Paytm: పీకల్లోతు నష్టాల్లో మునిగిన వేళ..విజయ్ శేఖర్ శర్మ రీఅపాయింట్‌మెంట్
ముంబై: ఈ మధ్యకాలంలో పీకల్లోతు నష్టాల్లో మునిగిన పోయిన ఫిన్‌టెక్ కంపెనీ ఏదైనా ఉందంటే అది.. పేటీఎం. అటు షేర్ల ధరలు పాతాళానికి చేరుకోవడం ఒక్కటే కాదు.. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాల్లోనూ ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్.. అన్‌హెల్తీగా కనిపించింది. జనవరి-ఫిబ్రవరి-మార్చి కాలానికి పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్.. 763 కోట్ల రూపాయల నష్టాలను చూపించింది.
అంతకుముందు- మూడో త్రైమాసికంలో 778.5 కోట్ల రూపాయల నష్టాన్ని చవి చూసింది. నాలుగో త్రైమాసికంలోనూ అవే నష్టాలను కొనసాగించింది. దీన్ని పూడ్చుకోవడానికి కంపెనీ యాజమాన్యం చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించట్లేదనేది ఈ ఆర్థిక సంవత్సరం ఫలితాలు స్పష్టం చేస్తోన్నాయి. 2021-2022 ఆర్థిక సంవత్సరం మొత్తానికీ భారీ నష్టాలనే నమోదు చేసిందీ ఆన్‌లైన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్. పేటీఎం షేర్ ధర 572 రూపాయల వద్ద శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ అయింది.

ఈ పరిణామాల మధ్య వన్ 97 కమ్యూనికేషన్స్ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా విజయ్ శేఖర్ శర్మను పునర్నియమించింది. ఆయనను అదే స్థానంలో రీ అపాయింట్ చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు రెగ్యులేటర్స్ వద్ద దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అందజేసింది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. విజయ్ శేఖర్ శర్మ పేటీఎం ఎండీ అండ్ సీఈఓ హోదాలో అయిదు సంవత్సరాల పాటు కొనసాగుతారు.
ఈ సంవత్సరం మే 20వ తేదీన విజయ్ శేఖర్ శర్మ కాల పరిమితి ముగిసింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదం తెలిపారు. దీనితో ఆయన 2027 మే 19వ తేదీ వరకు పేటీఎం ఎండీ అండ్ సీఈఓగా పని చేస్తారు. విజయ్ శేఖర్ శర్మతో పాటు మాధుర్ దేవ్‌రాను కూడా పునర్నియమించింది. ప్రస్తుతం ఆయన వన్ 97 కమ్యూనికేషన్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పని చేస్తోన్నారు.