భారత్‌పై నెట్‌ఫ్లిక్స్ సీఈఓ వివాదాస్పద వ్యాఖ్యలు: ప్రేక్షకుడి నాడి పట్టుకోలేక
వాషింగ్టన్: నెట్‌ఫ్లిక్స్.. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ఈ రెండు సంవత్సరాల్లో సినిమా థియేటర్లకు ప్రత్యామ్నాయంగా మారిన ఓవర్ ది టాప్ ప్లాట్‌ఫామ్స్‌లల్లో ఇదీ ఒకటి. ప్రపంచం మొత్తాన్నీ కరోనా వైరస్ స్తంభింపజేసిన ఈ సంక్షోభ సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ తమ మార్కెట్ పరిధిని విస్తరింపజేసుకోగలిగాయి. ఓటీటీలంటే ఏమిటో సామాన్యుడికి కూడా తెలిసేలా చేశాయి. భారత్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ సినిమాలను విడుదల చేయడంలో విజయం సాధించ గలిగాయి.
ప్రైవేట్ బ్యాంక్ లాభాల పంట: మూడేళ్ల తరువాత తొలిసారిగా

నాడి పట్టుకోలేకపోతున్న నెట్‌ఫ్లిక్స్..
భారత్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విషయంలో నెట్‌ఫ్లిక్స్ అంచనాలు తప్పుతున్నట్టే కనిపిస్తోన్నాయి. తోటి ప్లాట్‌ఫామ్స్‌ను సమర్థవంతంగా ఢీ కొట్టలేకపోతుందనే అసహనం ఆ సంస్థ పెద్దల్లో వ్యక్తమౌతోంది. భారతీయ ప్రేక్షకుల నాడిని పట్టుకోవడంలో విఫలమౌతున్నట్టే. సినిమాల ఎంపిక వ్యవహారం మింగుడు పడట్లేదు. ఎలాంటి సినిమాలను భారతీయ ప్రేక్షకులు ఆదరిస్తున్నారనే విషయంపై ఓ సమగ్రమైన అవగాహనకు రాలేకపోతోంది నెట్‌ఫ్లిక్స్.

భారత్ మార్కెట్ ఫ్రస్ట్రేషన్..
ఈ పరిణామాలన్నీ ఆ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రీడ్ హేస్టింగ్స్‌లో తీవ్ర అసహనాన్ని నింపాయి. అది ఆయన మాటల్లో బయటపడింది. భారత మార్కెట్ ఫ్రస్టేటింగ్‌గా ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ప్రకటించే సమయంలో భారత మార్కెట్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. భారత్‌లో వ్యాపార కార్యకలాపాలను విస్తరించుకునే విషయంలో పాఠాలను నేర్చుకోవాల్సి ఉందని, అంచనాలను అందుకోలేకపోతున్నామని అన్నారు.

అతి తక్కువగా సబ్‌స్క్రిప్షన్
దీనికి కారణాలు లేకపోలేదు. 2015లో భారత మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. ప్రతి సంవత్సరం తన సబ్‌స్క్రిప్షన్‌ను భారీగా పెంచుకుంటూ వస్తోంది. గత ఏడాది మాత్రం ఈ సబ్‌స్క్రిప్షన్ భారీగా పడిపోయింది. 2015లో దేశీయ మార్కెట్‌లో అడుగు పెట్టిన తరువాత అతి తక్కువ 2021లో అతి తక్కువ సబ్‌స్క్రిప్షన్‌ను నమోదు చేసుకుంది. కొత్త చందాదారుల సంఖ్య భారీగా పడిపోయింది. ప్రస్తుత త్రైమాసికంలో నాలుగు మిలియన్ల కొత్త చందాదారులను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. దాన్ని అందుకోలేకపోయింది.

తొలి తొమ్మిది నెలల్లో
ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలంలో రెండున్నర మిలియన్ల వరకే పరిమితమైంది. భారత్‌లో కొత్త కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ విస్తృతంగా పుట్టుకుని రావడం దీనికి కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. అమెజాన్ ప్రైమ్‌తో పాటు జీ5, సోనీ లివ్, ఎంఎక్స్ ప్లేయర్, యుప్ టీవీ, వూట్‌తో పాటు ప్రాంతీయ భాషల్లో సన్ నెక్ట్స్, మనోరమా మ్యాక్స్, ఆహా వంటివి అందుబాటులో వచ్చాయి. థియేటర్లల్లో విడుదలకు నోచుకోని సినిమాలన్నీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మీద ప్రత్యక్షమౌతున్నాయి.

మార్కెట్ విస్తృతి
ఈ పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనడంలో నెట్‌ఫ్లిక్స్ కొంత వెనుకంజ వేసిందనేది సీఈఓ రీడ్ హేస్టింగ్స్ మాటల్లో స్పష్టమైంది. భారత్ ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ 206 మిలియన్ డాలర్లుగా ఉంటోంది. మరో అయిదేళ్లలల్లో అంటే 2026 నాటికి ఈ మార్కెట్ 226 మిలియన్ డాలర్లకు చేరుకుంటుదని అంచనా. నెలవారీ సబ్ స్క్రిప్షన్ మొత్తం అధికంగా ఉండటం వల్ల రెన్యూవల్ చేయించుకోవడానికి, కొత్తగా దీన్ని తీసుకోవడానికి ముందుకు రావట్లేదనే అభిప్రాయం మార్కెట్ వర్గాల్లో ఉంది.

రూ.3,000 కోట్ల పెట్టుబడికి సిద్ధంగా ఉన్నా..
భారత ఓటీటీ మార్కెట్‌లో 3000 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. దానికి అనుగుణంగా సబ్‌స్క్రిప్షన్ల సంఖ్య పెరగట్లేదని, ఇది నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యాన్ని తీవ్ర అసహనానికి గురి చేసిందని చెబుతున్నారు. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం డిస్నీ హాట్‌స్టార్ 36 మిలియన్ సబ్ స్క్రిప్షన్లతో టాప్‌లో ఉంది. 17 మిలియన్ చందాదారులతో అమెజాన్ ప్రైమ్ వీడియోస్ రెండో స్థానంలో కొనసాగుతోంది. నెట్‌ఫ్లిక్స్‌కు ఉన్న చందాదారులు అయిదు మిలియన్ల లోపే.