For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పీడ్ చూస్తే... డిసెంబర్ కల్లా కరోనా వాక్సిన్ వచ్చేలా ఉంది!

|

అవును. అంతా సవ్యంగా జరిగితే మరో ఆరు నెలల్లోనే కరోనా వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్ కల్లా మార్కెట్లో వాక్సిన్ లభించే ఆస్కారం ఉంది. ఇటీవల మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ పేర్కొన్నట్లు ప్రపంచానికి కరోనా వైరస్ వాక్సిన్ ను అందించే సత్తా భారత్ కు ఉంది అనే విషయం మరోసారి స్పష్టం అయ్యేలా తోస్తోంది. ఇప్పటికే ప్రపంచం ఎదుర్కుంటున్న అనేక రుగ్మతలకు వాక్సిన్ అభివృద్ధి చేసి మూడో వంతు ప్రపంచానికి వాటిని అందించిన ఘన చరిత్ర మనకు సొంతం. ఇప్పుడు కూడా అలాగే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ కు కూడా వాక్సిన్ ను అభివృద్ధి చేసి దాని పీచ మణచటానికి భారత్ కు చెందిన పలు సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ దిశగా ఇప్పటికే చాలా పురోగతి కనిపించటం విశేషం. ముఖ్యంగా మన హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సీన్ వాక్సిన్ తొలిదశ క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్న విషయం తెలిసిందే. దీనిని దేశంలోని 12 ప్రధాన ఆస్పత్రుల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో హైదరాబాద్ లోని ప్రఖ్యాత నిమ్స్ హాస్పిటల్స్ లో కూడా ఇవి ప్రారంభం కావటం విశేషం.

కరోనా డ్రగ్: గ్లెన్‌మార్క్ ఫార్మాకు నోటీసులు, ఎందుకంటేకరోనా డ్రగ్: గ్లెన్‌మార్క్ ఫార్మాకు నోటీసులు, ఎందుకంటే

రేసులో 7 కంపెనీలు...

రేసులో 7 కంపెనీలు...

ప్రపంచ వ్యాప్తంగా వందల సంఖ్యలో వాక్సిన్ కంపెనీలు కరోనా కు చెక్ పెట్టే వాక్సిన్ ను అభివృద్ధి చేసేందుకు నడుం బిగించాయి. ఇందులో మన ఇండియా నుంచి ప్రధానంగా 7 వాక్సిన్ కంపెనీలు చురుగ్గా ఈ పనిలో నిమగ్నమయ్యాయి. భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్, జైడస్ కాడిలా, పనేసియా బయోటెక్, ఇండియన్ ఇమ్మ్యూనోలోజికల్స్, బయోలాజికల్ ఈ, మినవాక్స్ ఇందులో ఉన్నాయి. వీటిలో భారత్ బయోటెక్, ఇండియన్ ఇమ్మ్యూనోలోజికల్స్, బయోలాజికల్ ఈ కంపెనీలు మన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నవే కావటం విశేషం. వీటన్నిటిలో కల్లా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సీన్ ఇప్పటికే మనుషులపై క్లినికల్ ట్రయల్స్ స్థాయికి చేరుకోవటం తెలిసిందే. సీరం ఇన్స్టిట్యూట్, జైడస్ కాడిలా కూడా వేగంగా వాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 140 వాక్సిన్ కాండిడేట్లు అభివృద్ధి చేయగా... వాటిలో ఒక 20-30 వరకు ఆక్టివ్ పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకోవటం విశేషం.

100 కోట్ల డోసులు...

100 కోట్ల డోసులు...

పూణే కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ తొలి నుంచీ చాలా దూకుడుగా ఉంది. ఒకేసారి పలు అంతర్జాతీయ సంస్థలతో కలిసి వాక్సిన్ రూపకల్పనకు నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రముఖ ఫార్మా కంపెనీ ఆస్ట్రా జెనెకా తో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కరోనా వాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను ఆగష్టు లో ఇండియా లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కంపెనీ తో కలిసి ఏకంగా 100 కోట్ల వాక్సిన్ డోసులను తయారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా వెల్లడించారు. ఈ మేరకు ప్రముఖ వార్తా ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. దీని ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నామని అయన పేర్కొన్నట్లు పీటీఐ తెలిపింది. మరోవైపు జైడస్ కాడిలా కూడా మరో 7 నెలల్లో వాక్సిన్ అందుబాటులోకి తేగలమని విశ్వాసం వ్యక్తం చేసింది.

5 ఏళ్ళు...

5 ఏళ్ళు...

సాధారణం గా ఐతే ఒక వాక్సిన్ అభివృద్ధి చేసి, దానిని జంతువులపై పరీక్షలు నిర్వహించి (ప్రీ క్లినికల్ ట్రయల్స్), ఆ తర్వాత దశల వారీగా మనుషులపై (క్లినికల్ ట్రయల్స్) నిర్వహిస్తారు. ఇవి పేజ్ -1, పేజ్ -2, పేజ్-3 లుగా ఉంటాయి. మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం ఐతే మూడో దశలో చాలా పెద్ద సమూహాలకు వాక్సిన్ వేసి దాని పనితీరును అంచనా వేస్తారు. అలాగే మార్కెట్లోకి వాక్సిన్ ను ప్రవేశపెడతారు. ఒక్కో క్లినికల్ ట్రయల్ దశకు కనీసం 6 నెలల సమయం పడుతుంది. పైగా ఆ సమాచారాన్ని రేగులటరీ కి సమర్పించి అనుమతుల కోసం ఏళ్ళ కు ఏళ్ళు ఎదురు చూడాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కోటిన్నర మందికి సోకిన ఈ వైరస్ కు వీలైనంత త్వరగా చెక్ పెట్టేందుకు ప్రభుత్వాలు, రేగులటరీ సంస్థలు వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నాయి. ఐసిఎంఆర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తో సంయుక్తంగా అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ కొవాక్సీన్ ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ మొదలవగా... ఆగష్టు 15 కే అందుబాటులోకి రానుందని వార్తలు వెలువడ్డ విషయం విదితమే. కంపెనీల స్పీడ్ చూస్తుంటే ఏది ఏమైనా డిసెంబర్ నాటికి వాక్సిన్ అందుబాటులోకి వచ్చేలా కనిపిస్తోంది.

English summary

స్పీడ్ చూస్తే... డిసెంబర్ కల్లా కరోనా వాక్సిన్ వచ్చేలా ఉంది! | 7 Indian pharma companies race to develop vaccine for deadly coronavirus

At least seven Indian pharma companies are working to develop a vaccine against coronavirus as they join global efforts to find a preventive to check the spread of the deadly virus that has already infected more than 14 million globally.
Story first published: Tuesday, July 21, 2020, 7:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X