క్యూర్ ఫిట్‌కు షాక్: 12 నగరాల్లో ఈట్ ఫిట్ మూసివేత!
ప్రముఖ ఫిట్నెస్ సేవల స్టార్టుప్ కంపెనీ క్యూర్ ఫిట్ కు భారీ షాక్ తగిలింది. కరోనా వైరస్ విజృంభణ తో తన ఫుడ్ డెలివరీ విభాగం ఈట్ ఫిట్ కు భారీగా ఆర్డర్లు తగ్గిపోయాయి. దీంతో ఇక ఆ విభాగం ఎంత మాత్రం లాభదాయకం కాదని తేలిపోయింది. దీంతో క్యూర్ ఫిట్ కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. దేశంలోని కొన్ని మినహా దాదాపు అన్ని నగరాల్లో ఈట్ ఫిట్ సేవలు నిలిచి పోయాయి. ఈ మేరకు ఎంట్రాకర్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో దేశంలో ఫుడ్ డెలివరీ సేవల రంగం ఎంతటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందో స్పష్టమవుతోంది.
ఈ రంగంలో నిమగ్నమైన మహా మహా కంపెనీలు కూడా ఏమీ చేయలేక తమ సేవలను తగ్గించుకున్నాయి. ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడు ఆ వంతు క్యూర్ ఫిట్ వరకు వచ్చింది. క్యూర్ ఫిట్ అనే స్టార్టుప్ కంపెనీని 2016 లో ముకేశ్ బన్సల్, అంకిత్ నాగోరి కలిసి స్థాపించారు. మైన్త్రా వ్యవస్థకుల్లో ఒకరైన ముకేశ్ బన్సల్ .. ఫ్లిప్ కార్ట్ లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గా పనిచేసిన అంకిత్ నాగోరి తో చేతులు కలిపి దీనిని స్థాపించారు. దేశంలో వ్యవస్థాగత గొలుసుకట్టు జిమ్ లను ఏర్పాటు చేయటం దీని ముఖ్య ఉద్దేశం.
లైసెన్స్ రూల్స్, పండుగ సీజన్లో టీవీ కంపెనీలకు కలవరపాటు

హైదరాబాద్ లో మాత్రం లభ్యం...
క్యూర్ ఫిట్ తన ఫుడ్ డెలివరీ సేవల విభాగం ఈట్ ఫిట్ ను దేశంలోని 12 నగరాల్లో పూర్తిగా నిలిపివేసింది. కానీ, మన హైదరాబాద్ లో మాత్రం కొనసాగిస్తోంది. అలాగే బెంగళూరు, కోయంబత్తూర్ లో కూడా సేవలు కొనసాగుతున్నాయి. అయితే, ఇవి కూడా ఎంత కాలం కొనసాగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. రియల్ ఎస్టేట్ వ్యయాలు అధికంగా ఉండటం తో పాటు ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తూ ఎక్కువ కాలం కొనసాగే పరిస్థితి కొరవడింది. అందుకే సుమారు 70% ఉద్యోగులను తొలగించినట్లు ఎంట్రాకర్ తన కథనంలో వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా ప్రజలు బయటి ఫుడ్ తినేందుకు ఇష్టపడటం లేదు. దీంతో ఆన్లైన్ డెలివరీ కంపెనీలు అన్నీ ఇబ్బందికి గురవుతున్నాయి. మళ్ళీ ఎప్పుడు ప్రజలు బయట తినేందుకు ఇష్టపడతారో , లేదా ఆన్లైన్ ప్లాట్ఫారం పై ఆర్డర్ చేస్తారో తెలియని పరిస్థితి. కాబట్టి, ఇక తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రోజుకు 35,000 ఆర్డర్లు...
క్యూర్ ఫిట్ తన ఫుడ్ విభాగం ఐన ఈట్ ఫుడ్ ద్వారా రోజుకు సుమారు 35,000 ఆర్డర్లను ప్రాసెస్ చేసేది. తన క్లౌడ్ కిచెన్ ల ద్వారా ఈ ఆర్డర్లను ప్రాసెస్ చేస్తుండేది. సుమారు 15 నగరాల్లో ఫిట్నెస్ కు సంబంధించి ఆరోగ్యకరమైన భోజనాన్ని సరఫరా చేసేలా ఏర్పాట్లు ఉండేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఈట్ ఫిట్ కు రోజుకు కేవలం 5,000 ఆర్డర్లు మాత్రమే లభిస్తున్నాయని సమాచారం. దీంతో ఇక ఫుడ్ విభాగం లాభదాయకం కాదని తేలిపోయింది. అందుకే, ఇక మూసివేతే సరైన నిర్ణయం గా క్యూర్ ఫిట్ భావించి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇండియా లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ లో హేమా హేమీ లు ఐన స్విగ్గి, జొమాటో లకు కూడా ప్రస్తుతం సగం ఆర్డర్లు కూడా లభించటం లేదని తెలుస్తోంది. అందుకే, స్విగ్గి కూడా తన క్లౌడ్ కిచెన్ సేవలను 40-50% వరకు తగ్గించుకున్నట్లు తెలిసింది. స్విగ్గి, జొమాటో రెండూ కూడా ఉద్యోగులను కూడా తొలగించిన విషయం తెలిసిందే.

400 మిలియన్ డాలర్ల పెట్టుబడులు...
క్యూర్ ఫిట్ ను ఏర్పాటు చేసిన ఫౌండర్లు ముకేశ్ బన్సల్, అంకిత్ నాగోరి తమ సంస్థ విస్తరణ కోసం భారీగా పెట్టుబడులను ఆకర్షించారు. అప్పటికే వారిద్దరికీ విజయవంతమైన స్టార్టుప్ రికార్డు ఉండటంతో ఇన్వెస్టర్లు కూడా ఇందులో భారీగా పెట్టుబడి పెట్టారు. ఇప్పటి వరకు క్యూర్ ఫిట్ లోకి 400 మిలియన్ డాలర్ల (సుమారు రూ 3,000 కోట్లు) పెట్టుబడి వచ్చింది. తెమ సెక్ హోల్డింగ్స్, ఆక్సిల్ పార్టనర్స్, కలారీ కాపిటల్, చిరాటే వెంచర్స్ వంటి దిగ్గజ పెట్టుబడి సంస్థలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో లగ్జరీ సదుపాయాలతో జిమ్ లను ఏర్పాటు చేసిందీ సంస్థ. అక్కడితో ఆగకుండా... ఫుడ్ డెలివరీ బిజినెస్ లోకి ప్రవేశించింది. దాంతో పాటు గ్రోసరీ డెలివరీ సేవలను కూడా అందించింది. కానీ, కరోనా వైరస్ పుణ్యమా అని అటు జిమ్ లను తెరిచే పరిస్థితి లేదు. ఇటు ఫుడ్ కొనే కస్టమర్ లేడు.