కేంద్రానికీ కరోనా షాక్ - కొత్త ఉద్యోగాల భర్తీ లేనట్లే- సీబీడీటీ, సీబీఐసీ విలీన ప్రతిపాదనలు...
కరోనా సంక్షోభం ప్రభావంతో ఇప్పటికే ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు గాల్లో దీపాలుగా మారిపోతుంటే వాటిని కాపాడటంలో విఫలమవుతున్న కేంద్రం తాజాగా ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ కోతలు విధించాలనే ప్రతిపాదనను తెరపైకి తెస్తోంది. కరోనా సంక్షోభంతో భారీగా పెరుగుతున్న రెవెన్యూ నష్టాలను పూడ్చుకోవాలంటే ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్ధల్లో భారీ మార్పులు తప్పవనే సంకేతాలను కేంద్రం ఇస్తోంది. దీంతో ఇప్పట్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్దితి కనిపించడం లేదు. ఇప్పటికే రైల్వేశాఖ కొత్తగా రిక్రూట్ మెంట్లు ఉండబోవని ప్రకటించగా... కేంద్రం ఆర్ధిక శాఖతోనే ఈ సంస్కరణలు ప్రారంభించేందుకు సిద్దమవుతోంది.
కోవిడ్ -19 షాక్: ఎంత చేసినా... 34 కోట్ల ఉద్యోగాలు పోతాయి! ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజషన్ అంచనా

కేంద్రంపైనా కరోనా ఎఫెక్ట్
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆర్ధిక వ్యవస్ధలను అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం అనివార్యంగా భారత్ పైనా పడుతోంది. అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధల్లో ఒకటిగా చెప్పుకునే భారతీయ మార్కెట్లలో ఇప్పుడు ఎక్కడ చూసినా వ్యయ నియంత్రణ, ఉద్యోగాల కోత అన్న పదాలే వినిపిస్తున్నాయి. ప్రైవేటు రంగంపై దీని ప్రభావం గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా పడుతుండగా.. కేంద్ర ప్రభుత్వంపైనా ఈ ప్రభావం భారీగా ఉన్నట్లు తాజా అంచనాలు చెబుతున్నాయి. దీంతో కేంద్రం కూడా నష్ట నివారణ చర్యలకు దిగుతోంది. ఇందుకోసం ప్రభుత్వంలో వ్యయ నియంత్రణ కోసం సంస్కరణలు తప్పవనే సంకేతాలు ఇస్తోంది.

సంస్ధల విలీనంతోనే సంస్కరణలు...
గతంలో నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్ధల విషయంలో విలీనం అనే మాట వినిపించేద. కానీ ఇప్పుడు కరోనా సంక్షోభం ప్రారంభమైన తర్వాత లాభనష్టాలతో సంబంధం లేకుండానే భవిష్యత్ సంస్కరణల పేరుతో భారీ మార్పులకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ముందుగా ఆర్ధిక రంగంతోనే సంస్కరణలు మొదలుపెట్టాలని భావిస్తున్న కేంద్రం... ప్రత్యక్ష, పరోక్ష పన్నుల బోర్డులను విలీనం చేయాలనే ప్రతిపాదనను తెరపైకి తెస్తోంది. ఈ మేరకు సీబీడీటీ, సీబీఐసీల విలీనం కోసం తెరవెనుక భారీ ప్రయత్నాలే జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో కేంద్రం నుంచి దీనిపై స్పష్టమైన ప్రకటన రానుంది.

కొత్త ఉద్యోగాలకూ చెక్...
కేంద్రం వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటికే రైల్వే శాఖలో కొత్తగా రిక్రూట్ మెంట్లు ఉండబోవని ప్రకటించిన నేపథ్యంలో మిగిలిన శాఖల విషయంలోనూ ఇదే జరుగుతుందనే అంచనాలు నిజమయ్యాయి. ముందుగా ఆర్ధిక శాఖలో తీసుకుంటున్న ఐఆర్ఎస్ ఉద్యోగాల్లో భారీగా కోతలు విధించాలని కేంద్రం భావిస్తోంది. వ్యవస్ధల విలీనంతో వాటి పరిమాణంలో భారీ మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఆ మేరకు ఉన్న ఉద్యోగులను కూడా ఎక్కడికక్కడ సర్దుబాట్లు చేసేందుకు సిద్ధమవుతోంది. దీంతో ఇక ఇప్పట్లో ఐర్ఎస్ ఉద్యోగాల భర్తీ కూడా ఉండకపోవచ్చని కేంద్రం సంకేతాలు ఇస్తోంది.