Union Budget 2021: ఈ సారి బడ్జెట్ ఎలా ఉండాలి.. ఎలాంటి సవాళ్లున్నాయి..?
మరి కొద్ది రోజుల్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతోందని చెప్పగానే ముందుగా సామాన్యుడి బడ్జెట్‌గా ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే ఈ సారి బడ్జెట్ మాత్రం సవాళ్లతో కూడుకున్నదే అవుతుంది. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ ఒకానొక సమయంలో గాడి తప్పింది. దీంతో 2021 బడ్జెట్ ఎలా ఉండబోతోందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

మధ్య తరగతి వారు భారం తీసుకోవాలి
గతేడాది కరోనా కారణంగా మార్కెట్లు కుదేలయ్యాయి. కొన్ని వారాల సమయంలోనే 40శాతంకు పైగా మార్కెట్లు పడిపోయి దేశ ఆర్థిక పరిస్థితిని ప్రశ్నార్థకంగా మార్చాయి. అనంతరం తిరిగి 87శాతంతో అనూహ్య రీతిలో కోలుకున్నాయి. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలే అని విశ్లేషకులు చెబుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహం కొనసాగేలా కేంద్రం కొన్ని ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించింది.పడిపోతున్న ఆర్థిక వ్యవస్థను ఆదుకుంది. ఈ క్రమంలోనే ఈ సారి బడ్జెట్‌లో సింహ భాగం దేశ ఆర్థిక వ్యవస్థపైనే ఫోకస్ చేసి ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.ఇక కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన కారణంగా తిరిగి గాడిలో పడాలంటే మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు కాస్త సహకరించాల్సిన పరిస్థితి ఉంది. ఈక్రమంలోనే ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు సంపాదిస్తూ 60 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారి ఆదాయపు పన్ను రేటును 20శాతం నుంచి 10శాతంకు తగ్గిస్తే ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సెక్షన్ 80 (సీ)కి మెరుగులు
టాక్స్ సేవింగ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కీలకంగా మారే సెక్షన్ 80సీని మెరుగుపరిస్తే లాభం ఉంటుంది. చివరిసారిగా సెక్షన్ 80సీని 2014లో సవరించారు.ప్రస్తుతం పీపీఎఫ్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్, బీమా ప్రీమియం, హోంలోన్, పిల్లల టూష్యన్ ఫీజు పేర్లతో రూ.1.50 లక్షలను పొదుపు చేస్తున్నారు పన్ను చెల్లింపుదారులు. అయితే గృహ రుణాలు, పిల్లల ట్యూషన్ ఫీజులను ఇందులోనుంచి తొలగించడమో లేదా ఒక సీలింగ్ విధించడమో చేస్తే బాగుంటుందనే అభిప్రాయం నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

సెక్షన్ 80(డీ)పై మినహాయింపులు
2018 బడ్జెట్‌లో మెడికల్ బిల్స్ రీఇంబర్స్‌మెంట్ విత్‌డ్రాల్‌పై పరిమితి విధించింది కేంద్రం. ప్రస్తుతం వైద్యం చాలా ఖరీదైపోయింది. అయితే మెడికల్ రీఇంబర్స్‌మెంట్ విత్‌డ్రాల్ తిరిగి పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా కారణంగా ఖర్చులు భరించలేని వారికి ఒకసారి మినహాయింపును ఇవ్వడంపై ఆలోచన చేస్తే బాగుంటుంది. ఇక కరోనా కారణంగా ఆరోగ్య బీమాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో అధిక ప్రీమియంకు కొంత వరకు మినహాయింపు ఇస్తే బాగుంటుంది. దీనివల్ల ఎక్కువమంది బీమా తీసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం 60ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు సెక్షన్ 80 డీ కింద తమ భాగస్వామికి, పిల్లలకోసం చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.25వేల వరకు తగ్గింపు పొందుతున్నారు.