ జోరు కొనసాగలేదు. పెట్రోలియం ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, తోళ్లు, ఇంజినీరింగ్ వస్తువుల ఎగుమతులు తగ్గినట్లు ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదే సమయంలో దిగుమతులు కూడా తగ్గాయి. దిగుమతులు 11.53 శాతం క్షీణించి 33.6 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఒత్తిడిలోని 26రంగాలకు భారీ ప్యాకేజీ: నిర్మలా సీతారామన్, 5 ఏళ్ల కాలపరిమితి, మార్చి 31 వరకు గడువు

ఎగుమతులు, దిగుమతులు డౌన్, తగ్గిన వాణిజ్య లోటు
ఎగుమతులు 5 శాతం తగ్గినప్పటికీ, దిగుమతులు అంతకు రెట్టింపు కంటే ఎక్కువ 11.53 శాతం తగ్గడంతో వాణిజ్య లోటు 11.75 బిలియన్ డాలర్ల (రూ.87,713 కోట్లు) నుండి 8.71 బిలియన్ డాలర్లకు (రూ.65,016 కోట్లు) తగ్గింది. అక్టోబర్ ఎగుమతుల్లో పెట్రోలియం ఉత్పత్తులు భారీగా క్షీణించాయి.
ఆరు నెలల క్షీణత తర్వాత సెప్టెంబర్‌లో వృద్ధిబాట (5.99 శాతం వృద్ధితో 7.58 బిలియన్ డాలర్లు) పట్టినప్పటికీ, అక్టోబర్‌లో 5.12 శాతం క్షీణత నమోదు కాడవం గమనార్హం.

ఈవి పడిపోయి, ఇవి పెరిగాయి
ఎగుమతులు భారీగా పడిపోయిన రంగాల్లో పెట్రోలియం ఉత్పత్తులు 52 శాతం, జీడిపప్పు 21.57 శాతం, రత్నాలు, ఆభరణాలు 21.27 శాతం, తోలు 16.67 శాతం, మ్యాన్ మేడ్ యార్న్/ఫ్యాబ్రిక్స్ 12.8 శాతం, ఎలక్ట్రానిక్ గూడ్స్ 9.4 శాతం, కాఫీ 9.2 శాతం, సముద్ర ఉత్పత్తులు 8 శాతం, ఇంజనీరింగ్ వస్తువులు 3.75 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. బియ్యం, ఆయిల్ మీల్స్, ముడి ఇనుము, చమురు గింజలు, కార్పెట్లు, ఫార్మా, సుగంధ ద్రవ్యాలు, పత్తి, రసాయనాల ఎగుమతులు మాత్రం వృద్ధిని నమోదు చేశాయి.

ఏడు నెలల కాలంలో డౌన్
ఏప్రిల్-అక్టోబర్ ఏడు నెలల కాలంలో ఎగుమతులు 19.02 శాతం తగ్గి 150.14 బిలియన్ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 36.28 శాతం పడిపోయి 182.29 బిలియన్ డాలర్లుగా నమోదయింది. చమురు దిగుమతులు 38.52 శాతం మేర తగ్గి 5.98 బిలియన్ డాలర్లు, చమురేతర దిగుమతులు 49.5 శాతం క్షీణించి 37.84 బిలియన్ డాలర్లుగా ఉంది.

కరెంట్ అకౌంట్ పాజిటివ్
దిగుమతులు భారీగా తగ్గంతో కరెంట్ అకౌంట్ లావాదేవీల విషయంలో వరుసగా రెండో త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత్ మిగులును నమోదు చేసింది. ఈ మొత్తం 19.8 బిలియన్ డాలర్లుగా నమోదయింది. ఆ త్రైమాసికం జీడీపీ వ్యాల్యూలో ఇది 3.9 శాతం. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కరెంట్ అకౌంట్ మిగులు 0.6 మిలియన్ డాలర్లుగా నమోదయింది. నిర్ధిష్ట ఆర్థిక సంవత్సరంలో వచ్చి, పోయే మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసాన్ని కరెంట్ అకౌంట్‌ను ప్రతిబంబిస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరెంట్ అకౌంట్ మిగులును నమోదు చేయనుంది. ఈ వ్యాల్యూ దాదాపు 30 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా.