ఇరాన్‌పై యుద్ధంతో ఖాళీ అవుతున్న అమెరికా ఖజానా.. తొలి 24 గంటల్లోనే రూ. 7 వేల కోట్లకు పైగా ఖర్చు..
పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. యుద్ధమేఘాలు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. United States, Israel, Iran మధ్య కొనసాగుతున్న యుద్ధం నేటితో నాల్గవ రోజుకు చేరుకుంది. మొదట పరిమిత స్థాయిలో ప్రారంభమైన ఈ వార్ ఇప్పుడు గల్ఫ్ ప్రాంతం మొత్తం వ్యాప్తి చెందుతూ.. అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలకు దారితీస్తోంది. ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర సైనిక చర్యలను ముమ్మరం చేయడంతో.. ఇది స్వల్పకాలిక ఘర్షణగా కాకుండా దీర్ఘకాలిక యుద్ధంగా మారే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఈ యుద్ధం కనీసం నాలుగు వారాల పాటు కొనసాగవచ్చని అమెరికా అధ్యక్షుడు Donald Trump స్పష్టం చేశారు. అవసరమైతే మరింత కాలం కూడా యుద్ధం కొనసాగించే సైనిక సామర్థ్యం తమ వద్ద ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ ప్రకటనతో పాటు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఒక్కటే. ఈ యుద్ధం అమెరికాకు ఎంత ఖర్చవుతుంది? అని..

టర్కీకి చెందిన అనడోలు వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ప్రారంభమైన ఇరాన్‌పై దాడి మొదటి 24 గంటల్లోనే అమెరికాకు సుమారు 779 మిలియన్ డాలర్లు ఖర్చయింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ. 7,100 కోట్లకు పైగా అవుతుంది. ఇది కేవలం యుద్ధం మొదటి రోజునే జరిగిన వ్యయం కావడం గమనార్హం.
అదేవిధంగా అల్ జజీరా నివేదిక ప్రకారం.. యుద్ధం ప్రారంభమయ్యే ముందు సైనిక సన్నాహాలకే అమెరికా ఇంకా 630 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇందులో యుద్ధ విమానాల మోహరింపు, నావికాదళ నౌకలను గల్ఫ్ ప్రాంతానికి తరలించడం, రాడార్, నిఘా వ్యవస్థలను యాక్టివేట్ చేయడం వంటి ఏర్పాట్లు ఉన్నాయి. అంటే యుద్ధం మొదలయ్యేలోపే అమెరికా వెయ్యి మిలియన్ డాలర్లకు పైగా వ్యయం చేసినట్టేనని చెప్పవచ్చు.
అనడోలు వివరాల ప్రకారం.. ఈ Iran War వ్యయంలో అత్యధిక భాగం యుద్ధ విమానాల మోహరింపుకే వెచ్చించడం జరిగింది. ఇరాన్‌పై తొలి దాడుల్లో F-18, F-16, F-22, F-35 వంటి అత్యాధునిక యుద్ధ విమానాలను వినియోగించారు. వీటి ఆపరేషన్ ఖర్చు మాత్రమే సుమారు 271 మిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. వీటితో పాటు EA-18G గ్రోలర్ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ విమానాలు, A-10C థండర్‌బోల్ట్ అటాక్ విమానాలు, MQ-9 రీపర్ డ్రోన్‌లు, ఇతర మానవరహిత యుద్ధ వ్యవస్థలు కూడా ఉపయోగంలో ఉన్నాయి. ప్రతి డ్రోన్, ప్రతి ఫ్లైట్ గంట కూడా భారీ ఖర్చునే మోస్తోంది.
ఇక నావికాదళ వ్యయం మరో పెద్ద భారం. క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌ను గల్ఫ్ ప్రాంతంలో నిర్వహించడానికే రోజుకు సుమారు 6.5 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని భద్రతా నిపుణులు చెబుతున్నారు. అలాంటి గ్రూపులు వారాల తరబడి అక్కడ కొనసాగితే..మొత్తం వ్యయం అంచనాలకు అందని స్థాయికి చేరే అవకాశం ఉంది. క్షిపణి రక్షణ వ్యవస్థలు, ఎయిర్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్లు, ఉపగ్రహ నిఘా వ్యవస్థలు కూడా ఈ ఖర్చును మరింత పెంచుతున్నాయి.
ఈ పరిస్థితిలో గత అనుభవాలు కూడా గుర్తుకు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో 20 ఏళ్ల పాటు సాగిన యుద్ధంలో అమెరికా ట్రిలియన్ల డాలర్లు ఖర్చు చేసింది. ఒక అంచనా ప్రకారం.. ఆ యుద్ధం కోసం అమెరికా కాంగ్రెస్ ఒక్క రక్షణ శాఖకే 1 ట్రిలియన్ డాలర్లకు పైగా నిధులు కేటాయించింది. ఇతర వ్యయాలను కలుపుకుంటే మొత్తం ఖర్చు 2.3 ట్రిలియన్ డాలర్లను దాటింది. అంతేకాదు, ఆ యుద్ధాల్లో పాల్గొన్న సైనికుల సంరక్షణ ఖర్చులు 2050 నాటికి మరో 2 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంటాయని అంచనాలు చెబుతున్నాయి. క్లుప్తంగా చూస్తే.. ఇరాన్‌తో జరుగుతున్న ఈ యుద్ధం స్వల్పకాలికంగా కనిపించినా.. అది ఎక్కువ కాలం సాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన భారం పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ యుద్ధం ఎటువైపు మలుపు తిరుగుతుందో ఆతృతగా ఎదురుచూస్తోంది.


Click it and Unblock the Notifications