For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెల్కోలకు షాక్.. ‘ఏజీఆర్‌’ బకాయిలపై ఇక గడువు లేదన్న‘డాట్’!

|

దేశంలో టెలికాం కంపెనీలకు గట్టి షాక్ తగిలింది. అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ(ఏజీఆర్) బకాయిల చెల్లింపు విషయంలో సుప్రీం కోర్టులో ఊరట లభించకపోగా, కోర్టు ధిక్కరణ ఎదుర్కోవలసి వస్తుందంటూ ధర్మాసనం హెచ్చరించడంతో టెల్కోలు అయోమయంలో పడ్డాయి.

మరోవైపు.. గతంలో ఇచ్చిన గడువులోగా బకాయిలు చెల్లించని టెలికాం కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ సుప్రీం ధర్మాసనం ప్రశ్నించడంతో.. ఇక ఈ విషయంలో ఎలాంటి గడువూ ఇవ్వలేమని, తక్షణమే రూ.లక్ష కోట్ల బకాయిలు చెల్లించాలంటూ కంపెనీలకు 'డాట్' హుకుం జారీ చేసింది.

పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్లు...

పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్లు...

దేశంలో టెలికాం నెట్‌వర్క్ ప్రొవైడర్ల పరిస్థితి పెనం మీదనుంచి పొయ్యిలో పడిన చందంగా మారింది. పోటీ వాతావరణం నేపథ్యంలో ‘టారిఫ్ వార్'కు తెరతీసి.. ఆపైన కోలుకోలేని స్థాయిలో నష్టాలు మూటగట్టుకున్న టెల్కోలకు అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ(ఏజీఆర్) బకాయిల చెల్లింపు పెద్ద గుదిబడండగా మారిన సంగతి తెలిసిందే. ఈ బకాయిలు చెల్లించాల్సిందిగా గతంలోనే కేంద్ర ప్రభుత్వం టెల్కోలకు కొంత గడువు ఇచ్చినప్పటికీ అవి చెల్లించలేదు. తాము ఏజీఆర్ బకాయిలు చెల్లించే పరిస్థితిలో లేమని, మరింత గడువు కావాలని ఒకపక్క కోరుతూ.. మరోపక్క దీనిపై అవి న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నాయి.

‘సుప్రీం' ఆగ్రహం.. ‘డాట్' హుకుం..

‘సుప్రీం' ఆగ్రహం.. ‘డాట్' హుకుం..

తాజాగా ఈ విషయమై సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఇటు టెలికాం కంపెనీలు(టెల్కోలు)పై, అటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం(డాట్)పై మండిపడ్డారు. టెల్కోలు ఈ ఏడాది జనవరి 23 నాటికి రూ.లక్ష కోట్లకుపైగా ఏజీఆర్‌‌ బకాయిలు చెల్లించాలంటూ తాము ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయలేదంటూ కోర్టు ‘డాట్' అధికారులను మందలించారు. బకాయిలు చెల్లించని టెల్కోలపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ వారిని నిలదీశారు.

‘‘ఇది కోర్టు ధిక్కరణే.. ఊచలు లెక్కబెట్టిస్తాం..''

‘‘ఇది కోర్టు ధిక్కరణే.. ఊచలు లెక్కబెట్టిస్తాం..''

ఈ కేసులో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం అధికారుల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘మేం ఇచ్చిన తీర్పును డాట్ పాటించలేదు. బకాయిలు చెల్లించని కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అసలు దీనికి అర్థంపర్థం కూడా లేదు. అధికారులు తమ పరిమితుల గురించి తెలుసుకోవాలి. ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంది. దీనిపై కోర్టు తగిన చర్యలు ఎందుకు తీసుకోరాదో డెస్క్ ఆఫీసర్ స్వయంగా కోర్టుకు వచ్చి చెప్పాలి. డాట్ ఆర్డర్‌ను డెస్క్ ఆఫీసర్ తక్షణమే వెనక్కి తీసుకోకుంటే జైలు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుంది..'' అని న్యాయమూర్తులు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను మార్చి 17వ తేదీకి వాయిదా వేశారు. అంతేకాదు, ఆ రోజున టెలికాం కంపెనీల టాప్ అఫీషియల్స్, డాట్ ఎండీ కూడా హాజరుకావాలని ఆదేశించారు.

‘ఏజీఆర్‌'పై 14 ఏళ్లుగా న్యాయపోరాటం...

‘ఏజీఆర్‌'పై 14 ఏళ్లుగా న్యాయపోరాటం...

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం నిబంధనల ప్రకారం.. ప్రతి టెలికాం కంపెనీ తన లైసెన్సు ఫీజులో 8 శాతం మొత్తాన్ని అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ(ఏజీఆర్) కింద చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ ఏజీఆర్‌‌ లెక్కింపు విధానానికి సంబంధించి దేశంలోని టెలికాం కంపెనీలు, డాట్‌‌ మధ్య దాదాపు 14 ఏళ్లపాటు న్యాయపోరాటం జరిగింది. డివిడెండ్‌‌, కిరాయి, వడ్డీలు కూడా ఏజీఆర్‌‌లో భాగమే అంటూ డాట్‌‌ చేస్తున్న వాదనను టెలికాం కంపెనీలు అంగీకరించడం లేదు. ఏజీఆర్‌‌ బకాయిల్లో వీటిని కూడా చేర్చాలని డాట్‌‌ కోరడంతో వివాదం కోర్టు వరకు వెళ్లింది. ఈ కేసులో చివరికి నాన్ టెలికాం రెవెన్యూలు కూడా వారి వ్యాపారాల్లో భాగమేనంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో టెలికాం కంపెనీలు షాక్ తగిలింది.

తీర్పు ప్రకారం ఎవరెవరు, ఎంతెంత కట్టాలంటే...

తీర్పు ప్రకారం ఎవరెవరు, ఎంతెంత కట్టాలంటే...

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం... వొడాఫోన్‌‌ ఐడియా రూ.50 వేల కోట్లు, ఎయిర్‌‌టెల్‌‌ రూ.35,586 కోట్లు, టాటా టెలీసర్వీసెస్‌‌ రూ.14 వేల కోట్లు ఏజీఆర్‌‌గా చెల్లించాలి. రిలయన్స్ జియో ఇది వరకే ఏజీఆర్ బకాయిలుగా రూ.60 కోట్లు డాట్‌కు చెల్లించింది. జియో 2016 నుంచే తన టెలికాం కార్యకలాపాలు మొదలుపెట్టినందున దాని బకాయిలు పెద్దగా లేవు. ఇక భారతీ ఎయిర్‌‌టెల్‌‌ ఏజీఆర్ చెల్లింపుల కోసం ఇప్పటికే నిధులు సేకరించింది. వొడాఫోన్‌ ఐడియా‌ మాత్రం ఈ బకాయిల చెల్లింపు తన వల్ల కాదంటూ చేతులెత్తేసింది. ఏజీఆర్‌‌ విషయంలో ఊరట దొరక్కపోతే, వ్యాపారం మూసివేస్తామని ఇది గతంలోనే ప్రకటించింది. ఏజీఆర్ బకాయిల చెల్లింపు గడువును పెంచాలంటూ అన్ని టెలికాం కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడమేకాక, దీనిపై సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాయి. గత పధ్నాలుగేళ్లుగా సాగిన ఈ న్యాయపోరాటంలో చివరికి టెల్కోలే చతికిలపడ్డాయి.

సేవలు అందించకపోయినా చెల్లించాల్సిందే...

సేవలు అందించకపోయినా చెల్లించాల్సిందే...

మరో విషయం ఏమిటంటే.. ఇంటర్నల్‌‌ కమ్యూనికేషన్‌‌, సిగ్నలింగ్‌‌ కోసం లైసెన్సులు పొందిన టెలికామేతర కంపెనీలు కూడా ఏజీఆర్‌‌ బకాయిలు చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కంపెనీలు టెలికం సేవలు అందించకపోయినా బకాయిలు కట్టకతప్పదని తెలిపింది. దీంతో రూ.1.72 లక్షల కోట్లు కట్టాలని గెయిల్‌‌కు, రూ.48 వేల కోట్లు కట్టాలని ఆయిల్‌‌ ఇండియాకు, రూ.22,168 కోట్లు చెల్లించాలని కోరుతూ పవర్‌‌గ్రిడ్‌‌కు, రూ.15,019 కోట్లు కట్టాలంటూ గుజరాత్‌‌ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్‌‌కు, రూ.5,841 కోట్లు కట్టాలంటూ ఢిల్లీ మెట్రో రైల్‌‌ కార్పొరేషన్ లిమిటెడ్‌‌కు ‘డాట్‌‌' నోటీసులు పంపింది. అయితే ఇది చాలా పెద్ద మొత్తమంటూ ఈ కంపెనీలు కూడా బకాయిులు చెల్లించేందుకు అభ్యంతరం తెలిపాయి.

సుప్రీం తీర్పుతో టెల్కోలకు ‘డాట్' హుకుం...

సుప్రీం తీర్పుతో టెల్కోలకు ‘డాట్' హుకుం...

కోర్టు తీర్పుపై స్పందించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాం.. ఏజీఆర్‌‌, స్పెక్ట్రమ్‌‌ యూసేజ్‌‌ బకాయిలన్నింటినీ శుక్రవారం అర్థరాత్రిలోగా చెల్లించాలంటూ వొడాఫోన్‌‌ ఐడియా, ఎయిర్‌‌టెల్‌‌లను ఆదేశించింది. బకాయిలు చెల్లించని టెల్కోలపై కఠిన చర్యలు తీసుకోరాదంటూ గత నెల 23న జారీ చేసిన తన ఉత్తర్వును కూడా వెనక్కి తీసుకుంది. సుప్రీం తీర్పుపై ఎయిర్‌‌టెల్‌‌ స్పందిస్తూ కోర్టు తీర్పుపై తమకు గౌరవం ఉందని, 22 సర్కిళ్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని లెక్కించడానికి సమయం పడుతుందని, కాబట్టి ఈ నెల 20లోపు రూ.10 వేల కోట్లు జమ చేస్తామని, మిగతా మొత్తాన్ని మార్చి 17లోపు కట్టేస్తామని తెలిపింది. ఇప్పటికే వేల కోట్ల రూపాయల అప్పులతో సతమతమవుతున్న టెల్కోలకు సుప్రీంకోర్టు తాజా తీర్పు ఆశనిపాతమే!

English summary

టెల్కోలకు షాక్.. ‘ఏజీఆర్‌’ బకాయిలపై ఇక గడువు లేదన్న‘డాట్’! | supreme court given shock to telecom companies

The Supreme Court on Friday came down heavily on both telecom companies and the telecom department (DoT) over non-payment of adjusted gross revenue (AGR) dues of Rs 1.47 lakh crore. SC says telcos must pay AGR dues, issues contempt notice to DOT officer who restrained recovery.
Story first published: Sunday, February 16, 2020, 17:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X