ఆగస్ట్ నాటికి ఆర్బీఐ రెపో రేటు 75 bps పెంచే అవకాశం
కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడం, దేశంలో ఆర్థిక రికవరీ సాధారణస్థితికి రావడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ద్రవ్యోల్భణాన్ని అదుపు చేయడానికి వచ్చే నెల ద్రవ్య పరపతి సమీక్ష సందర్భంగా మరోసారి వడ్డీ రేటు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ద్రవ్యోల్భణ పెరుగుదల ఒత్తిడితో ఆగస్ట్ నాటికి ఆర్బీఐ రెపో రేటును 75 బేసిస్ పాయింట్ల వరకు పెంచవచ్చునని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగినట్లు ఎస్బీఐ ఆర్థికవేత్తల నివేదిక తెలిపింది. గత కొద్దినెలల్లో భారీగా పెరిగిన ద్రవ్యోల్బణంలో 59 శాతానికి యుద్ధ పరిణామాలే కారణమని ఈ నివేదిక తెలిపింది. ఏప్రిల్ నెలలో రిటైల్ ధరల ద్రవ్యోల్బణం ఏకంగా 7.8 శాతానికి పెరిగింది. దీంతో ఆర్బీఐ కీలక రెపోరేటును ఆగస్ట్ నాటికి మరో 0.75 శాతం పెంచి కరోనా పూర్వస్థాయి 5.15 శాతానికి చేర్చవచ్చునని ఎస్బీఐ ఆర్థికవేత్తల అంచనా.

జూన్ పరపతి సమీక్ష సమావేశం, ఆ తర్వాత ఆగస్ట్ పరపతి సమీక్ష సమావేశాల్లో ఆర్బీఐ రెపో రేటు పెంచవచ్చునని అంటున్నారు. పెరుగుతున్న ధరలకు కళ్ళెం వేయడానికి ఈ నెల 4న ఆర్బీఐ రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు చారిత్రక కనిష్ఠస్థాయి 4 శాతం నుండి 4.40 శాతానికి పెరిగింది. ఆర్బీఐ రెపో రేటును పెంచడం 2018 ఆగస్ట్ 1వ తర్వాత మళ్లీ ఇదే.