Union Budget 2022: మూలధన వ్యయం పెంచడంతో లబ్ధి పొందిన ఇన్‌ఫ్రా కంపెనీలు ఇవే..!!
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రబడ్జెట్ 2022-23ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23)కు గాను మౌలికసదుపాయాల రంగంకు మూలధన వ్యయం కేటాయింపులు 35శాతంకు పెంచడంతో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగానికి చెందిన కంపెనీల షేర్లు అమాంతంగా పెరిగాయి.దీనిపై మార్కెట్ నిపుణులు కూడా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు.
మూలధన వ్యయం పెంచడం వల్ల వస్తు రంగం, నిర్మాణం, వాణిజ్య వాహనాల రంగాలకు మేలు చేకూరుస్తుందని చెబుతున్నారు. పాతాళంలో ఉన్న ఈ కంపెనీలకు మూలధన వ్యయం పెంచడంతో ఇవి తిరిగి పుంజుకుంటాయని చెప్పారు. ఇక మూలధన వ్యయం పెంచడంతో ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సీమెన్స్ మరియు పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్ లాంటి కంపెనీల షేర్లు లాభపడ్డాయి.

నిపుణులు ఏం చెబుతున్నారు..?
ఇక మొత్తంగా 15శాతం నుంచి 20శాతం మేరా మూలధన వ్యయం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెడితే సప్లయ్‌కు ప్రాధాన్యత ఇస్తూనే క్రమంగా మూలధన వ్యయంను కూడా పెంచారు. ఇలా చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడుల క్రమాన్ని స్థిరంగా ఉండేలా చూసుకున్నారని నిపుణులు పేర్కొన్నారు. నిర్మలమ్మ తీసుకున్న ఈ చొరవతో ఇంజినీరింగ్ మరియు నిర్మాణం సంస్థలు, భవనాలకు కావాల్సిన ముడిసరుకుల తయారీ సంస్థలు లబ్ధి పొందుతాయని చెబుతున్నారు.

జాతీయ రహదారుల విస్తరణ
ఎల్ అండ్ టీ, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సీమెన్స్, హెచ్‌సీసీ, అల్ట్రాటెక్, శ్రీసిమెంట్, అంబుజా సిమెంట్స్, దాల్మియా భారత్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సెయిల్, మరియు జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీలకు చెందిన స్టాక్స్ మంగళవారం 4 శాతం నుంచి 7శాతం వరకు దూసుకెళ్లాయి. ఇక ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో భాగంగా ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 25వేల కిలోమీటర్లు మేరా జాతీయ రహదారులను విస్తరిస్తున్నట్లు ప్రకటించారు.
మల్టీ మోడల్ పార్కుల్లో కొత్త ప్రాజెక్టులు, 100 కార్గో టర్మినల్స్‌ను మూడేళ్లలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదే సమయంలో కొత్త రైళ్లు, రోప్‌వేలు కూడా తీసుకొస్తామని ప్రకటించారు. ఇక 50శాతం మేరా కేటాయింపులు రహదారులకు ఇచ్చారు. ఇక ఈ సారి బడ్జెట్ ప్రాథమికంగా మౌలిక సదుపాయలపైనే ఫోకస్ చేసినట్లు కనిపించింది. ఇక గతి శక్తి స్కీమ్ ద్వారా కొత్త ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై ఫోకస్ చేశారని నిపుణులు అభిప్రాయపడ్డారు.

గృహ నిర్మాణ ప్రాజెక్టు కోసం...
గృహనిర్మాణ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.48వేల కోట్లు కేటాయించింది. అంటే ఈ ప్రకటన సిమెంట్ కంపెనీలకు ఊతం ఇచ్చేదిగా ఉందని చెబుతున్నారు నిపుణులు. ఇక ప్రతి ఇంటికి తాగు నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ ప్రాజెక్టుకు రూ.60వేల కోట్లు కేటాయించింది. దీంతో పైపు తయారీ రంగం పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక మూలధన వ్యయం పై దృష్టి సారించడమంటే ఇది వాణిజ్య వాహన తయారీ సంస్థలకు మంచి వార్తే అవుతుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.