5జీ కోసం ఎంపిక చేసిన పైలెట్ ప్రాజెక్టులివే..
న్యూఢిల్లీ: దేశంలో 5జీ నెట్‌వర్క్ పనులు తుదిదశకు చేరుకున్నట్టే. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా- 5జీని అమలు చేయడానికి పైలెట్ ప్రాజెక్టులను ఎంపిక చేసింది. దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, భోపాల్, బెంగళూరు మెట్రో, గుజరాత్‌లోని ప్రఖ్యాత కాండ్లా దీన్ దయాళ్ పోర్ట్‌లను పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దేశంలో అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్ కంపెనీగా గుర్తింపు పొందిన రిలయన్స్ జియో.. 5జీ సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రావడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఏకంగా వెయ్యి నగరాలను ఈ నెట్‌వర్క్ పరిధిలోకి తీసుకుని రానుంది. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నట్లు ప్రకటించింది. 5జీ సెగ్మెంట్‌పై తన పట్టును మరింత పెంచుకుంటోంది. ఫైబర్ కెపాసిటీని పెంచుకుంది. వెయ్యి నగరాల్లో 5జీకి సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ విమానాశ్రయం, భోపాల్, బెంగళూరు మెట్రో, కాండ్లా పోర్ట్‌లను పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయడానికి ట్రాయ్ అంగీకరించింది.

తొలి దశలో 5జీ నెట్‌వర్క్‌లో విస్తరింపజేయడానికి ప్రత్యేకంగా డెడికేటెడ్ సొల్యూషన్ టీమ్స్‌ను ఏర్పాటు చేశామని స్పష్టం చేసినట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ కిరణ్ థామస్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 1000 నగరాల్లో 5జీ నెట్‌వర్క్ కవరేజ్ పూర్తయిందని, ట్రయల్స్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఇందులో హెల్త్‌కేర్, ఇండస్ట్రీయల్ ఆటొమేషన్‌ను వినియోగిస్తున్నామని కిరణ్ థామస్ చెప్పారు.
నెట్‌వర్క్ ప్లానింగ్‌లో 3డీ మ్యాప్స్, రే ట్రేసింగ్ టెక్నాలజీ వంటి అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని వివరించారు. అనుమతులు రాగానే.. దీన్ని ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకున్నామని స్పష్టం చేశారు. రోల్ అవుట్ కోసం సంసిద్ధంగా ఉన్నామనీ పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 5జీ స్పెక్ట్రమ్‌ను కేంద్ర ప్రభుత్వం వేలం వేసే అవకాశాలు ఉన్నాయి.