హమ్మయ్య! నియామకాలు పెరుగుతున్నాయ్: హైదరాబాద్‌లో 22% జంప్
కరోనా కాలంలో భారత్ సహా ప్రపంచ దేశాల్లో నిరుద్యోగం పెరిగింది. కరోనా ఫస్ట్ వేవ్ నుండి కోలుకుంటున్న సమయంలో మన దేశంలో ఇటీవల సెకండ్ వేవ్ దెబ్బతీసింది. కరోనా కాలంలో చాలామంది ఉద్యోగాలు పోయాయి. అయితే జూన్ నుండి ఉద్యోగ రికవరీ పెరిగింది. నెల ప్రాతిపదికన మే 2021తో పోలిస్తే జూన్ 2021లో 27 పరిశ్రమల్లో ఉద్యోగాలు పెరిగాయని మాన్‌స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్ వెల్లడించింది. అన్ని రంగాల్లోని నియామకాలు క్రమంగా పుంజుకుంటున్నాయని పేర్కొంది.

ఏడాది ప్రాతిపదికన జంప్
ఏడాది ప్రాతిపదికన అంటే 2020 జూన్ నెలతో చూస్తే ఈ జూన్ మాసంలో మెట్రోపాలిటన్ నగరాలు బెంగళూరులో 50 శాతం, పుణేలో 28 శాతం, హైదరాబాద్‌లో 22 శాతం, చెన్నైలో 2 శాతం, ముంబైలో 7 శాతం, ఢిల్లీలో 4 శాతం పెరిగాయి. డిజిటలైజేషన్ నేపథ్యంలో సాఫ్టువేర్, హార్డ్‌వేర్, టెలికం రంగాల్లో 35 శాతం వరకు పెరిగింది. అన్ని లెవల్స్ జాబ్ పోస్టింగ్స్‌లో నెల ప్రాతిపదికన 6 శాతం వృద్ధి నమోదయింది. ఈ మేరకు ఉద్యోగ డేటాకు సంబంధించిన ఫలితాలను మాన్‌స్టర్ డాట్ కామ్ ప్రచురించింది.

అన్ని రంగాల్లో జంప్
ఆయా రంగాలు, నగరాలు, అన్ని లెవల్ పోస్టింగ్స్‌కు సంబంధించిన వివరాలు పేర్కొంది. గత ఆరు నెలల కాలంలో సెకండ్ వేవ్ దెబ్బపడినప్పటికీ వివిధ రంగాల్లో జాబ్ పోస్టింగ్ వృద్ధి మాత్రం 6 శాతంగా నమోదయింది. మే నెల నుండి జూన్ నెలతో పోలిస్తే నాలుగు శాతం వృద్ధి నమోదు చేసింది. మొత్తం జాబ్ పోస్టింగ్స్ 7 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే ఐటీ, హార్డ్ వేర్, సాఫ్టువేర్ రంగాల్లో 32 శాతం, లాజిస్టిక్స్, కొరియర్, ట్రాన్సుపోర్టేషన్ 29 శాతం వృద్ధి నమోదయింది.

రంగాలవారీగా...
నెల ప్రాతిపదికన దాదాపు అన్ని రంగాల్లో ఉద్యోగ నియామకాల్లో పెరుగుదల కనిపించింది. ఎగుమతులు, దిగుమతులు 25 శాతం, ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ 14 శాతం, షిప్పింగ్ అండ్ మెరైన్ 11 శాతం, హెల్త్ కేర్, బయో టెక్నాలజీ అండ్ లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్ 10 శాతం వృద్ధి నమోదయింది. ఏడాది ప్రాతిపదికన టెలికం 39 శాతం, సాఫ్టువేర్ 32 శాతం, ట్రాన్సుపోర్టేషన్ 29 శాతం వృద్ధి నమోదవకా, ట్రావెల్ అండ్ టూరిజం 42 శాతం, ఎడ్యుకేషన్ 27 శాత, ఆయిల్, గ్యాస్, పెట్రోలియం, పవర్ 18 శాతం క్షీణించింది.

హైదరాబాద్‌లో 22 శాతం జంప్
నగరాల వారీగా చూస్తే ఏడాది ప్రాతిపతికన బెంగళూరులో 50 శాతం, పుణే 28 శాతం, హైదరాబాద్ 22 శాతం, చెన్నై 22 శాతం, ముంబై 7 శాతం, ఢిల్లీలో 4 శాతం పెరిగింది. టైర్ 2 నగరాలు బరోడాలో 23 శాతం, జైపూర్ 18 శాతం, కోల్‌కతాలో 15 శాతం, కోయంబత్తూర్‌లో 3 శాతం, కోచ్చిలో 1 శాతం తగ్గింది.