అతిపెద్ద సవాల్ దిశగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, 55 ఏళ్లలో సింగపూర్ వరస్ట్!
కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా చాలా పెద్ద సవాల్ ఎదురు కానుందని సింగపూర్‌కు చెందిన, ఆసియా అతిపెద్ద బ్యాంకు డీబీఎస్ సీఈవో పీయూష్ గుప్త చెప్పారు. అనేక బ్యాంకులకు ఎన్పీఏలు పెరగక తప్పదని చెబుతున్నారు. ప్రభుత్వాలు వ్యాపార సమూహాలకు నష్టపోయిన మేరకు ఆర్థికంగా మద్దతు ఇవ్వలేవన్నారు. బ్యాంకుల్లో చాలా డిఫాల్ట్స్ చూస్తారని, తద్వారా ఆర్థిక రంగంలో సమస్యలు చూస్తారన్నారు. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు సంక్షోభంలోకి వెళ్లాయన్నారు. దశాబ్దం క్రితం (2008-09)లో వచ్చిన ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే ఈ సంక్షోభం చాలా పెద్దది అన్నారు.

ఉద్దీపన ప్యాకేజీలపై...
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని డీబీఎస్ సీఈవో అన్నారు. ఆయా ప్రభుత్వాలు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వ్యాపారాలకు సహకారిగా ఉంటాయని, కానీ పూర్తిగా అండగా ఉండలేవని అభిప్రాయపడ్డారు. కొన్ని కంపెనీలు మనుగడ సాగించలేని పరిస్థితులు తలెత్తవచ్చునని, వీటి పట్ల ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది పెద్ద ప్రశ్న అన్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈలకు ఇది అతిపెద్ద సవాల్ అన్నారు. డిమాండ్ ఎలా ఉంటుందనే ఆందోళన నేపథ్యంలో వచ్చే ఏడాది అత్యంత పెద్ద సవాల్‌గా చెబుతున్నారు.

సింగపూర్ వరస్ట్ ప్రతికూలత
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉందని చెప్పారు. కరోనా కారణంగా వ్యాపారాలకు ప్రభుత్వాల నుండి సంపూర్ణ మద్దతు కూడా ఇబ్బందికరమే అంటున్నారు. డీబీఎస్ సింగపూర్ బేస్డ్ బ్యాంకు. కరోనా నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం తమ దేశ ఆర్థిక వ్యవస్థ 4 శాతం నుండి 7 శాతం ఆర్థిక సంకోచాన్ని నమోదు చేస్తుందని అంచనా వేసింది. 1965లో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇదే వరస్ట్ ప్రతికూలత అంటున్నారు.

బ్యాడ్ లోన్స్ పెరుగుదల
ప్రజలకు, వ్యాపారులకు కరోనా కష్టకాలంలో రుణ చెల్లింపులను ఈ ఏడాది చివరి వరకు కూడా వాయిదా వేసిన ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయని గుర్తు చేశారు. వివిధ సెంట్రల్ బ్యాంకులు ఈఎంఐ చెల్లింపులను వాయిదా వేయాలని సూచిస్తున్నాయి. ఆర్బీఐ కూడా ఇక్కడ మన బ్యాంకులను ఆదేశించిన విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం చూసిన బ్యాడ్ లోన్స్ కంటే ఈసారి భారీగా ఉంటాయని చెప్పారు. ఈ ఏడాది చివరి వరకు, వచ్చే ఏడాది ప్రారంభంలో ఆర్థిక వ్యవస్థలపై భారీ ఒత్తిడిని చూస్తామని చెప్పారు.