భారత్‌కు రష్యా చమురు డిస్కౌంట్ ఆఫర్, సామాన్యుడికి ఊరట: అమెరికా అసహనం
ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధ సమయంలో క్రూడ్ ధరలు ఓ సమయంలో 130 డాలర్లు కూడా క్రాస్ చేశాయి. అయితే ప్రస్తుతం 100 డాలర్ల దిగువకు వచ్చాయి. అయినప్పటికీ నాలుగు నెలల క్రితంతో పోలిస్తే 30 డాలర్ల వరకు పెరిగింది. చమురు ధరలు భారీగా పెరగడంతో భారత్ దిగుమతుల భారం పెరుగుతోంది. దీనికి తోడు డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ క్షీణించడం కూడా ప్రభావం చూపుతోంది. ధరలు భారీగా పెరగడంతో భారత్ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. వెనిజులా, ఇరాన్ నుండి తక్కువ ధరకు దిగుమతి చేసుకోవడం, రష్యా నుండి డిస్కౌంట్‌కు తీసుకోవడంపై దృష్టి సారించింది.

రష్యా నుండి డిస్కౌంట్‌కు కొనుగోలు
రష్యా నుండి భారత్ తక్కువ ధరకు ముడి చమురును కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు ఇరుదేశాలు 3 బిలియన్ డాలర్ల క్రూడాయిల్ కొనుగోలుకు సంతకాలు చేసినట్లుగా చెబుతున్నారు.
కాంట్రాక్ట్-ఫ్రీ-ఆన్-బోర్డ్ ఆధారంగా కాకుండా డెలివరీ చేయబడిన ధరపై ఉంటుందని చెబుతున్నారు. రష్యాతో ట్రేడ్ డీల్‌కు భారత్ డోర్స్ తెరిచినట్లుగా చెబుతున్నారు. రష్యా నుండి వచ్చే క్రూడ్ డిస్కౌంట్ పైన రావడం భారత వినియోగదారులకు కూడా భారం లేకుండా ఉంటుంది.

దిగుమతులే ఎక్కువ
భారత్ చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది. దేశంలో వినియోగించే చమురులో 85 శాతం దిగుమతులు. ఏప్రిల్ 2021 నుండి జనవరి 2022 మధ్య రష్యా నుండి రెండు శాతం క్రూడ్ దిగుమతి అయింది. 176 మిలియన్ టన్నుల్లో రష్యా వాటా 3.6 మిలియన్ టన్నులు. అయితే భారత్-రష్యా డీల్ పైన అమెరికా అసంతృప్తితో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పటికీ మన వద్ద నాలుగు నెలలుగా పెరగలేదు. పైగా ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పెరగకపోవడం గమనార్హం. ఇప్పుడు రష్యా నుండి డిస్కౌంట్‌కు చమురు వస్తే పెట్రో భారం సామాన్యుడిపై తగ్గుతుంది.

సమర్థిస్తున్నారా?
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం నేపథ్యంలో మాస్కో పైన అమెరికా, యూరోపియన్ దేశాలు కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో రష్యా నుండి భారత్ చమురు కొనుగోలుకు సిద్ధపడింది. దీనిపై అమెరికా స్పందిస్తూ.. భారత్ ఆంక్షలు ఉల్లంఘిస్తున్నట్లు కాదని, అయితే ఈ నిర్ణయంతో భారత చరిత్రలో తప్పుడు వైపు ఉండవద్దని హెచ్చరించింది. 'రష్యా నుండి డిస్కౌంట్‌లో చమురు కొనుగోలు చేయడంలో ఆంక్షలను ఉల్లంఘించినట్లుగా కాదు.
కానీ ఇలాంటి చర్యలు చేపడితే చరిత్రలో భారత్ ఏ వైపున ఉంటారనేది ఒక్కసారి ఆలోచించాలి. చమురు దిగుమతులపై భారత్ ముందుకు వెళ్తే తప్పుగా వెళ్లినట్లే. రష్యాకు మద్దతు ఇస్తున్నట్లుగా భావించవలసి ఉంటుందని, అప్పుడు ఉక్రెయిన్ పైన దండయాత్రను సమర్థిస్తున్నట్లు' అని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి జెన్‌సాకిని అన్నారు.