ఫెడెక్స్ సీఈవోగా భారతీయుడు: ఎవరీ రాజ్ సుబ్రమణియమ్?
ఇండియన్ అమెరికన్ రాజ్ సుబ్రమణియన్ ఫెడెక్స్(FedEx) సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ అమెరికా మల్టీ నేషనల్ కొరియర్ సర్వీస్ మేజర్ సోమవారం నాడు ఈ మేరకు ప్రకటన చేసింది. ఫెడెక్స్ ఫౌండర్, సీఈవో ఫ్రెడెరిక్ డబ్ల్యు స్మిత్ 1వ తేదీ జూన్, 2022లో సీఈవో బాధ్యతల నుండి తప్పుకోనున్నారు. ఆ తర్వాత రాజ్ సుబ్రమణియన్ ఆ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. రాజ్ సుబ్రమణియన్ ఫెడెక్స్‌ను మున్ముందు మరింత ముందుకు తీసుకు వెళ్తారని, అతనిపై తనకు పూర్తి విశ్వాసముందని ఫ్రెడెరిక్ డబ్ల్యు స్మిత్ పేర్కొన్నారు.

ఎన్నో బాధ్యతలు
రాజ్ సుబ్రమణియన్ మూడు దశాబ్దాల క్రితం ఫెడెక్స్‌లో జాయిన్ అయ్యారు. సుబ్రమణియన్ వయస్సు 56. 1991లో చేరిన ఈయన ఆసియా, అమెరికాలో పలు మార్కెటింగ్, మేనేజ్‌మెంట్ బాధ్యతలను నిర్వర్తించారు. అతను త్వరలోనే చీఫ్ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ ఆఫీసర్ స్థాయికి ఎదిగారు. అక్కడ కార్పోరేట్ స్ట్రాటెజీ డెవలప్‌మెంట్ బాధ్యతలు చేపట్టారు.
ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్ సీఈవో, ప్రెసిడెంట్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఫెడెక్స్ ప్రపంచ అతిపెద్ద ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ. 2020లో ఫెడెక్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో చేరారు. సుబ్రమణయన్‌కు ముప్పై సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

6,00,000 మంది ఉద్యోగులు
ఫెడెక్స్ హెడ్ క్వార్టర్ టెన్నెస్సీలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీకి 6,00,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అంతకుముందు ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాన్స్‌పోర్టేషన్ కంపెనీ ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్ సీఈవోగా, ఫెడెక్స్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్‌గా ఉన్నారు. కెనడాలో ఫెడెక్స్ ఎక్స్‌ప్రెస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు.

1971లో ప్రారంభం
ఫ్రెడెరిక్ డబ్ల్యు స్మిత్ 1971లో ఫెడెక్స్‌ను ప్రారంభించారు. ఫెడెక్స్‌లో ఉద్యోగం పట్ల ఎక్కువమంది ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తారు. కొద్ది కాలం క్రితం చేసిన సర్వేలో అమెరికాకు చెందిన కంపెనీల్లో పని చేయడం పట్ల 57 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, కేవలం ఫెడెక్స్‌లో వర్క్ పట్ల 78 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌లోను ఫెడెక్స్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.