ఆలస్యం నాకు నచ్చదు: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ప్రోగ్రాంలో జెఫ్ బెజోస్
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి బుధవారం అమెజాన్ నిర్వహించిన కార్యక్రమంలో అసంతృప్తికి లోనయ్యారు. అమెజాన్ సంభవ్ పేరుతో ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో నారాయణమూర్తి అసంతృప్తికి గురయ్యారు.

నాకు ఆలస్యం చేయడం అలవాటు లేదు
కార్యక్రమం దాదాపు గంటన్నర ఆలస్యం కావడంపై తన ప్రసంగం సమయంలో నారాయణమూర్తి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సమావేశం దాదాపు గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైందని, నిజానికి నేను ఇక్కడ ఇరవై నిమిషాలు ప్రసంగించాలని, కానీ ఇప్పుడు ఐదు నిమిషాల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఎందుకంటే తనకు ఆలస్యం చేయడం అలవాటు లేదన్నారు.

నారాయణమూర్తి ఏమన్నారంటే
'గంటన్నర ఆలస్యం చేశాం. నేను నా ప్రసంగాన్ని 11.45 నిమిషాలకు పూర్తి చేయాలి. కానీ నా ప్రసంగం ప్రారంభమే 11.53 నిమిషాలకు అవుతోంది. కాబట్టి నా ప్రసంగాన్ని సాధ్యమైనంత కుదించుకుంటాను' అని చెప్పారు. 'నేను 20 నిమిషాలు మాట్లాడవలసి ఉంది. కానీ ఐదు నిమిషాల్లో పూర్తి చేస్తాను. ఎందుకంటే నాకు ఆలస్యం నచ్చదు' అన్నారు.

అమెజాన్‌లో వాటా
అమెజాన్‌లో అతిపెద్ద విక్రయ సంస్థ క్లౌడ్‌టెయిల్ ఇండియాలో నారాయణమూర్తికి చెందిన కాటమరాన్ వెంఛర్స్ ప్రధాన భాగస్వామిగా ఉంది. కాటమరాన్ నిర్వహిస్తున్న ప్రియోన్ బిజినెస్ సర్వీసెస్ ప్రయివెట్ లిమిటెడ్‌కు అమెజాన్ 25 శాతం విక్రయించింది. కాటమరాన్‌కు ప్రస్తుతం రంగనాథ్ మావనినకెరె హెడ్‌గా ఉన్నారు. ఈయన ఇదివరకు ఇన్ఫోసిస్ సీఎఫ్ఓగా పని చేశారు. కాగా, ఈ కార్యక్రమంలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఉన్నారు. మూర్తి తన ప్రసంగాన్ని పూర్తి చేసి, స్టేజ్ దిగి వచ్చారు. మూర్తిపై బెజోస్ ప్రశంసలు కురిపించారు.


Click it and Unblock the Notifications