స్టార్టప్ కంపెనీలు అంటేనే భారీ నష్టాలకు కేంద్రమని మరోసారి రుజువైంది. ఇటీవలి కాలంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఇండియన్ స్టార్టప్ కంపెనీల్లో ఒకటైన ఉడాన్ ... కూడా ఇందుకు మినహాయింపు కాదని నిరూపితమైంది. రిటైల్ షాపులకు హోల్సేల్ వర్తకులకు మధ్య వారధిలా ఉండి.. వారికి లాజిస్టిక్స్, క్రెడిట్ ఫెసిలిటీస్ అందించటంతో పాటు మార్కెట్ ప్లేస్ లా వ్యవహరిస్తున్న ఉడాన్ ను బిజినెస్ 2 బిజినెస్ (బీ2బీ) కంపెనీగా వ్యవహరిస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ మాతృ సంస్థ మాత్రం సింగపూర్ లో ఉంటుంది. ఫ్లిప్కార్ట్ మాజీ ఉద్యోగులు ఐన సుజీత్ కుమార్, అమోద్ మాల్వియా, వైభవ్ గుప్త సంయుక్తంగా 2016 లో ఉడాన్ ను స్థాపించారు. గత మూడేళ్ళలో కంపెనీ అప్రతిహంగా వృద్ధి చెందింది. యునికార్న్ కంపెనీల జాబితాలో చేరిపోయింది. కానీ అదే స్థాయిలో నష్టాలను కూడా మూటగట్టుకొంది. 2019 ఆర్థిక సంవత్సరంలో ఉడాన్ రూ 46 కోట్ల ఆదాయం ఆర్జించి, రూ 779 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ఎంట్రాకర్ తన పరిశోధనాత్మక కథనంలో వెల్లడించింది. ఈ పరిశోధనలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. మీ కోసం కొన్ని వివరాలు.

ఆదాయంలో భారీ వృద్ధి...
అంతక్రితం ఏడాదితో పోల్చితే 2019 ఆర్థిక సంవత్సరంలో ఉడాన్ తన ఆదాయాన్ని భారీగా పెంచుకోగలిగింది. ఇది రూ 3 కోట్ల నుంచి రూ 46 కోట్లకు పెరిగింది. అంటే 1430 శాతం వృద్ధి నమోదయింది. లాజిస్టిక్స్ సేవల ద్వారా అత్యధికంగా రూ 28 కోట్ల ఆదాయం సమకూరింది. క్యాష్ కలెక్షన్ సేవల ద్వారా రూ 7 కోట్లు, అడ్వేర్టిజెమెంట్స్ ద్వారా రూ 78 లక్షలు, వడ్డీల ద్వారా రూ 16 లక్షల ఆదాయాన్ని నమోదు చేసింది. విచిత్రంగా స్క్రాప్ లాగా తిరిగివచ్చిన సేల్ ఆఫ్ గూడ్స్ ద్వారా రూ 10 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు కంపెనీ పేర్కొంది. ఇదే ఉడాన్ ఆదాయంలో రెండో స్థానాన్ని ఆక్రమించటం గమనార్హం. మర్చంట్లకు రుణాలు కూడా అందజేసే ఈ కంపెనీ... రూ 5 కోట్ల వడ్డీ ఆదాయం, బ్యాంకు డిపాజిట్ల పై రూ 11 కోట్ల ఆదాయం, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల ద్వారా రూ 7 కోట్లకు పైగా ఆదాయం గడించింది.

1300 శాతం పెరిగిన ఖర్చు...
సాధారణంగా ఆదాయం పెరిగితే... ఖర్చులు తగ్గి, నష్టాలు కూడా తగ్గుముఖం పట్టాలి. ఇది సహజ వ్యాపార సూత్రం. కానీ ఉడాన్ విషయంలో ఖర్చులు ఏకంగా 1300 శాతం పెరిగి రూ 849 కోట్లకు చేరుకున్నాయి. అంతక్రితం ఏడాదిలో వ్యయాలు కేవలం రూ 66 కోట్లు మాత్రమే కావటం గమనార్హం. లాజిస్టిక్స్ సేవల అందింపులో భాగంగా రూ 53 కోట్లు ఇన్వెంటరీ పై నష్టపోయింది. రిటైలర్లకు రిఫండ్ల రూపంలో రూ 48 కోట్లు కోల్పోయింది. కార్యాలయ అద్దెలకు రూ 45 కోట్లు, లీగల్ ఖర్చుల కోసం రూ 26 కోట్లు, మానవ వనరుల అవుట్ సోర్సింగ్ కోసం రూ 121 కోట్లు ఖర్చు చేసింది. కంపెనీ ఉద్యోగుల వేతనాలకు రూ 56 కోట్లు మాత్రమే వెచ్చించిన ఉడాన్ ... రూ 106 కోట్ల మేరకు వారికి వాటాల రూపంలో అందించటం విశేషం. వెరసి కంపెనీ మొత్తంగా రూ 779 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది.

రూ 1,000 కోట్ల నగదు నిల్వలు..
2019 లో 586 మిలియన్ డాలర్ల ఫండింగ్ సాధించిన ఉడాన్ ... ప్రస్తుతం సుమారు రూ 20,000 కోట్ల వాల్యుయేషన్ కలిగి ఉంది. అలాగే కంపెనీ వద్ద పెద్ద మొత్తంలో నగదు నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ వద్ద రూ 1,018 కోట్ల విలువైన నగదు, స్వల్ప కాలిక బ్యాంకు డిపాసిట్లు ఉన్నాయి. 2019 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ రూ 949 కోట్ల మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు పెట్టింది. రూ 32 కోట్ల విలువైన ప్లాంట్ అండ్ ప్రాపర్టీ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు 800 మిలియన్ డాలర్ల (సుమారు రూ 5,600 కోట్ల ) పెట్టుబడులు సాధించిన ఉడాన్ ... నష్టాలు పెరుగుతున్నా లెక్కచేయకుండా ముందుకే వెళుతోంది. దేశవ్యాప్త సేవల కోసం సప్లై చైన్ ను మెరుగు పరుచుకొంటోంది. గత అనుభవం దృష్ట్యా ... ఈ ఏడాదిలోనూ వృద్ధి సాధించేందుకు ఎంత నష్టాలనైనా భరించేలా కనిపిస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications