పెరిగిన సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోళ్ళు ... కరోనా ఎఫెక్ట్ అంటే నమ్ముతారా !!
తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ హ్యాండ్ వాహనాలకు గిరాకీ బాగా పెరిగింది. కరోనా లాక్డౌన్ తరువాత సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకాలు చూస్తే విపరీతంగా పెరిగినట్లుగా తెలుస్తుంది. కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పబ్లిక్ వాహనాల్లో ప్రయాణం చేస్తే సేఫ్టీ కాదనే ఉద్దేశం ప్రజల్లో పెరగడంతో సెకండ్ హ్యాండ్ వాహనమైన పర్వాలేదు, సొంత వాహనం అయితే చాలు అని చాలా మంది భావిస్తున్నారు. అందుకే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు కోసం పరుగులు పెడుతున్నారు.
అక్కడ రియల్ ఎస్టేట్ ధరలు ఢమాల్: కొనుగోలుకు ఇదే సరైన సమయం అంటున్న నిపుణులు

కరోనాతో బాగా తగ్గినా ప్రజా రవాణా
సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేసినప్పటికీ వారికి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఇస్తుండడంతో, కార్లు , ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొనసాగిన లాక్ డౌన్ కారణంగా పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ బాగా తగ్గింది. ప్రస్తుతం కూడా చాలా తక్కువ సంఖ్యలో బస్సులు నడుస్తున్నాయి. ఇక రైళ్ళ సంగతి జనాలు మర్చిపోయి చాలా కాలమైంది.

కరోనా ఎఫెక్ట్ ... సొంత వాహనమే సేఫ్ అన్న భావన
ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సొంత వాహనం అయితే బెస్ట్ అని చాలామంది ఫీలవుతున్నారు. అందుకోసం సెకండ్ హ్యాండ్ వాహనాలను విక్రయించే కన్సల్టెన్సీలను జల్లెడ పడుతున్నారు. తమకు నచ్చిన వాహనాన్ని చీప్ అండ్ బెస్ట్ లో కొనుగోలు చేయాలని భావిస్తున్న చాలామంది ఇప్పటికే హైదరాబాద్ లో పెద్ద ఎత్తున వాహనాలను కొనుగోలు చేసినట్లుగా కార్ల కొనుగోళ్ళు అమ్మకాలు జరిపే కన్సల్టెన్సీలు చెబుతున్నాయి.

కరోనా దెబ్బకు బిజినెస్ డల్ అనుకుంటే వూహించని గిరాకీ
కరోనా లాక్ డౌన్ ప్రభావంతో తమకు బిజినెస్ డల్ గా ఉంటుంది అని భావిస్తే, ఊహించని విధంగా ప్రజలు సొంత వాహనాలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని వారు చెబుతున్నారు. ఆటోలు, క్యాబ్ లు, బస్సులలో ప్రయాణం చేయాలంటే సేఫ్టీ కాదనే భావనతోనే సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారని వారంటున్నారు.
సెకండ్ హ్యాండ్ వెహికల్స్ మార్కెట్ బాగుండటంతో బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు లోన్లు ఇస్తున్న నేపథ్యంలోనే చాలామంది వాహనాల కొనుగోలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

వెబ్ సైట్స్ లోనూ జోరుగా కొనుగోళ్ళు
వెబ్ సైట్స్ లో వాహనాలు కొనుగోలు చేస్తున్న కస్టమర్లు లేకపోలేదు. ఓఎల్ఎక్స్, క్విక్కర్ , డ్రూమ్, కార్ దేఖో, కార్ 24, కార్ వాలే వంటి వెబ్సైట్లలో కూడా ఎక్కువగా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అమ్ముడు పోతున్నాయి. ఒక్క హైదరాబాద్ మాత్రమే కాదు వరంగల్, ఖమ్మం కరీంనగర్ వంటి నగరాల్లో కూడా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ బాగా కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొనుగోలు చేసేవారు అన్ని డాక్యుమెంట్లు పక్కాగా చూసుకోవాలనేది నిపుణుల సలహా .