ఏప్రిల్ 1 నుంచి కార్ల ధరల్లో పెరుగుదల - ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి- ఎంత పెరగొచ్చంటే ?
దేశవ్యాప్తంగా రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనదారుల ప్రాణాపాయాన్ని నివారించేందుకు కేంద్రం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఓ మోస్తరు నుంచి టాప్ మోడల్ కార్లలో వినియోగిస్తున్న ఎయిర్‌బ్యాగ్స్‌ను అన్ని కార్లు, ఇతర వాహనాల్లోనూ తప్పనిసరి చేస్తూ కేంద్ర రవాణా మరియు రహదారుల మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటివరకూ సాధారణ మోడళ్ల కార్లకు ఎయిర్‌బ్యాగ్స్‌ను ఆప్షనల్‌గా భావించిన తయారీదారులంతా ఇప్పుడు మార్పులకు సిద్ధమవుతున్నారు. వీటి ప్రభావం కార్ల దరలపై పడబోతోంది.

ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి
దేశవ్యాప్తంగా ప్రధాన రహదారులపై తిరుగుతున్న కార్లతో పాటు ఇతర వాహనాలకు ప్రమాద సమయంలో తెరుచుకునే ఎయిర్‌బ్యాగ్స్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతోంది. కేంద్రం నిర్ణయంతో ఇప్పుడు అన్ని కార్లు, ఇతర వాహనాలకు తప్పనిసరిగా నాణ్యమైన ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరిగా బిగించాల్సిన పరిస్ధితి ఏర్పడుతోంది. దీంతో ఆయా వాహనాల ధరలపైనా ఈ ప్రభావం పడబోతోంది. కానీ దేశవ్యాప్తంగా ఏటా జరుగుతున్న రోడ్లు ప్రమాదాల నివారణలో ఎయిర్ బ్యాగ్స్ ఎంతగానో ఉపయోగపడతాయని కేంద్రం భావిస్తోంది.

కొత్త వాహనాలపై ప్రభావం
కేంద్రం కార్లు, ఇతర వాహనాల్లో ఎయిర్ బ్యాగ్స్‌ను తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయం ప్రభావం ఇప్పటికే మార్కెట్లో వాడుతున్న కార్లపై ఏమాత్రం ఉండదు. కానీ ఇంకా మార్కెట్లలోకి రాని కార్లకు మాత్రం ఈ నిర్ణయం వర్తించబోతోంది. దీంతో ఏప్రిల్ 1 నుంచి అమ్మే కార్లు, ఇతర వాహనాలపై కేంద్రం నిర్ణయం ప్రభావం పడబోతోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న కార్లలో డ్రైవర్‌కు మాత్రమే ఎయిర్ బ్యాగ్ ఆప్షన్ తప్పనిసరిగా ఇస్తుండగా.. ఇకపై కార్లలో కూర్చునే మిగతా వారికి కూడా ఎయిర్ బ్యాగ్స్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మేరకు కార్ల తయారీలో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.

అంతర్జాతీయ రేటింగ్స్‌లో మన కార్ల వెనుకబాటు
ఇప్పటివరకూ డ్రైవర్ సీట్‌కే తప్పనిసరి ఎయిర్‌బ్యాగ్ ఆప్షన్ ద్వారా దేశీయ తయారీ సంస్ధలు మారుతీ, టాటా మోటార్స్‌తో పాటు హ్యుండాయ్, ఇతర కంపెనీల కార్లు కూడా అంతర్జాతీయ కార్ క్రాష్ రేటింగ్స్‌లో దారుణంగా వెనుకబడ్డాయి. ప్రమాదాలు జరిగినప్పుడు ఇవి ఎంత మేరకు తట్టుకుంటాయనే అంశాన్ని పక్కనబెడితే.. అసలు అందులో ప్రయాణికుల భద్రత విషయంలో ఇవి దారుణంగా వెనుకబడ్డాయి. దీనికి ప్రధాన కారణం కారులో ప్రయాణికులందరికీ తప్పనిసరి ఎయిర్‌బ్యాగ్స్ ఇవ్వకపోవడమే. ధరలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటివరకూ పలు లో ఎండ్, హై ఎండ్ కార్లలోనూ తప్పనిసరి ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం లేదు. ఆప్షన్ మాత్రమే అందుబాటులో పెడుతున్నారు. కానీ కేంద్రం తాజా నిబంధనతో ఈ కార్లన్నంటిలోనూ తప్పనిసరి ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వాల్సిందే.

ఒక్కో కారుపై రూ.5 వేల నుంచి రూ.9 వేల భారం
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విధంగా ప్రతీ కారులోనూ తప్పనిసరి ఎయిర్ బ్యాగ్స్ సౌకర్యం కల్పించడం వల్ల ఒక్కో కారుపై కనీసం 5 వేల రూపాయల నుంచి 9 వేల రూపాయల భారం పడబోతోంది. హై ఎండ్ కార్లపై ఈ భారం మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ నిర్ణయం కార్ల కొనుగోలుదారులపై కొంత మేర ప్రభావం చూపే అవకాశముంది. అసలే కరోనా కారణంగా మధ్యతరగతి ఖర్చు, బడ్జెట్లు తగ్గిపోతున్న రోజుల్లో ఈ ప్రభావం వారిపై కచ్చితంగా ఉంటుందని అంచనా. అయితే రోడ్లు ప్రమాదాలతో పోలిస్తే ఇదేమంత భారం కాబోదని కేంద్రం చెబుతోంది.