Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..
భాగ్యనగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు జీహెచ్‌ఎంసీ (GHMC) నడుం బిగించింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన పంజాగుట్ట, బంజారాహిల్స్ పరిసరాల్లో వాహనదారుల ఇబ్బందులను తొలగించడానికి హైదరాబాద్ లో మరో కొత్త స్టీల్ ఫ్లైఓవర్‌ను నిర్మించాలని ప్రతిపాదించింది. నాగార్జున సర్కిల్ (NFCL జంక్షన్) వద్ద ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు వీలుగా ఒక యూని-డైరెక్షనల్ (ఏకదిశ) స్టీల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు.

ఎక్కడి నుంచి ఎక్కడి వరకు?
ఈ కొత్త ప్రాజెక్టు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3 నుంచి ప్రారంభమై జీవీకే మాల్ (GVK Mall) వరకు సాగనుంది. ఇప్పటికే 2022లో అప్పటి ప్రభుత్వం చట్నీస్ హోటల్ వద్ద నగరంలోనే మొదటి స్టీల్ బ్రిడ్జిని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే వరుసలో మరో స్టీల్ ఫ్లైఓవర్‌ను నిర్మించడం ద్వారా టీవీ9 జంక్షన్ నుంచి వచ్చే వాహనాలకు దారి సులభతరం కానుంది. పంజాగుట్ట సర్కిల్, బేగంపేట , సికింద్రాబాద్ వైపు వెళ్లే వేలాది వాహనాలకు ఈ బ్రిడ్జి పెద్ద ఊరటనిస్తుంది.
టెక్నికల్ వివరాలు ఇవే..
జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్ వింగ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్టీల్ బ్రిడ్జి 8.5 మీటర్ల వెడల్పుతో ఉండబోతోంది. దీనిలో 7.5 మీటర్ల క్యారేజ్ వే (వాహనాలు వెళ్లే దారి) ఉంటుంది. రెండు వైపులా అర మీటర్ వెడల్పుతో క్రాష్ బారియర్స్ (రక్షణ గోడలు) నిర్మిస్తారు. స్టీల్ బ్రిడ్జి కింద కూడా వాహనాల రాకపోకలకు వీలుగా వయాడక్ట్ డిజైన్‌ను రూపొందించారు. నాణ్యత , భద్రత కోసం యాంటీ కార్బోనేషన్ పెయింటింగ్ , పియర్ ప్రొటెక్షన్ చర్యలు కూడా తీసుకుంటున్నారు.
టీవీ9 జంక్షన్ వద్ద కొత్త అండర్ పాస్
కేవలం ఫ్లైఓవర్ మాత్రమే కాకుండా, టీవీ9 జంక్షన్ వద్ద రెండు లేన్ల అండర్ పాస్‌ను కూడా జీహెచ్‌ఎంసీ ప్రతిపాదించింది. దీనివల్ల ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ నుంచి శ్రీనగర్ కాలనీ వైపు వెళ్లే వాహనాలకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం సాధ్యమవుతుంది. ఈ అండర్ పాస్ 10 మీటర్ల వెడల్పుతో ఉండి, పాదచారుల కోసం ఫుట్‌పాత్ , డ్రైనేజీ సదుపాయాలను కలిగి ఉంటుంది. వర్షాకాలంలో నీరు నిలవకుండా ఉండేందుకు దీని కింద 2 లక్షల లీటర్ల సామర్థ్యం గల అండర్ గ్రౌండ్ సంప్‌ను కూడా నిర్మించనున్నారు.
ఎందుకు ఈ నిర్ణయం?
హైదరాబాద్ లోని మసాబ్ ట్యాంక్, మెహదీపట్నం , జలగం వెంగళరావు పార్క్ వైపు నుంచి వచ్చే వాహనాలు పంజాగుట్ట వెళ్లే క్రమంలో నాగార్జున సర్కిల్ వద్ద గంటల తరబడి నిలిచిపోతున్నాయి. పీక్ అవర్స్‌లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఈ కొత్త ఫ్లైఓవర్ , అండర్ పాస్ పూర్తయితే, వాహనదారుల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపడంతో, త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications