29న పార్లమెంటులో క్రిప్టో బిల్లు! చైనా నిషేధించినట్లు కాకుండా మధ్యే మార్గం
కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ బిల్లును ప్రవేశ పెడుతోంది. క్రిప్టోను మన దేశంలో నిషేధించాలని 2019లో నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. కానీ క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ అభిప్రాయంతో పాటు వివిధ సంస్థలు, వ్యక్తులు పెట్టిన పెట్టుబడులను దృష్టిలో పెట్టుకొని, కొన్ని పరిమితులతో క్రిప్టోను అనుమతించాలనే నిర్ణయానికి కేంద్రం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రిప్టో బిల్లుకు ఫైనాన్స్ డిపార్టుమెంట్ ఆఫీసర్లు తుదిమెరుగులు దిద్దుతున్నారు. శీతాకాలపు పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 29వ తేదీన ప్రారంభమవుతున్నాయి. ఫాస్ట్ ట్రాక్ విధానంలో క్రిప్టో బిల్లుకు ఆమోదం పొందాలని కేంద్రం యోచిస్తోందని తెలుస్తోంది.

నిబంధనలు కఠినతరం
క్రిప్టోను కట్టడి చేసేందుకు, వాటిల్లో ఇన్వెస్ట్ పెట్టుబడి పెట్టకుండా నిరుత్సాహపరిచేందుకు కేంద్రం సిద్ధమైంది. ఇందుకు నిబంధనలను కఠినతరం చేయనుంది. క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేయాలని భావించేవారు ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ కావడానికి, ట్రేడింగ్‌కు ముందస్తు అనుమతి పొందవలసి ఉంటుందని చెబుతున్నారు. ముందస్తు వెరిఫికేషన్ నిబంధన వల్ల ఒక సంస్థ నుండి మరో సంస్థకు, ఇన్వెస్టర్ల మధ్య ట్రాన్సాక్షన్‌కు అడ్డంకులు ఏర్పడతాయి. ప్రభుత్వ అప్రూవల్ పొందిన క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాలి. అలా కాకుండా ప్రభుత్వ అనుమతిలేని క్రిప్టోల్లో పెట్టుబడి పెడితే మాత్రం పెనాల్టి ఉంటుందని సమాచారం.

పన్నులు
క్రిప్టోల్లో పెట్టుబడి ద్వారా వచ్చే లాభాల పైన 40% పైన పన్ను చెల్లించవలసి ఉంటుందని తెలుస్తోంది. ఈ పార్లమెంటు సమావేశాల్లో తీసుకువస్తారని భావిస్తున్న క్రిప్టో బిల్లులో పన్నుకు సంబంధించిన అంశం ఉంటుందని తెలుస్తోంది. పార్లమెంట్ సెషన్‌కు ముందు క్రిప్టో బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపనుందని తెలుస్తోంది. క్రిప్టో కట్టడికి అనుసరించాల్సిన వ్యూహంపై గతవారం ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.

చైనా నిషేధించినట్లు కాకుండా
క్రిప్టోను చైనా నిషేధించినట్లు కాకుండా, మధ్యేమార్గంగా క్రిప్టోను నియంత్రించే దిశగా కేంద్రం కఠిన నిబంధనలు బిల్లు ద్వారా తీసుకు రానుందని చెబుతున్నారు. క్రిప్టో లాభం పైన డైరెక్ట్, ఇండైరెక్ట్ ట్యాక్స్ విధించనున్నారు. ప్రభుత్వం నిబంధనలు వస్తున్నప్పటికీ క్రిప్టోను కరెన్సీగా పరిగణించే అవకాశం లేదు. కరెన్సీ నోట్లు, నాణేలు కేంద్రం ఆదేశాలతో ఆర్బీఐచే నియంత్రించబడతాయి. రూపాయికి సావరీన్ మద్దతు ఉంది. ఇది ప్రతిస్థాయిలో నియంత్రించబడుతుంది. క్రిప్టో విషయానికి వస్తే కరెన్సీ స్థితి పెద్ద సమస్య అంటున్నారు. హామీ లేకుండా ఉంటుందని అంటున్నారు.