HDFC, ICICI తర్వాత బజాజ్ ఫైనాన్స్‌లో చైనా బ్యాంకు పెట్టుబడులు
ప్రయివేటురంగ మోర్టగేజ్ దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల్లో చైనాకు చెందిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా పెట్టుబడులు పెట్టింది. తాజాగా భారత్‌లోని అతిపెద్ద ఎన్బీఎఫ్‌సీలలో ఒకటైన బజాజ్ ఫైనాన్స్‌లోను ఈక్విటీ ఇన్వెస్ట్ చేసింది. కరోనా మహమ్మారి, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, చైనా యాప్‌ల నిషేధం సమయంలో చైనా సెంట్రల్ బ్యాంకు HDFCలో పెట్టుబడులు పెట్టడం ఆర్థిక మార్కెట్లో కలకలం రేపింది. ఇదే సమయంలో గత నెలలోను మరో ప్రయివేటు దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకులోను ఇన్వెస్ట్ చేసినట్లు వెలుగుచూసింది. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్‌లోకి పెట్టుబడులు వచ్చాయి.

ఒక శాతం కంటే తక్కువ
బజాజ్ ఫైనాన్స్ అధినేత రాహుల్ బజాజ్. ఇందులో చైనా బ్యాంకు 1.0 శాతం కంటే తక్కువగా పెట్టుబడులు పెట్టింది. దీంతో స్టాక్ ఎక్స్చేంజీలో ఫైల్ చేసే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్‌లో ప్రతిబింబించదు. ఈ పెట్టుబడులు ఎప్పుడు వచ్చాయో స్పష్టంగా తెలియరాలేదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి ఎండింగ్ సమయంలో షేర్ ధరలు భారీగా పడిపోయాయి. ఫిబ్రవరిలో షేర్ వ్యాల్యూ రూ.4,800 నుండి మార్చిలో కరోనా కారణంగా రూ.2200కు పడిపోయింది. ఓ సమయంలో రూ.2000 కంటే దిగువకు పడిపోయింది. ఆ సమయంలోనే చైనా బ్యాంకు ఇన్వెస్ట్ చేసి ఉంటుందని భావిస్తున్నారు.

ఇది మూడో పెట్టుబడి
భారత్‌లోని ఆర్థిక సంస్థల్లో చైనా బ్యాంకు ఇన్వెస్ట్ చేయడం ఇది మూడోది. మార్చిలో HDFC బ్యాంకులో తన వాటాను ఒక శాతం కంటే ఎక్కువకు పెంచుకుంది. ఆ తర్వాత ఐసీఐసీలోను ఇన్వెస్ట్ చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, బజాజ్ ఫైనాన్స్‌లో చైనా బ్యాంకు ఇన్వెస్ట్ చేసింది తక్కువ మొత్తమే. అయినప్పటికీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టడం ఆందోళన కలిగించే అంశం. బ్యాంకింగ్ రంగంలో ఏ పెట్టుబడిదారు అయినా 15 శాతానికి మించి పెట్టలేరు. 5 శాతానికి మించి పెడితే ఆర్బీఐ అమోదం అవసరం.

రూ.15 కోట్ల పెట్టుబడి..
గాల్వాన్ లోయ ఘటన సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పెట్టుబడులు వెలుగు చూశాయి. ఇటీవల సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు పెట్టుబడులు వచ్చాయి ఐసీఐసీఐ బ్యాంకు గత నెలలో రూ.15,000 కోట్ల నిధుల సమీకరణలో భాగంగా ఈ పెట్టుబడులు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యుషనల్ ప్లేస్‌మెంట్ కింద చైనా బ్యాంకు రూ.15 కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది.