ప్రైవేట్ బ్యాంక్ లాభాల పంట: మూడేళ్ల తరువాత తొలిసారిగా
ముంబై: దేశంలో అతి పెద్ద ప్రైవేటు కార్పొరేట్ బ్యాంక్‌లల్లో ఒకటైన యస్ బ్యాంక్.. తన మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఎక్స్ఛేంజ్‌కు సమర్పించింది. సుదీర్ఘకాలం తరువాత ఈ బ్యాంక్ భారీ లాభాలను నమోదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల్లోనూ లాభాల బాట పట్టింది. మూడో త్రైమాసికంలో నమోదు చేసిన లాభాలు.. 2018 తరువాత ఇదే తొలిసారి.
క్రిప్టో మార్కెట్లో హాహాకారాలు: భారీగా పతనం
ఎక్స్ఛేంజ్‌కు సమర్పించిన ప్రతిపాదనల ప్రకారం.. డిసెంబర్ 31వ తేదీన ముగిసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 266.43 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది. 77 శాతం మేర వృద్ధి రేటును అందుకుంది. అన్ని రకాల పన్నుల చెల్లింపుల తరువాత 266.43 కోట్ల రూపాయల ఆదాయాన్ని అందుకున్నట్లు వివరించింది. గత ఏడాది ఇదే కాలానికి యస్ బ్యాంక్ నమోదు చేసిన నెట్ ప్రాఫిట్ 148 కోట్ల రూపాయలు మాత్రమే.

నికర వడ్డీ ఆదాయంలో 31 శాతం క్షీణతను అందుకుంది. 1,764 కోట్ల రూపాయలుగా చూపించింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 2,560 కోట్ల రూపాయలు. ఆపరేటింగ్ ప్రాఫిట్‌లోనూ భారీగా వృద్ధి కనిపించింది. 7.7 శాతంతో 731 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఇదివరకు ఈ ఆదాయం 678 కోట్ల రూపాయలు. రిటైల్ ఫీ ఆదాయాన్ని 447 కోట్ల రూపాయలుగా చూపించింది. నెట్ ఇంటరెస్ట్ మార్జిన్ 2.4 శాతంగా నమోదు చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఈ శాతం 2.2గా రికార్డయింది. స్థూల నిరర్థక ఆస్తుల శాతం కొంతమేర మెరుగుపడింది. 14.7 శాతంగా నమోదైంది. రెండో త్రైమాసికంలో ఈ సంఖ్య 15 శాతంగా నమోదైంది. నిరర్ధక ఆస్తుల ప్రొవిజన్ కవరేజ్ 79.3కి చేరింది. అక్టోబర్-నవంబర్-డిసెంబర్‌లో హోల్‌సేల్‌గా 4,760 కోట్ల రూపాయల మేర రుణాలను విడుదల చేసింది. మూడో త్రైమాసికంలో రుణాల రికవరీ భారీగా నమోదైంది. 610 కోట్ల రూపాయల మేర రుణాల వసూళ్లను అందుకుంది.
నెట్ అడ్వాన్సులు 1,76,241 కోట్ల రూపాయలుగా, మొత్తం డిపాజిట్లు 1,84,288 కోట్ల రూపాయలుగా పేర్కొంది. నెట్ అడ్వాన్సుల్లో రెండు, డిపాజిట్లల్లో 4.3 శాతం పురోభివృద్ధిని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో దేశవ్యాప్తంగా కొత్తగా 22 శాఖా కార్యాలయాలను ప్రారంభించామని, దీని ద్వారా 1,065 మంది ఉపాధిని కల్పించినట్టయిందని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ కొత్త శాఖా కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది.