Fact Check: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA పెంపు.. నిజమేనా?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA/DR 15 శాతం పెంచే అవకాశాలు ఉన్నాయని నెట్టింట్లో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. కేబినెట్ కార్యదర్శి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ కొన్సిల్ మిషనరీ (JCM) డియర్‌నెస్ అలవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR) పైన గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఊరట అని వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఈ డీఏ పెంపు జూలై 1వ తేదీ నుండి అమలవుతుందని పేర్కొన్నారు. నెట్టింట్లో ఈ వార్త చక్కెర్లు కొడుతుండటంతో కేంద్ర ఆర్థిమంత్రిత్వ శాఖ స్పందించింది.
జూలై 1వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ పెంపు వార్తలు వట్టి ప్రచారమేనని, అలాంటిది ఏమీ లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ఆగిపోయిన డీఏ జూలై 1, 2021 నుండి అందిస్తామని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ పేరిట ఆర్డర్లు వచ్చినట్లు నెట్లో చక్కెర్లు కొట్టాయి. 2020 జులై 1 నుండి 2021 జులై 1వ తేదీ వరకు లెక్కించిన డీఏను 3 విడతలుగా చెల్లిస్తామని ఉంది.

అయితే అలాంటి ఆఫీస్ మెమోరాండం (OM) ఏమీ జారీ చేయలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఆర్డర్ కాఫీలు నకిలీవి అని కేంద్రం ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. ఈ OM ప్రభుత్వం జారీ చేసింది కాదని, ఇది నకిలీది అని సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా తెలిపింది.