బ్యాంక్ ఆఫ్ బరోడా అలర్ట్: మార్చి 1 నుండి ఇది గుర్తుంచుకోండి, ఇలా తెలుసుకోవచ్చు
దేనా బ్యాంకు, విజయా బ్యాంకులు దాదాపు రెండేళ్ల క్రితం బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమయ్యాయి. ఈ విలీనం అనంతరం రెండు బ్యాంకుల కస్టమర్లు బ్యాంక్ ఆఫ్ బరోడాలో (BoB) జాయిన్ అయ్యారు. ఇప్పుడు BoB మరో కీలక మార్పును చేస్తోంది. మార్చి 1, 2021 నుండి విజయా బ్యాంకు, దేనా బ్యాంకు కస్టమర్లు కొత్త IFSC కోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి BOB కస్టమర్లకు సమాచారం ఇస్తూ, దేనా బ్యాంకు, విజయా బ్యాంకు IFSC కోడ్ ఫిబ్రవరి 28వ తేదీతో ముగిసిపోతుందని తెలిపింది.

మార్చి 1 నుండి మార్పు
మార్చి 1వ తేదీ నుండి విజయా బ్యాంకు, దేనా బ్యాంకు శాఖల IFSC కోడ్స్ మారనున్నాయి. ఈ 2 బ్యాంకులను ఇంతకుముందు BOBలో నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు మాత్రమే పాత IFSC కోడ్స్ ఆధారంగా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించుకునే అవకాశం ఉంది. మార్చి ఒకటి నుండి కొత్త IFSC కోడ్స్ అమలులోకి వస్తాయి. విజయా బ్యాంకు వారి ఈ-విజయ, దేనా బ్యాంకు ఆధ్వర్యంలోని ఈ-దేనా బ్యాంకు IFSC కోడ్స్‌ని నిలిపి వేస్తున్నట్లు ట్వీట్ చేసింది. మార్చి 1వ తేదీ నుండి BOB కోడ్స్ మారుతున్నాయని తెలిపింది. విజయా బ్యాంకు, డేనా బ్యాంకుల బ్రాంచీల్లో కొత్త IFSC కోడ్స్ తెలుసుకోవడం చాలా తేలిక అని వెల్లడించింది.

ఇలా తెలుసుకోండి
IFSC అంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టం కోడ్. ఇది 11 అంకెల సంఖ్య. ప్రతి బ్యాంకు బ్రాంచీకి వేర్వేరు IFSC కోడ్స్ ఉంటాయి. డబ్బులు ట్రాన్సుఫర్ చేయడానికి, ఇతర అవసరాలకు ఈ కోడ్ తప్పనిసరి. BOB కోడ్ BKDN0తో ప్రారంభమవుతుంది. BOB వెబ్‌సైట్‌ను సందర్శించి లేదా బ్యాంకు సిబ్బందిని సంప్రదించి సమాచారం తెలుసుకోవచ్చు. ఎస్సెమ్మెస్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని తెలిపింది. హెల్ప్‌లైన్ 18002581700 ఫోన్ నెంబర్‌కు కాల్ చేయవచ్చు. అలాగే రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నుండి 8422009988 ఫోన్ నెంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపించవచ్చు. MIGR అని టైప్ చేసి ఖాతా నంబర్‌లో నాలుగు అంకెలు పేర్కొంటే, తమ కస్టమర్లకు BOB ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్‌కు సంబంధించిన సమాచారాన్ని మెయిల్ ద్వారా పంపిస్తుంది.

అతిపెద్ద మూడో బ్యాంకు
విజయా, దేనా బ్యాంకులకు 3,898 శాఖలు BOBలో విలీనమయ్యాయి. 2020 డిసెంబర్ నాటికి ఈ విలీన ప్రక్రియ పూర్తయింది. మొత్తం ఐదు కోట్లకు పైగా అకౌంట్లు విలీనమయ్యాయి. విజయా బ్యాంకు, దేనా బ్యాంకు విలీనంతో BOB మూడో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుగా అవతరించింది. ప్రస్తుతం BOBకు 8,248 దేశీయ శాఖలు, 10,318 ఏటీఎంలు ఉన్నాయి.