ముఖేష్ అంబానీ కొత్త రోల్స్ రాయిస్: కళ్లు చెదిరే ధర: స్పెషాలిటీస్ ఇవే
ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ- తాజాగా మళ్లీ వార్తల్లోకెక్కారు. ఇదివరకు లండన్‌లో 500 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే బంగళాను కొనుగోలు చేశారని, త్వరలో అక్కడికి కుటుంబంతో సహా మకాం మార్చబోతున్నారంటూ వార్తలొచ్చాయి. బంగళా కొన్న మాట వాస్తవమే అయినప్పటికీ- ఫ్యామిలీని మాత్రం షిఫ్ట్ చేయాలనుకోవట్లేదంటూ వాటిని కొట్టి పారేశారు అంబానీ.

రేటెంతో తెలుసా?
ఆయన కొనుగోలు చేసిన కొత్త కారు దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఆ కారు రేటు 13.14 కోట్ల రూపాయలు. దేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని కార్ల కంటే దీని రేటే ఎక్కువ. అల్ట్రా లగ్జరీ కార్ మేకర్స్ రోల్స్ రాయిస్ తయారు చేసిన కారు అది. ఈ రోల్స్ రాయిస్ కలినన్ కారు 2018లో భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. పెట్రోల్ మోడల్. ముంబై దక్షిణ ప్రాంతంలోని టార్డెయో రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్‌లో కారును రిజిస్టర్ చేయించారు.

20 లక్షలతో ట్యాక్స్
ఈ కారును లాంచ్ చేసిన మొదట్లో బేసిక్ ప్రైస్ 6.95 కోట్ల రూపాయలుగా ఉండేది. ఆ తరువాత ఇందులో పలు మార్పులు చేర్పులు చేసింది రోల్స్ రాయిస్ యాజమాన్యం. ఫలితంగా దాని ధరను పెంచాల్సి వచ్చింది. 12 సిలిండర్లతో పని చేసే ఈ కారు టస్కన్ సన్ కలర్‌తో అందుబాటులోకి తీసుకొచ్చింది. బరువు రెండున్నర టన్నులు. 564 బ్రిటీష్ హార్స్‌పవర్ దీని సొంతం. అన్ని రకాల పన్నులను కలిపి వన్ టైమ్ సెటిల్‌మెంట్ కింద 20,40,000 లక్షల రూపాయల మొత్తాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ఆర్టీఓ అధికారులకు చెల్లించింది.ఇందులో 40 వేల రూపాయలు రోడ్ సేఫ్టీ ట్యాక్స్.

కారు రిజిస్ట్రేషన్ నంబర్ కోసం..
ఈ కారు రిజిస్ట్రేషన్ నంబర్ 0001. ఈ వీఐపీ నంబర్ కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ అదనంగా 12 లక్షల రూపాయలను చెల్లించింది. సాధారణంగా వీఐపీ రిజిస్ట్రేషన్ కారు నంబర్ గరిష్ఠంగా నాలుగు లక్షల రూపాయల వరకు ఉంటుంది. కొత్త సిరీస్ ఆరంభం కావడానికి ముందే ఈ నంబర్‌ను రిజిస్టర్ చేయించినందున మూడింతల మొత్తాన్ని అధికంగా కట్టాల్సి వచ్చిందని ఆర్టీఓ అధికారులు పేర్కొన్నారు. రోల్స్ రాయిస్ కలినన్ మోడల్‌కు చెందిన రెండు కార్లు ఇప్పటికే ఆంటానియా కాంపౌండ్‌లో ఉన్నాయి. ఇది మూడోది.

లగ్జరీ కార్లు..
కాగా- ముంబైలోని తన నివాసం వద్ద భద్రత విధులను నిర్వహిస్తోన్న సిబ్బందికి ఆయన ఇదివరకే బీఎండబ్ల్యూ కార్లను అందజేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన భార్య, కుమారులు మోరిస్ గ్యారేజ్ (ఎంజీ) హెక్టార్‌లోని హైఎండ్ కార్ గ్లోస్టర్ మోడల్‌ను వాడుతున్నారు. కాగా- ప్రస్తుతం ముఖేష్ అంబానీ.. ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ కంటే ఆస్తిపరుడుయ్యారు. దీనికి కారణం జుకర్‌బర్గ్ ఆస్తులు హరించుకుపోవడమే.