RTGS Fund Transfer: ఇక 24/7..ఇదీ టైమ్: అమలుపై ఆర్బీఐ గవర్నర్ కీలక ప్రకటన
ముంబై: బ్యాంకు ఖాతాదారులకు భారతీయ రిజర్వు బ్యాంకు మరింత విస్తృతమైన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫండ్ ట్రాన్స్‌ఫర్‌లో కీలకంగా మారిన రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్టీజీఎస్) సేవలను ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకుని వచ్చే విషయాన్ని వెల్లడించింది. ఆదివారం అర్ధరాత్రి దాటి వెంటనే.. అంటే 12:30 గంటల నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఈ మేరకు రిజర్వుబ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆర్టీజీఎస్ సేవలు ఇప్పటిదాకా పరిమితంగా ఉంటూ వచ్చాయి. నెఫ్ట్ తరహాలో 24 గంటల పాటు అందుబాటులో ఉండేవి కావు. ఇందులో మార్పులను చేసింది రిజర్వుబ్యాంకు. ఆర్టీజీఎస్ ద్వారా నిధుల బదలాయింపును 24 గంటల పాటు అందుబాటులోకి తీసుకొచ్చేలా సవరణలకు పూనుకుంది. ఈ అర్ధరాత్రి నుంచి ఈ వ్యవస్థ రౌండ్ ద క్లాక్ తరహాలు అమల్లోకి తీసుకుని వస్తున్నట్లు ప్రకటించింది. రెండు లక్షల రూపాయల వరకు ఆర్టీజీఎస్ కింద ట్రాన్స్‌ఫర్ చేసే అవకాశం ఉంది.

ఆర్టీజీఎస్ వ్యవస్థను వారంలో అన్ని రోజులూ, 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని రిజర్వుబ్యాంకు ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. ఈ వ్యవస్థ కింద నిధుల బదలాయింపును ఎల్లవేళలా అందుబాటులోకి తీసుకుని వచ్చిన దేశాల జాబితాలో చేరింది భారత్. 2004 మార్చి 26వ తేదీన ఆర్టీజీఎస్‌ను రిజర్వు బ్యాంకు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తొలుత నలుగు బ్యాంకులకు మాత్రమే ఈ వ్యవస్థ అందుబాటులో ఉండేది.
క్రమంగా దీని సేవలను విస్తరించింది. ప్రస్తుతం రోజూ 6.35 లక్షల రూపాయల మేర ఆర్థిక లావాదేవీలు ఆర్టీజీఎస్ ద్వారా నమోదవుతున్నాయి. 237 ప్రభుత్వరంగ, ప్రభుత్వేతర బ్యాంకులు ఈ సేవలను తమ ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. సగటున 4.17 లక్షల కోట్ల రూపాయల మేర నిధుల బదలాయింపు నమోదైంది. ఈ ఏడాది నవంబర్ వరకు సగటున 57.96 లక్షల మేర ఆర్టీజీఎస్ టికెట్లు రెయిజ్ అయ్యాయి. ఆర్టీజీఎస్ వ్యవస్థకు ఐఎస్ఓ 20022 సర్టిఫికేషన్ లభించింది.