కేంద్రం చర్యలు, రిటైల్ మార్కెట్లో తక్కువ ధరకే ఉల్లి ధర
ఉల్లి ధరలు గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు కాస్త తక్కువకు వస్తున్నాయి. ఈసారి ధరలు వినియోగదారులకు ఇబ్బందికరంగా మారాయి. ఉల్లి ధరలు తగ్గించేందుకు కేంద్రం చేస్తోన్న ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో పలుచోట్ల రిటైల్ ఉల్లి ధర కిలోకు రూ.40.13, క్వింటాల్‌కు రూ.3,215.92గా ఉందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ధరలను తగ్గించేందుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ చర్యలు చేపట్టింది.
దేశంలో ఉల్లి ధరలను నియంత్రించేందుకు వీలుగా కేంద్రం ఆగస్ట్ నెలలో గోదాముల్లో రికార్డ్ స్థాయిలో 2,00,000 టన్నుల ఉల్లిపాయలను నిల్వ చేసింది. దేశవ్యాప్తంగా ఇటీవల వర్షాల కారణంగా ఉల్లి రవాణాకు అంతరాయం ఏర్పడటంతో మార్కెట్లోకి ఈ ధర కిలోకు రూ.40కు పెరిగింది. దీంతో ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ నిల్వ చేసిన ఉల్లిపాయల బఫర్ నుండి విడుదల చేసింది. ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ పద్ధతిన వీటిని బయటకు తెచ్చింది.

నవంబర్ 2, 2021న 1,11,376.17 మెట్రిక్ టన్నుల ఉల్లిని విడుదల చేసింది. వీటిని మేజర్ మార్కెట్లు ఢిల్లీ, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, గౌహతి, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, చండీగఢ్, కొచ్చి, రాయపూర్‌లకు కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉల్లిని దాని బఫర్ స్టాక్ నుండి కిలో రూ.21 విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మార్కెట్లో పెరిగిన ఉల్లి ధర దిగి వచ్చింది. 2020 అక్టోబర్‌లో కూడా ఉల్లి ధరలు రెట్టింపు అయ్యాయి.